ప్రార్థనా స్థలాల్లో లైంగిక వివక్షా? | hani Shingnapur mandir: 400 years on, no temple for women | Sakshi
Sakshi News home page

ప్రార్థనా స్థలాల్లో లైంగిక వివక్షా?

Published Tue, Feb 2 2016 12:56 AM | Last Updated on Sun, Sep 3 2017 4:46 PM

ప్రార్థనా స్థలాల్లో లైంగిక వివక్షా?

ప్రార్థనా స్థలాల్లో లైంగిక వివక్షా?

విశ్లేషణ
శని దేవుని వేదికపైకి ఎక్కి ప్రార్థనలు జరపడానికి మగవాళ్లలాగే మహిళలు కూడా రుసుం చెల్లిస్తామంటే ట్రస్టు అంగీకరిస్తుందా? మత పవిత్ర స్థలాల వాణిజ్యీకరణ సాగిపోతోంది కాబట్టి, మహిళలు మరింత ఎక్కువ చెల్లించుకోవాల్సి వస్తుందా?

 పండరిపూర్‌లోని ప్రసిద్ధ విఠోబా ఆలయంలోకి దళితులకు ప్రవేశ హక్కును సాధించడానికి సంస్క రణవాద మరాఠీ రచయిత సానే గురూజీ దృఢ సంకల్పంతో కృషి చేసి, విజయం సాధించారు. గాంధీజీ ఆ ఉద్యమానికి మద్దతు నిచ్చారు. అంతకంటే ముందు 1927లోనే బాబాసాహెబ్ అంబేద్కర్, కొంకణ్‌లోని మహద్ సరస్సు నీటిని వాడుకునే హక్కు దళితులకు కావాలని విజయవంతంగా ఆందోళన సాగించారు. దళితుల పట్ల వివక్ష పూర్తిగా అంతమైందని కాదు. మహిళా అనుకూల సంస్కరణలకు మహారాష్ట్రలో సుదీర్ఘమైన చరిత్ర ఉంది. దేశంలోని మొట్టమొదటి బాలికల పాఠశాలను స్థాపించినది అక్కడే. ఒక మహిళ, సావిత్రీబాయి ఫూలే ఆ పాఠశాలలో ఉపాధ్యాయురాలు. ఇప్పుడు ఆ రాష్ట్ర మహిళలు ప్రార్థనా స్థలాలలో వివక్షకు అంతం పలకాలనుకుంటున్నారు. ఈ ఉద్యమం ప్రారంభమైనది, ఒక్కటి కాదు కనీసం రెండు ప్రార్థనా స్థలాల్లో ప్రవేశం కోసం. అవి, శని శింగనాపూర్, ముంబైలోని హాజీ ఆలీ దర్గా.

 మహారాష్ట్రలోని శనిశింగనాపూర్‌లో ఓ సంప్రదాయం ఉంది. ఇళ్లకు ద్వార బంధాలుంటాయే తప్ప తలుపులు ఉండవు. విలువైన వస్తువులను లోపల పెట్టుకుని తాళాలు వేసుకోవడమూ అరుదే. అయినా అక్కడ దొంగతనాలు బాగా అరుదు. అందుకు కారణం, అక్కడ కొలువై ఉన్న శని గ్రహం ‘‘సజీవ దైవం’’ కావడంతో ముడిపడి ఉంది. దైవాన్ని ప్రతిష్టించిన వేదిక మీదకు మహిళలను ఎక్కనివ్వకపోవడం అక్కడి మరో సంప్రదాయం. ఈ మహిళా వ్యతిరేక సంప్రదాయం మూలాలు పురాతనమైనవనడాన్ని అంగీకరించలేం. ఎందుకంటే మగాళ్లయినా సరే, ఆ దేవాలయానికి రూ. 11,111 చందా చెల్లించనిదే వేదికపైకి ఎక్కనివ్వరు. గుడి పూజారులు దురాశాపరులే కావచ్చేమోగానీ...  దైవారాధనకు నగదు చెల్లింపు పురాతన ఆచారం ఎంత మాత్రమూ కాకపోవచ్చు. తిరుపతిలో సైతం స్పెషల్ దర్శనం టికెట్లు ట్రస్టు నిర్ణయాలే. అలాంటప్పుడు, ఒక్క మహిళలపట్లనే ఈ వివక్ష చూపడం ఎందుకు?

 శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం కేసు సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉంది. అయినా ప్రార్థనా స్థలాలలో లైంగిక వివక్ష సమస్యకు నేడు మహారాష్ట్ర కేంద్రంగా ఉంది. హాజీ ఆలీ దర్గా, ముంబైలోని వర్లీ సముద్రపు కయ్యకు అంచున ఉంది. అక్కడ కూడా మహిళలు, మగవాళ్లలాగా ప్రార్థన చేసుకోవడానికి తమ ను అనుమతించడం లేదని ఫిర్యాదు చేస్తున్నారు. శబరి మలపై సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకునే వరకు హాజీ ఆలీ దర్గా కేసుపై ఆదేశాలను హైకోర్టు నిలిపి వేసింది.

 ముస్లింల ప్రార్థనా స్థలంగా పరిగణించే ఆ దర్గాలోకి హిందువులను ఎలాంటి ఆటంకం లేకుండా అనుమతిస్తారు. కాకపోతే తమ సొంత మతానికే చెందిన మహిళలు ఆ ప్రాంగణంలో ఎంత వరకు ప్రవేశించవచ్చు అనే విషయమై ఆంక్షలున్నాయి. అభ్యుదయ మహిళలు ఈ సమస్యను లేవనెత్తితే, ట్రస్టీలు రాజీలేని ధోరణిని ప్రదర్శించారు. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించారు.

 ట్రస్టీలు సంరక్షకులు, అపచారాలు ఏమీ జరగకుం డా చూసేవారు మాత్రమే. వారా విధులను విడనాడితే చెల్లించాల్సి వచ్చే మూల్యం ఏమిటి? పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి నాసిక్‌లోని త్రయంబకేశ్వర్‌లో ఉంది. మహిళలను అక్కడి లింగాన్ని తాకనివ్వరు. మిగతా జ్యోతిర్లింగాల విషయంలో అలాంటి ఆంక్షలు లేవు. మరి ఇదేమిటంటే, బ్రహ్మ, విష్ణులు కూడా అక్కడ కొలువై ఉన్నందున మహిళలను అనుమతించరాదంటూ ఆకుకు అందని, పోకకు పొందని వాదన చేస్తారు. అక్కడ కూడా ట్రస్టు ‘శతాబ్దాల క్రితం నాటి సంప్రదాయం’ గురించే మాట్లాడుతుంది.

 సంప్రదాయం గురించి మాట్లాడే శని శింగనాపూర్ లోని ట్రస్టీలు హఠాత్తుగా సంప్రదాయమనే తమ బలా న్ని వదులుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ ఆచారాన్ని కొనసాగించాలా, వద్దా? అనేది ప్రభుత్వమే నిర్ణయించా లన్నారు. శని శింగనాపూర్‌లోకి చొచ్చుకుపోవాలని నిర్ణయించుకున్న మహిళల బృందం... ఆ ఆచారాన్ని మార్చాలని కోరుతూ ఓ లేఖను రాయడంతో ట్రస్టీలు ఆందోళనకు గురికావడమే అందుకు కారణమనిపిస్తుం ది. నిర్ణయాలు తీసుకోవడానికి ప్రభుత్వాలు చాలానే సమయం తీసుకుంటాయనీ, మతం, మత విశ్వాసాలకు సంబంధించిన విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటానికే ప్రయత్నిస్తాయని మనకు తెలుసు.

 ఒక గ్రహమైన శనిని సంతుష్టుడిని చేస్తే, ముందు ముందు శని తమకు  అనుకూల దిశలోకి మరలుతాడని నమ్మకం. శనిశింగానపూర్ ఆలయ వేదిక మీదకు ప్రవేశాన్ని అడ్డగించే సంప్రదాయాల గురించి మాట్లాడేటప్పుడు ఒక ప్రశ్న తలెత్తుంది. వేదికపైకి ఎక్కడానికి మహిళ లు కూడా చందా చెల్లిస్తామంటే ట్రస్టు అంగీకరిస్తుందా? రూ.11,111 చెల్లించడం శతాబ్దాల క్రితపు ఆచారమని రుజువు చేసే దారి వెతుకుతుందా? ఇలా మత పవిత్ర స్థలాల వాణిజ్యీకరణ జరుగుతోంది కాబట్టి,  మహిళలు మరింత ఎక్కువ చెల్లించుకోవాల్సి వస్తుందా?  http://img.sakshi.net/images/cms/2015-03/71427657588_295x200.jpg   
 వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు,  మహేష్ విజాపుర్కార్
 ఈమెయిల్: mvijapurkar@gmail.com


 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement