కాల ప్రవాహంలో మరో ఏడాది గడచిపోతున్నది. మరి కొన్ని గంటల్లో ఈ ప్రపంచం కొత్త సంవత్సరంలోకి అడుగిడబోతోంది. పాత, కొత్తల పొలిమేరల్లో నిలబడి నిన్నటి చేదు, తీపి జ్ఞాపకాలను మననం చేసుకుంటేనే...వాటినుంచి గుణపాఠాలను నేర్చుకుంటేనే మెరుగైన రేపటిని పొందడం సాధ్యమవుతుంది. ఈ ఏడాది మొదట్లో తమిళనాట యథాలాపంగానో, యాదృచ్ఛికంగానో జరిగినట్టు కనబడిన ఉదంతం దాదాపు ఏడాదంతా దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు రూపాల్లో ఒక ధోరణిగా ముందుకు రావడం ప్రజాస్వామ్య ప్రియులందరినీ కలవరపాటుకు గురిచేసింది. దాని పేరు అసహనం. దాని ఊపిరి విద్వేషం.
సుప్రసిద్ధ తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్ జనవరి నెలలో చేసిన ప్రకటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ‘రచయిత పెరుమాళ్ మురుగన్ మరణించాడు. ఇకపై పి. మురుగన్ అనే సాధారణ టీచర్ మాత్రమే మిగులుతాడు. ఇకనుంచి ఎవరూ ఎలాంటి సాహితీ సమావేశాలకూ పిలవొద్దు’అంటూ ఫేస్‌బుక్‌లో ఉంచిన సందేశమది. నాలుగేళ్లక్రితం ప్రచురించిన నవలపై ఉద్యమం పుట్టుకురావడం, అది ఉద్రిక్తతలకు దారితీయడం, జిల్లా యంత్రాంగం మొత్తం కదిలి ఒత్తిళ్లు తీసుకొచ్చిన పర్యవసానంగా ఆ రచయిత సాహితీసృజన నుంచి తప్పుకుంటున్నానని ప్రకటిం చడం ఒక విషాదకరమైన పరిస్థితి అయితే... ఆ మరుసటి నెలలోనే మహారాష్ట్రలో హేతువాద భావాలను ప్రచారం చేస్తున్నారన్న నెపంతో సీపీఐ నాయకుడు గోవింద్ పన్సారేను దుండగులు కాల్చిచంపారు. ఆగస్టు నెలలో ప్రముఖ కన్నడ సాహితీవేత్త, హంపీ యూనివర్సిటీ మాజీ వైస్ చాన్సలర్ కల్బుర్గిని కూడా అలాంటి కారణాలతోనే పొట్టనబెట్టుకున్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమైన దేశ రాజధాని నగరం ఢిల్లీలో వరసబెట్టి చర్చిలపై దాడులు జరగడం అందరినీ ఆందోళనపరిచింది. విద్వేషాలను రెచ్చగొట్టే ఏ మత బృందాన్నయినా అనుమతించబోమని ప్రధాని నరేంద్ర మోదీ కఠినంగా హెచ్చరిం చాకగానీ పరిస్థితి చక్కబడలేదు. అంతకు ముందూ, ఆ తర్వాతా ఎన్నికల సంద ర్భంగా కొందరు కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపాయి. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో గొడ్డు మాంసం అమ్మకాన్ని నిషేధిస్తూ చట్టం తీసుకురావడం, బీజేపీ పాలిత రాష్ట్రాలైన హర్యానా, గుజరాత్, చత్తీస్‌గఢ్‌లు దాన్ని అనుసరించడం...జైన మతస్తులు పాటించే పర్యూషణ్ సందర్భంగా ముంబై నగరం, దాని శివార్లలో కొన్ని రోజులపాటు మాంసం అమ్మకాలను నిషేధించడంలాంటి చర్యలు కొత్త చర్చను లేవనెత్తాయి.
ఆ తర్వాత దేశంలోని వివిధ ప్రాంతాల్లో పశువుల్ని కబేళాలకు తరలిస్తున్నారన్న అనుమానంతో నలుగురు ట్రక్కు డ్రైవర్లను కొట్టి చంపడం వంటివి చోటు చేసుకున్నాయి. వీటన్నిటికీ పరాకాష్ట అనదగ్గది ఢిల్లీ శివార్లలో ఉన్న యూపీ పరిధిలోని దాద్రీలో జరిగింది. ఒక ముస్లిం కుటుంబం గొడ్డు మాంసం తింటున్నదని వదంతులు సృష్టించి, దాడిచేసి కుటుంబ పెద్దను కొట్టి చంపడం, అతని కుమారుణ్ణి తీవ్రంగా గాయపర్చడంఅందరినీ విస్మయానికి గురిచేసింది. వీటన్నిటికీ నిరసనగా వివిధ రాష్ట్రాల్లోని పేరెన్నికగన్న రచయితలు, కవులు, కళాకారులు, శాస్త్రవేత్తలు తమకొచ్చిన సాహిత్య అకాడమీ అవార్డుల్ని, పద్మ పురస్కారాలనూ వెనక్కి ఇచ్చారు. ఒక రచయితను బెదిరించడంతో మొదలైన అసహనం, విద్వేషాలపై మేధావి వర్గం ఈ స్థాయిలో ఏకమై ధ్వజమెత్తడం ఈమధ్య కాలంలో తొలిసారని చెప్పాలి.
ఏడాది ప్రారంభంలో ఎన్‌డీఏ ప్రభుత్వానికి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు షాకిస్తే... చివరిలో జరిగిన బిహార్ ఎన్నికలు దాన్ని మరింత కుంగదీశాయి. పార్లమెంటు యధాప్రకారం వాయిదాల్లోనే పొద్దుపుచ్చుతోంది. ఈసారి కూడా ప్రకృతి కన్నెర్రకూ, పాలకుల నిర్లక్ష్యానికీ రైతు బలయ్యాడు. ఎందరెందరో రైతులు రుణాల ఊబిలో కూరుకుపోయి ఊపిరి తీసుకోవడమే పరిష్కారమనుకున్నారు. ఇప్పుడున్న పార్లమెంటు భవనం శిథిలావస్థకు చేరుకుంటున్నదని, దాని స్థానంలో కొత్త భవనం నిర్మించాల్సి ఉన్నదని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ చేసిన ప్రతిపాదన భిన్నాభిప్రాయాలకు తావిచ్చింది. శతాబ్దాల చరిత్రతో, సంప్రదాయంతో ముడిపడి ఉన్న అలాంటి విశిష్టమైన భవనాన్ని వారసత్వ సంపదగా పరిగణించి, దాన్ని పరిరక్షించుకోవడానికి అవసరమైన మార్గాలను అన్వేషించాలని పలువురు సూచించారు.
భూసేకరణ చట్టానికి తీసుకొచ్చిన సవరణలను పార్లమెంటులో నెగ్గించుకోలేక చేత్తులెత్తేసిన ఎన్‌డీఏ సర్కారుకు... న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన ఎన్‌జేఏసీ చట్టాన్ని, అందుకు సంబంధించిన రాజ్యాంగ సవరణను సుప్రీంకోర్టు కొట్టేయడం పెద్ద ఎదురుదెబ్బ. ప్రధాని నరేంద్ర మోదీ సంప్రదాయ దౌత్య పద్ధతులను పక్కనబెట్టి పాకిస్తాన్‌తో చర్చల కోసం తీసుకున్న చొరవకు ఇంటా బయటా కూడా ప్రశంసలు లభించాయి. దీనికి కొనసాగింపుగా వచ్చే ఏడాది ఇరు దేశాలమధ్యా వివిధ స్థాయిల్లో జరగబోయే చర్చలు మంచి ఫలితాలనివ్వాలని అందరూ కోరుకుంటున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య చెలరేగిన మాటల యుద్ధం చివరకు శాసనమండలి ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యేలను కొనడానికి టీడీపీ ప్రయత్నించడంతో పతాకస్థాయికి చేరింది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన రేవంత్‌రెడ్డి ఒక టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేకు కరెన్సీ నోట్ల కట్టల్ని ఎరజూపుతూ అరెస్టయ్యారు. ఏసీబీ దాడిచేసి పట్టుకున్న ఆ కేసు ఇంతవరకూ ఓ కొలిక్కి రాలేదు. ఈ ఏడాదంతా ఆత్మవిశ్వాసాన్ని పెంచే, సంభ్ర మాశ్చర్యాలకు గురిచేసే పరిణామాలు ఓ పక్కా...మనోవేదన కలిగించే, దిగ్భ్రాంతిపరిచే అమానవీయ ఉదంతాలు మరోపక్కా సాగాయి. 2016 సంవత్సరం సమున్నత విలువలకు వేదికగా కాంతులీనాలని ఆశిద్దాం!