పారిస్ శిఖరాగ్ర సదస్సులో నిరుడు డిసెంబర్‌లో దాదాపు 200 దేశాల మధ్య కర్బన ఉద్గారాల తగ్గింపుపై కుదిరిన చరిత్రాత్మక ఒడంబడికకు అనుగుణంగా దాన్ని ధ్రువపరుస్తున్నట్టు మన దేశం మహాత్ముడి జయంతి రోజున ప్రకటించింది. దీంతో ఇంతవరకూ అలా ధ్రువీకరించిన 60 దేశాల సరసన మనమూ చేరాం. ఈ దేశాలన్నీ 2005నాటి కర్బన ఉద్గారాల స్థాయిలో 33నుంచి 35 శాతాన్ని తగ్గించాల్సి ఉంటుంది.
2030నాటికి దీన్ని సాధించాలి. అందుకోసం మన దేశమైతే ఇప్పుడు వినియోగిస్తున్న శిలాజ ఇంధనాల శాతంలో 40శాతం కోత విధించుకోవాలి. వాటి స్థానంలో ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వాడకాన్ని ప్రారంభించాలి. ప్రపం చంలో 55 శాతానికి మించి కర్బన ఉద్గారాలకు కారణమవుతున్న 55 దేశాల్లో మన దేశం కూడా ఉంది. ఒప్పందం ఆచరణలోకి రావాలంటే కనీసం ఈ దేశాల ఆమో దం తప్పనిసరి.
వాస్తవానికి ఇంతవరకూ ధ్రువీకరించిన దేశాలు సంఖ్యాపరంగా చూస్తే 61 అయినా...వీటి వల్ల కలిగే కాలుష్యం 51.8 శాతం వరకూ ఉంది. పారిస్ సదస్సులో ఒడంబడికకు ఆమోదం తెలిపిన 196 దేశాల్లో ఒక్కొక్కటే ఈ జాబితాలో చేరుతుండటంవల్ల చాలా త్వరగానే మిగిలిన 3.2 శాతం పూర్తవుతుందని చెబు తున్నారు. గడువు ప్రకారం నవంబర్ 1 కల్లా ఆ దేశాలన్నీ ధ్రువీకరణ లాంఛనాన్ని పూర్తిచేయాల్సి ఉంది.
12 శాతం ఉద్గారాలకు కారణమవుతున్న యూరోపియన్ యూనియన్(ఈయూ) ఇప్పటికే ఆ దిశగా అడుగులేస్తున్నది. దీన్ని ఆచరణలోకి తీసుకొచ్చేందుకు అందరికన్నా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తొందరపడు తున్నారు. తన పదవీకాలం వచ్చే జనవరితో పూర్తవుతున్నందున ఈలోగానే దీన్ని అయిందనిపించాలన్నది ఆయన ఆరాటం. ఈ విషయంలో మన దేశంతోసహా చాలామంది ఆయనను సానుభూతితో అర్ధం చేసుకుని సహకరిస్తున్నట్టు కనబడుతూనే ఉంది.
వాస్తవానికి గత నెలలో చైనాలో జరిగిన జీ-20 శిఖరాగ్ర సదస్సులో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా...అంతకన్నా ముందు ఆగస్టులో అమెరికా విదేశాంగమంత్రి జాన్ కెరీ మన దేశంలో పర్యటించినప్పుడు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ వెనువెంటనే పారిస్ ఒడంబడిక ధ్రువీకరణ సాధ్యం కాదని తేల్చిచెప్పారు. పారిస్‌లో అంగీకరించి తీరా లాంఛనంగా ధ్రువీకరించవలసి వచ్చే సరికి ఎందుకీ జాప్యమని కొందరు ప్రశ్నించారు. వారిద్దరూ అందుకు రెండు కార ణాలు చెప్పారు. పారిస్ ఒడంబడిక అమలుకు అనుగుణంగా మార్పులు చేపట్టా లంటే రాగల పదేళ్ల కాలంలో లక్ష కోట్ల డాలర్లు(సుమారు రూ.66.55 లక్షల కోట్లు) అవసరమవుతాయి. కాలుష్యాన్ని వడబోసే హరిత సాంకేతికత(గ్రీన్ టెక్నాలజీ) కోసం వెచ్చించాల్సి వచ్చే సొమ్ము దీనికి అదనం. కనుక అభివృద్ధి విషయంలో రాజీ పడకుండా లక్ష్యాన్ని సాధించాలంటే... సంపన్న దేశాల చేయూత అవసరం.
అణు సరఫరా దేశాల బృందం(ఎన్‌ఎస్‌జీ)లో తమ సభ్యత్వం సంగతి ముందు తేల్చాల న్నది మరో డిమాండ్. ఎన్‌ఎస్‌జీలో చేరితే అణు విద్యుత్ రంగంలో సత్వర ప్రగతి సాధ్యమవుతుందని, శిలాజ ఇంధనాలపై ఆధారపడటం గణనీయంగా తగ్గుతుం దని మన దేశం భావిస్తోంది. ఈ అంశాల్లో విస్పష్టమైన హామీలు దొరక్కుండానే పారిస్ ఒడంబడికను ఇప్పుడు ధ్రువీకరించారు. అయితే ఎన్‌ఎస్‌జీ సభ్యత్వం, సం పన్న దేశాల ఆర్ధిక సాయం తదితరాలతో పారిస్ ఒడంబడిక ధ్రువీకరణను మన దేశం ఏనాడూ ముడిపెట్టలేదని కేంద్ర పర్యావరణ మంత్రి అనిల్ దవే అంటు న్నారు.
పారిస్ ఒడంబడిక వ్యవహారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, తమ మంత్రిత్వ శాఖ చూస్తున్నాయని...వివిధ స్థాయిల్లో సమాలోచనల వల్లే ఒడంబడిక ధ్రువీక రణలో ఆలస్యమైందని ఆయన సంజాయిషీ ఇస్తున్నారు. అంతేకాదు...దానికి సంబ ంధించి ఇతరులు వ్యక్తం చేసిన అభిప్రాయాలన్నీ వారి వారి వ్యక్తిగతమైనవని అంటున్నారు.
ఇది అన్యాయమైన మాట. విధానపరమైన అంశానికి సంబంధించి విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ జాన్ కెరీ వద్ద తన వ్యక్తిగతమైన అభిప్రాయాన్ని ఎలా చెప్పగలుగుతారు? జీ-20 వేదికపై నీతిఆయోగ్ వైస్ చైర్మన్ పనగారియా తన సొంత వాదన ఎందుకు వినిపిస్తారు? ఆ స్థాయి వారు మాట్లాడాక అవి వారి వ్యక్తిగతమని తేల్చడం సరికాదు. ఆ రెండింటి విషయంలో ఎందుకని మన పట్టు సడలించుకున్నామో చెబితే సబబుగా ఉండేది.
పర్యావరణ ముప్పు ముంచుకొస్తున్నదన్న వాదనతో ఎవరూ విభేదించడం లేదు. నిజానికి పారిస్ ఒడంబడిక దాని తీవ్రతను అవసరమైన స్థాయిలో పట్టిం చుకోలేదన్న విమర్శలున్నాయి. ఆ ఒడంబడిక 2050నాటికి భూతాపం పెరుగుదల ను కనీసం 2 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు పరిమితం చేయాలన్న సంకల్పాన్ని ప్రకటిం చినా... దాన్ని చేరుకోవడానికిచ్చిన హామీలు ఏమాత్రం సరిపోవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందువల్ల సాధ్యమైనంత త్వరగా ఒడంబడిక అమలు కావలసిందే. అయితే బొగ్గు వాడకంలో 29 శాతంతో చైనా అగ్రభాగాన ఉండగా అమెరికా 16 శాతంతో, యూరప్ 10శాతంతో దాని తర్వాత ఉన్నాయి.
ఉండటానికి మనం నాలుగో స్థానంలో ఉన్నా మన వినియోగం 5 శాతం మాత్రమే. కర్బన ఉద్గారాల వాటా దామాషాలో కోత విధింపు కూడా ఉంటే సంపన్న దేశాలపై అధిక భారం పడేది. కానీ పారిస్ శిఖరాగ్ర సదస్సులో సంపన్న దేశాలు పేచీకి దిగి అందరికీ సమాన బాధ్యత ఉంటుందని వాదించాయి. స్వచ్ఛ ఇంధనం కోసం చేసే కృషికి తమ వైపుగా ఆర్ధిక చేయూతకు, హరిత సాంకేతికత అందుబాటులో తీసుకొచ్చేం దుకు సిద్ధమేనని చెప్పి ఒడంబడికపై సంతకాలు చేయించాయి.
కానీ ఆ విషయంలో ఇంకా తగినంత స్పష్టత లేదు. ఈ పరిస్థితుల్లో మనం ధ్రువీకరణ లాంఛనాన్ని పూర్తి చేస్తే అవి తమ హామీలను నెరవేరుస్తాయా? 2030కల్లా మనం విద్యుదుత్పాదనలో పునరుత్పాదక ఇంధన వనరుల శాతాన్ని 40 శాతానికి పెంచాలి. ఇందుకోసం థర్మల్ కేంద్రాలను బాగా తగ్గించి సౌరశక్తి, అణు విద్యుత్, పవన విద్యుత్, జలవిద్యుత్ వనరులవైపు మళ్లాలి. మనపై ఇంత భారం ఉన్న నేపథ్యంలో సంపన్న దేశాల నుంచి స్పష్టమైన హామీ రాకుండా ధ్రువీకరణ సబబైందేనా? ఆలోచించాలి.
పారిస్ ఒప్పందానికి సై !
Published Tue, Oct 4 2016 1:17 AM | Last Updated on Mon, Sep 4 2017 4:02 PM
Advertisement
Advertisement