నైతిక జీవనానికి అద్దం పట్టిన జాతక కథలు | emani siva nagireddy writes on horoscope stories | Sakshi
Sakshi News home page

నైతిక జీవనానికి అద్దం పట్టిన జాతక కథలు

Published Mon, Feb 6 2017 12:35 AM | Last Updated on Tue, Sep 5 2017 2:58 AM

నైతిక జీవనానికి అద్దం పట్టిన జాతక కథలు

నైతిక జీవనానికి అద్దం పట్టిన జాతక కథలు

సంబోధిని పొందకముందు బుద్ధుని పూర్వజన్మల గురించి తెలిపే 547 కథలే జాతక కథలు. బుద్ధుని ప్రామాణిక బోధలైన పాలీ భాషలోనున్న త్రిపిటకాల్లోని సుత్తపిటకంలోని ఖుద్ధక నికాయంలో జాతక కథల గ్రంథం ఒకటి. మానవుల ప్రవర్తనలోని వైఫల్యాలను సరిదిద్దడానికి, ఆ తప్పుల్ని సరిచేసుకోడానికి మరోకథను చెప్పి, తద్వారా ఆ తప్పుని చూపించటమే జాతక కథల ముఖ్యోద్దేశం. ప్రతి జాతక కథ, దానిని చెప్పవలసి వచ్చిన సందర్భాన్ని సూచిస్తూ మొదలై, మధ్యలో బోధిసత్వుని పూర్వజన్మ కథను కలిగి వుంటుంది. పరంపరగా సంప్రాప్తమైన లక్షణాలతో, సంకీర్ణమైన కారణ–కార్యసూత్రం జీవరాశిలో ఏ విధంగా పనిచేస్తుందో చెప్పటమే కథావస్తువుగా సాగుతుంది జాతక కథ. మానవులు, ప్రాణుల మధ్య ఎలాంటి భేదభావాన్ని చూపక, ప్రాణిక ఏకతను చాటుతూ, బుద్ధుడు బోధించిన అనిచ్చ(అనిత్య), దుక్క(దుఃఖ), అనత్త(అనాత్మ) అనే మూడు అక్షణాలు, పది శీల లక్షణాలు, నాలుగు ఆర్యసత్యాలతో కలిపి, నైతిక బోధ ప్రధానాంశంగా సాగుతాయి జాతక కథలు.

బుద్ధుడు చెప్పిన దశపారమితలు సాధిస్తే ఆ వ్యక్తి ఉత్తముడవుతాడు. దానం, శీలం, ప్రజ్ఞ, ఓర్పు, సత్యం ఇలాంటి పది గుణాలే దశపారమితలు. ఈ గుణాల్ని ఎలా రూపొందించు కోవాలి, ఎలా కాపాడు కోవాలి, ఎలా పెంపొందించు కోవాలో ఈ కథలు తెలుపుతాయి. నైతికతని కథల ద్వారా ముఖ్యంగా జంతువుల్ని, పక్షుల్ని, పాముల్ని పాత్రలుగా చేసి కథలుగా మలచడం ప్రపంచ సాహిత్యంలోనే తొలి ప్రయోగం. పంచతంత్ర కథలు, ఈసప్‌ కథలు, కథాసరిత్సాగరం, జొసాఫెట్‌ కథలు... పర్షియా, అరేబియా, గ్రీకు, రోమన్ల కథా రచనలూ, కొన్ని షేక్‌స్పియర్‌ రచనలూ ఈ జాతక కథల ప్రభావానికి లోనైనవే. ప్రపంచ బాలసాహిత్యానికి పునాదిరాళ్ళు ఈ జాతక కథలు.

భిక్ఖు ధమ్మరక్ఖిత సంపాదకత్వంలో ప్రముఖ బౌద్ధ రచయితలు బొర్రా గోవర్ధన్, బిక్ఖు ధమ్మరక్ఖిత ఈ గ్రం«థాన్ని పాలీ మూలం నుంచి సులభ వ్యావహారికంలో ఆసక్తికరంగా తెలుగులోకి అనువదించారు. జాతక కథలకు ఆచార్య బుద్ధఘోషుడు రాసిన ముందుమాటను భిక్ఖు ధమ్మరక్ఖిత తెనిగించారు. సద్ధర్మం చిరస్థాయిగా వుండటానికి బుద్ధుడు చెప్పినట్లు, పదాలు, వాక్యాలు సరైన క్రమంలో వుంటే వాటి అర్థాన్ని కూడా చక్కగా గ్రహించవచ్చు అన్న రెండు సూచనలను అనుసరించి అనువదించిన రచయితలు బౌద్ధ ధమ్మాన్ని, సాహిత్యాన్ని ఔపోసన పట్టిన దీక్షాపరులు. ఒక సాధకుడు ఎరుకలో సంకల్పించి, నైతిక ధార్మిక పురోగతిని సాధించి, సంసారంలోని ఇబ్బందులను అధిగమించి ప్రశాంతమైన, ఎల్లలు లేనటువంటి బుద్ధత్వాన్ని పొందే పరిణామాన్ని ఈ గ్రంథం చక్కటి కథన శైలిలో వివరించింది.

ఈ గ్రంథంలో జాతక వ్యాఖ్యానంలో మొదటిదైన దూరే నిదాన కథతో ప్రారంభమై, అపణ్ణకవ, శీల, కురుఙ్జ, కులావక, అత్థకామ, ఆసీస, ఇత్థి, వరుణ, పపాయుహ్హ, లిత్త, పరోసత, హంచి, కుసనాళి, అసమ్పదాన, కకణ్ణక అనే 15 వర్గాలలో, వర్గానికి 10 చొప్పున మొత్తం 150 కథలున్నాయి. భగవాన్‌ బుద్ధుడు జేతవనంలో వున్నప్పుడు అనాధపిండక శ్రేష్టికి మిత్రులైన 500 మంది తైర్థిక శ్రావకులకు చెప్పిన అపణ్ణక జాతకం ఈ గ్రంథంలో మొదటి జాతక కథ కాగా, బుద్ధుడు నాలందాలోని వేళువనంలో వున్నప్పుడు దుర్మతి అయిన దేవదత్తుని ఆదరించిన రాజు అజాతశత్రు గురించి చెప్పిన సజ్జీవ జాతక కథ, చివరి జాతక కథ.

2004లోనే బౌద్ధధర్మ పరిరక్షణ, ప్రచారాలకు పూనుకున్న (మునుపటి ఆనంద బుద్ధవిహార) మహాబోధి బుద్ధవిహార, బౌద్ధధమ్మ ఉపాసకులు చెన్నూరు ఆంజనేయరెడ్డి, సంబటూరి వీరనారాయణరెడ్డి అనుసంధానకర్తలుగా చేపట్టిన తెలుగు త్రిపిటక జాతక కథలు మొదటి భాగాన్ని వెలువరించింది. బౌద్ధ అభిమానులే కాక, నౌతిక వర్తనాన్ని అభిలషించే ప్రతి పాఠకుడూ సేకరించి, దాచుకోవలసిన గ్రంథం ఇది.
- డా||ఈమని శివనాగిరెడ్డి
9848598446

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement