జై బోలో పార్లమెంటు! | gaddar leaves maiost party recently | Sakshi
Sakshi News home page

జై బోలో పార్లమెంటు!

Published Thu, Apr 13 2017 2:31 AM | Last Updated on Mon, Oct 8 2018 8:37 PM

జై బోలో పార్లమెంటు! - Sakshi

జై బోలో పార్లమెంటు!

‘ఎర్ర చొక్కానే నీ కోసం మార్చాను.. సాయుధ పంథాకే గుడ్‌ బై కొట్టాను.. ఓటు బాటనే ట్రెండీగా పట్టాను.. పార్టీని వదిలేసి నీ కోసం వచ్చాను.. ఓటరూ.. లెట్స్‌ డూ ఓటింగూ..’ సుబ్బారావు ఆనందం పట్టలేక గద్దర్ని కావలించుకున్నాడు.

ప్రజాగాయకుడు గద్దర్, సుబ్బారావు చాలాకాలంగా స్నేహితులు. గద్దర్‌ మావోయిస్టు పార్టీకి రాజీనామా చేసినట్టు పేపర్లో చదవగానే సుబ్బారావు గద్దర్‌ ఇంటికి వెళ్లాడు. సుబ్బారావు లోపలి వెళ్లగానే గద్దర్‌ ఏదో సీరియస్‌గా రాసుకుంటూ కనిపించాడు. ఎదురుగా లాప్‌ టాప్, పక్కనే సీడీలు, పుస్తకాలూ... ‘రా, సుబ్బన్నా.. రా... చాలా కాలానికి కనిపించి నవు.. ‘నోరారా ఆహ్వానించాడు గద్దర్‌ సుబ్బారావుని. ‘నువ్వు మావోయిస్టు పార్టీకి రాజీనామా చేసి ప్రయోజన జీవన స్రవంతిలోకి వచ్చావు కదా.. శుభాకాంక్షలు చెప్పి పోదామని వచ్చాను’ అన్నాడు సుబ్బారావు. కొరకొరా చూశాడు గద్దర్‌. ‘గదేం మాట భై ...నేనేం అజ్ఞాతంలో లేను, అయినా ప్రయోజన జీవన స్రవంతి అని కొత్త మాట అంటున్నవేంది..’ అన్నాడు.

‘అంటే.. పార్లమెంటు, ఎన్నికలు, ఓటు అంటూ ఏదేదో మాట్లాడావు కదా.. అందుకే అలా అన్నా.. నాకో చిన్న డౌట్‌ అన్నా.. ఇదివరకు పోలీసులు నిన్ను మావోయిస్టు పార్టీ సభ్యుడివి అంటే అంతెత్తున ఎగిరి పడి ఖండించేవాడివి, కేవలం ఆ పార్టీ  సానుభూతిపరుణ్ణి అని చెప్పేవాడివి.. సానుభూతిపరుడివే అయితే రాజీ నామా చేయడమెందుకు, పార్టీ వాళ్లు నిన్ను బతిమాలడం ఎందుకు..’ తెగించి అడిగేశాడు సుబ్బారావు. ‘అది అప్పటి వ్యూహం.. అది ఒక చారిత్రక అవసరం..’ అనేసి మళ్లీ బరబరా రాసుకోవడంలో మునిగిపోయాడు గద్దర్‌. సుబ్బారావులో కుతూహలం పెరిగింది, గద్దర్‌ ఏంటి రాస్తున్నాడా అని. అదే అడిగాడు. గద్దర్‌ రాయడం ఆపి, మెటికలు విరుచుకుంటూ అన్నాడు.

‘చూడు సుబ్బన్నా.. గతంలో నేను కొన్ని వందల విప్లవ గీతాలు పాడిన.. కొన్ని వేరేటోల్లయి.. కొన్ని నేను రాసుకున్నయి.. గిప్పుడు మనం రూటు మార్చినం కదా.. మళ్లీ గవ్వే పాడితే బాగుండదని నా కొత్త పంథాకి తగ్గట్టుగా తిరగ రాస్తున్నా..’   ‘కొత్త పంథా అంటే ? ఎలగెలగెలాగా?’ అమాయకంగా అడిగాడు సుబ్బారావు. గద్దర్‌ నవ్వుతూ చెప్పాడు. ‘ఇన్నాళ్లుగా జనంకి నా పాటల ద్వారా ఏం చెప్పా ను? రాజ్యాంగాన్ని నమ్మొద్దన్నాను.. రాజ్యం మీద తిరగబడమన్నాను.. ఎన్నికలు బూటకమన్నాను.. ఎన్నికల్ని బహిష్కరించమన్నాను.. బులెట్‌ ద్వారా తప్ప బ్యాలెట్‌ ద్వారా పేదోడికి న్యాయం జరగదన్నాను.. సాయుధ పోరాటానికి సిద్ధం కావాలన్నాను.. గిప్పుడు సీను రివర్స్‌ అయింది బిడ్డా.. గిప్పుడు మనది ఎన్నికల పాట.. పార్లమెంటరీ ప్రజాస్వామ్య బాట.. దానికి తగ్గట్టుగా నా పాత పాటల్ని అటకెక్కించి వాటిని మార్చి తిరగరాస్తున్నా..’  ‘చాలా మంచి పని చేస్తున్నావు గద్దరన్నా .. ఏదీ, ఒక శాంపిల్‌ వినిపించు’


గద్దర్‌ ఒక్క గెంతులో నిలబడి ‘హా..’ అని పెడబొబ్బ పెట్టాడు. సుబ్బారావు తుళ్లిపడి, గద్దర్‌ పాటలోకి దిగుతున్నాడని గ్రహించి స్తిమితపడ్డాడు. గద్దర్‌ మొదలెట్టాడు. ‘ఈ ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా.. ఓటు మనదిరా, పోలింగ్‌ బూతు మనదిరా, మావో ఏందిరో.. వాని పీకుడేందిరో..’  సుబ్బారావు చప్పట్లు కొట్టాడు. ‘సూపరుంది గద్దరన్నా.. ఆ పాత చింతకాయ విప్లవ బాణీని వదిలేసి ఈ రోజులకి తగ్గట్టుగా ట్రెండీ వరసలో పాడరాదే..’ అని సలహా ఇచ్చాడు. గద్దర్‌కి ఆ సలహా నచ్చింది. ఎలాగో చెప్పమన్నాడు. వెంటనే సుబ్బారావు లాప్‌టాప్‌లో యూట్యూబ్‌ ఓపెన్‌ చేసి చిరంజీవి లేటెస్ట్‌ సినిమాలో పాట ప్లే చేశాడు. గద్దర్‌ ‘ప్రేమమ్‌’ సినిమాలో శృతి హాసన్‌లా ఒకటికి రెండుసార్లు విని, మళ్లీ ఎగిరి గంతెయ్యబోయాడు. సుబ్బారావు అతడ్ని చటుక్కున ఆపి, ‘ఈ పాటకి గంతులు, హా హూ లు లేవు’ అన్నాడు. గద్దర్‌ తల ఊపి చిరంజీవి స్టెప్పుల్తో పాట మొదలుపెట్టాడు.

‘ఎర్ర చొక్కానే నీ కోసం మార్చాను.. సాయుధ పంథాకే గుడ్‌ బై కొట్టాను.. ఓటు బాటనే  ట్రెండీగా పట్టాను.. పార్టీని వదిలేసి నీ కోసం వచ్చాను.. ఓటరూ.. లెట్స్‌ డూ ఓటింగూ..’  సుబ్బారావు ఆనందం పట్టలేక గద్దర్ని కావలించుకున్నాడు. ‘గద్దరన్నా.. ఇకనుంచి నువ్వు ప్రజాయుద్ధనౌకవి కావన్నా.. ఓటు యుద్ధనౌకవి..’ పారవశ్యంతో అన్నాడు. గద్దర్‌ కళ్లు చెమర్చాయి. ‘చాలా థాంక్స్‌ అన్నా.. అది సరే గానీ, ఇంకో పాట రాస్తూ చిన్న డౌట్‌ వచ్చి ఆపిన.. అది విని, ఆ డౌట్‌ తీర్చి పో..’ అన్నాడు. సరేనన్నాడు సుబ్బారావు. గద్దర్‌ మొదలుపెట్టాడు.

‘ఆగదు, ఆగదు, ఆగదు, ఈ బాలెట్‌ పోరు ఆగదు.. ఈ పార్టీ పాలన అంతం వరకు నా ఓట్ల పాట ఆగదు.. తొర్రపడ్డ ఊపిరితిత్తి ఊదూమంది రాగం తీసి, కిడ్నీనుంచి పోయిన తూటా మీటుమంది కిన్నెరనేమొ, ఈ ఎడమచేతిని చీల్చిన తూటా ఎత్తూమందీ ఎర్ర జెండా..’ అంటూ ఆగిపోయాడు గద్దర్‌. ‘గిప్పుడు ఎర్రజెండాని వదిలి పెట్టిన కదా సుబ్బన్నా.. ఏ రంగు జెండా రాయాల్నా అని ఆలోచిస్తున్న.. నువ్‌ జెప్పు..’ అన్నాడు. సుబ్బారావు కాసేపు ఆలోచించి, ‘తెల్ల రంగు అయితే బెటరేమో గద్దరన్నా..’ అన్నాడు. తెల్ల రంగు ఎందుకని అడిగాడు గద్దర్‌ అర్థం కాక. సుబ్బారావు వివరించాడు.

‘సాధారణంగా యుద్ధంలో ఓడిపోయినప్పుడు శత్రువుని శరణువేడుతూ సింబాలిక్‌గా తెల్లజెండా పట్టుకుం టారు కదా. నీ మారిన పంథాకి తెల్ల జెండా సూటవుతుం దని అలా చెప్పా.. సరే కాని సాయంత్రం రామాలయంకి వచ్చేయ్‌.. అక్కడ కలుద్దాం.. మాంచి భజన ప్రోగ్రాం ఉందిలే ఇవాళ.. కలిసి విందాం.. నే వెళ్తున్నా మరి..’

మంగు రాజగోపాల్‌, వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్టు
ఈమెయిల్‌ : mangurajagopal@gmail.com
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement