చీకటి దారుల్లోంచి... | editorial on IT crisis and impact on indian economy | Sakshi
Sakshi News home page

చీకటి దారుల్లోంచి...

Published Sat, May 13 2017 1:18 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

చీకటి దారుల్లోంచి... - Sakshi

చీకటి దారుల్లోంచి...

భారత మేధో శక్తిసామర్థ్యాలకు, అత్యాధునిక వృత్తి నైపుణ్యాలకు ప్రపంచఖ్యాతిని ఆర్జించిపెట్టిన మన ఐటీ రంగంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఐటీ దిగ్గజాలని పించుకుంటున్న కంపెనీలు నిత్యం వెలువరిస్తున్న లేఆఫ్‌లు లేదా ఉద్వాసనల ప్రక టనలు సర్వత్రా ఆందోళనకు కారణమవుతున్నాయి. నిన్నటి వరకు ‘నూతన సంప  న్నవర్గం’గా పిలిపించుకున్న ఐటీ ఉద్యోగులలో అభద్రత వ్యాపిస్తోంది. ఇన్ఫోసిస్, విప్రోలాంటి ఏడు అతి పెద్ద కంపెనీలు 56,000 మంది ఉద్యోగులను తొలగిస్తా  మని ఇప్పటికే ప్రకటించాయి. మొత్తంగా ఐటీ రంగంలో ఈ ఏడాది చివరికి లక్ష ఉద్యోగాలు గల్లంతవుతాయని అంటున్నారు. ఈ లేఆఫ్‌ల పరంపర మరో నాలుగేళ్ల యినా కొనసాగవచ్చని భావిస్తున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్‌ వంటి దేశాలు ఉద్యోగ వీసాలపై ఆంక్షలను కఠినతరం చేయడం, విదేశాలలోని ఐటీ కంపె నీలు స్థానికీకరణ బాట పట్టడం, ఐటీ రంగంలో వేగంగా విస్తరిస్తున్న ఆటోమేషన్, మాంద్య పరిస్థితులు తదితర అంశాలను ఈ సంక్షోభానికి కారణాలుగా చెబుతున్నారు.

ఇది మొత్తంగా దేశ ఆర్థిక వ్యవస్థపైనే తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని నెరప వచ్చని అంటున్నారు. ప్రపంచంలోని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను, 120 కోట్ల జనాభాగల దేశాన్ని దాదాపు 40 లక్షల ఉద్యోగులున్న ఐటీ రంగం ఎలా అతలాకు తలం చేయగలదు? పెద్ద నోట్ల రద్దు వంటి అతి పెద్ద కుదుపుకు లోనైనా ఈ ఆర్థిక సంవత్సరంలో 7.6 శాతం జీడీపీ వృద్ధిని సాధించగలమనే ధీమా మనది. అలాం టిది సాంప్రదాయక వ్యాపారంలో ఆరో వంతు మాత్రంగా ఉన్న డిజిటల్‌ రంగం మన ఆర్థిక వృద్ధిపై అంతటి ప్రతికూల ప్రభావాన్ని ఎలా నెరపగలుగుతుంది? సమాధానాలు ఐటీ రంగంలో వెదికితే దొరకవు. ‘చైనాలాగా మనం కూడా ఎగు మతి ఆధారిత వృద్ధిని అనుసరించాలని అనుకోవడం ప్రమాదకరం. విదేశీ మార్కె ట్లలో మాంద్యం నెలకొన్న నేటి పరిస్థితుల్లో తూర్పు ఆసియా దేశాలు.. చైనా అను సరించిన వృద్ధి మార్గాన మనం సాగలేం.

ప్రపంచం నేడు తయారీ వస్తువులను ఎగుమతి చేసే మరో చైనాను భరించగల స్థితిలో లేదు’ అని 2016 జూన్‌లో నాటి ఆర్‌బీఐ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ హె చ్చరించారు. ఆయన ప్రస్తావించినది మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమంతో వస్తుతయారీలో చైనాతో పోటీపడటం గురించే. కానీ ఆ ఎగుమతి ఆధారిత వృద్ధే 1991 నుంచి మనం అనుసరిస్తున్న అభివృద్ధి వ్యూçహా నికి పునాది. అప్పటి నుంచే మన దేశంలో ఐటీ, ఔట్‌ సోర్సింగ్‌ రంగాలు వేగంగా విస్తరించాయి. ఆశించినట్టుగా మన ఎగుమతులు ప్రపంచ మార్కెట్లను శాసించడం ఒక్క ఐటీ రంగంలోనే సాధ్యమైంది. అదే సమయంలో దేశీయ పారిశ్రామికరంగం, ప్రత్యేకించి చిన్న, మధ్యతరగతి పరిశ్రమలు, వ్యవసాయం నిర్లక్ష్యానికి గురవుతూ వచ్చాయి. ఫలితంగా మన ఆర్థికవ్యవస్థ ఉద్యోగాలులేని వృద్ధి తీరానికి చేరింది. అందుకే ఐటీ రంగ ఉద్యోగులు నేటి ఉద్వాసనల పర్వంలో బెంబేలెత్తి పోవాల్సి వస్తోంది.

అంతర్జాతీయ కార్మిక సంస్థ తాజా నివేదిక ప్రకారం, 1991–2007 మధ్య, భారత్‌ వేగవంతమైన వృద్ధి పథాన సాగిన కాలంలో సైతం మన జీడీపీ వృద్ధి 1 శాతం పెరిగితే ఉద్యోగితా కల్పనలోని వృద్ధి 0.3 శాతం మాత్రమే పెరిగింది. అది ఆ తర్వాత మరింతగా క్షీణిస్తూ 1 శాతం జీడీపీ వృద్ధికి 0.15 శాతానికి దిగజారింది. గత పదిహేనేళ్లుగా మనం అనుసరించిన వృద్ధి వ్యూహంలోని లొసుగులను ఐటీ, ఔట్‌ సోర్సింగ్‌ రంగాల ఉద్యోగుల వేతనాలు సాపేక్షికంగా అధికంగా ఉండటం వల్ల విస్త రించిన ఇతర రంగాల వృద్ధి కప్పిపుచ్చగలిగింది.

సంపన్నులు, అధిక ఆదాయాల ఉద్యోగుల డిమాండుపైనే ఆధారపడి మన కార్పొరేట్‌ రంగం విదేశీ పెట్టుబడులు, సాంకేతికతతో ఆటోమొబైల్స్‌ నుంచి సెల్‌ ఫోన్ల వంటి వినియోగవస్తు తయారీపైనే దృష్టిని కేంద్రీకరించింది. మన ఎగుమతు లతో ప్రపంచ మార్కెట్లను జయించగలమనే ప్రమేయంతో దిగుమతులకు తలు పులు తెరిచాం. ఫలితంగా చౌకగా లభించే విదేశీ వస్తువులతో మన పారిశ్రామిక, వస్తుతయారీ రంగాలు పోటీపడాల్సి వచ్చింది. పోటీపడగలిగేలా వాటిని తీర్చిదిద్దే కృషిని, ఆసరాను అందించే బాధ్యతను ప్రభుత్వాలు విస్మరించాయి. ఫలితంగా పారిశ్రామికరంగంలో నేటికీ పెద్ద ఎత్తున ఉపాధిని కల్పిస్తున్న చిన్న, మధ్యతరగతి పరిశ్రమలు దివాలాల అంచులకు చేరాయి. ఒకప్పుడు మౌలిక పరిశ్రమగా భావిం చిన ఇనుము–ఉక్కు రంగ సంస్థలు దిగుమతుల తాకిడికి తట్టుకోలేక బ్యాంకు రుణాలు చెల్లించలేని స్థితికి చేరాయి.

ఆచరణలో మన ఎగుమతి ఆధారిత వృద్ధి వ్యూహం, దేశాన్ని దిగుమతి ఆధారిత దేశంగా మార్చింది. అందుకు సాక్ష్యం మన వంట నూనెల దిగుమతులే. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాభివృద్ధిలో ప్రపంచంలోనే అగ్రశ్రేణిలో ఉన్నామనుకుంటున్న మనం ఏటా మనకు అవసరమైన వంట నూనె లలో 60 నుంచి 65 శాతం దిగుమతి చేసుకుంటున్నాం. వంటనూనెల డిమాండు ఏటా 6 శాతం పెరుగుతుంటే ఉత్పత్తి 2 శాతమే పెరుగుతోంది. 1986లో చేపట్టిన టెక్నాలజీ మిషన్‌ ఫర్‌ ఆయిల్‌ సీడ్స్, నూనెగింజల దిగుబడిని పెంచడంలో మంచి ఫలితాలనే ఇచ్చినా 1990ల నుంచి నత్తనడకన సాగింది. కారణం మొత్తంగా వ్యవ సాయరంగంపై ప్రభుత్వాలు చూపిన చిన్న చూపే. లేకపోతే వాతావరణ మార్పు లను తట్టుకునే పంటలు, నీరు పెద్దగా అవసరంలేని మెట్ట పంటల అభివృద్ధి దిశగా వ్యవసాయ పరిశోధనను విస్తరింజేసేవి.

నేటి వ్యవసాయ సంక్షోభాన్ని నివారించ గలిగి ఉండేవి. అదే జరిగి ఉంటే అతిపెద్ద రైతాంగ జనాభా ఆదాయాలు విస్తరించి, విస్తారమైన దేశీయ మార్కెట్‌ ఏర్పడేది. అది వస్తు తయారీ, పారిశ్రామిక రంగాల వృద్ధికి దోహదపడి ఉండేది. నేటి ఐటీ రంగ సంక్షోభాన్ని తట్టుకునే స్థితిలో ఆర్థిక వ్యవస్థ నిలిచేది. స్వేచ్ఛాయుత ఆర్థిక విధానాలను ప్రబోధించి అమలు చేయించిన అమెరికా వంటి దేశాలే నేడు రక్షణాత్మక విధానాలను అనుసరిస్తూ మన ఐటీ, ఔట్‌ సోర్సింగ్‌ రంగాలను సంక్షోభంలోకి నెట్టడం అనైతికమే కావచ్చు. కానీ అసలు బల హీనత వృద్ధి వ్యూహంలోనే ఉన్నదని గుర్తించడం అవసరం. ఇప్పటికైనా దాన్ని పున రాలోచించి, పునర్నిర్వచించుకోకపోతే దేశం లోతైన ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కోక తప్పదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement