సాక్షర భారత్‌కు గొడ్డలిపెట్టు!
సందర్భం
ప్రస్తుతం ప్రాథమిక విద్యా వ్యవస్థలో అమల్లో ఉన్న నాన్ డిటెన్షన్ విధానం (అదే తరగతిలో విద్యార్థుల్ని కొనసాగిం చకూడదనే విధానం) వల్ల పరీక్షల్లో తప్పుతామనే భయం లేక పిల్లలు చద వడం లేదని, క్రమశిక్షణా రాహిత్యం పెరిగిందని దాంతో విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయని అందుకు నాన్ డిటె న్షన్ విధానాన్ని సమీక్షించాలని పలు రాష్ట్ర ప్రభుత్వాలు.. కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి.
ఈ నేపథ్యంలో బాలల ఉచిత, నిర్బంధ విద్యాహక్కు చట్టం 2009లోని 16వ సెక్ష న్‌లోని ‘‘బడిలో ప్రవేశం పొందిన బాలలను ఎలిమెంటరీ విద్య పూర్తి అయ్యే వరకు ఏ తరగతిలోనైనా మళ్లీ కొనసాగించకూడదు, బడినుంచి తీసివెయ్యకూడదు (అదే తరగతిలో మళ్లీ కొనసాగిం చడం, బడి నుంచి తీసివేయడం నిషేధం) అనే నిబంధనను సవ రించేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం సమ్మతిస్తూ ఐదవ తరగతి నుంచి 8వ తరగతి వరకు డిటెన్షన్ విధానం అమలు పర్చేందుకు ప్రతిపాదనలు రూపొందించింది.
భారత రాజ్యాంగంలోని అధిక రణం 45 ప్రకారం 14 ఏళ్ల వయస్సు వచ్చేవరకు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అందించే బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అయితే తాజా ప్రతిపాదనవల్ల పరీక్షల్లో తప్పిన పిల్లలు మళ్లీ అదే తరగతి కొనసాగించలేక పాఠశాలను వది లివేయడం ఖాయం. అంటే డిటెన్షన్ విధానం రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధమైన చర్యగా పేర్కొనవచ్చు. అంతేకాదు ఇది దేశంలో నిరక్షరాస్యుల సంఖ్య పెంపొందించడానికి తోడ్పడుతుంది. పేద విద్యార్థుల పాలిట పెను శాపంగా పరిణమిస్తుంది.
మన దేశంలో 2009లో విద్యను హక్కుగా ప్రకటించినప్పటికీ వందశాతం అక్షరాస్యత సాధించడంలో విఫలమయ్యాం. హంగెరి, రుస్తోనియా, ఆర్మీనియా, సెర్బియా వంటి అతి చిన్న దేశాలు నూటికి నూరు శాతం అక్షరాస్యత సాధించినా భారత్ 74 శాతం అక్షరాస్యత వద్దనే మిగిలి పోయింది. సర్వశిక్ష అభియాన్ లాంటి ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా, విద్యా హక్కు అమలుపర్చినా, నిర్బంధ ప్రాథమిక విద్యను అమలు చేయలేకపోయాం. ఇప్పుడు 5 నుంచి 8 తరగతులకు డిటెన్షన్ విధానం ప్రవేశపెడితే ఇంకా నిరక్ష రాస్యుల సంఖ్య పెరిగిపోయే ప్రమాదముంది.
మన పాఠశాల విద్యా వ్యవస్థలో పరీక్షా విధానమే లోపభూ యిష్టమైనదని, ఆ విధానాన్ని సమూలంగా సంస్కరించాలని విద్యా కమిషన్లు సిఫారసు చేసినందునే నాటి రాష్ట్ర ప్రభుత్వం 1971లో 7, 10 మినహా మిగతా అన్ని తరగతులకు పరీక్షలు రద్దు పరుస్తూ నాన్ డిటెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇది ఎంతో ఆదర్శప్రాయమైన విధానంగా పలువురు కొనియాడారు. దీనివల్ల పాఠశాలలో చేరే పిల్లల సంఖ్య మాత్రం పెరిగింది. దీనికి మధ్యాహ్నభోజన పథకం, ఉచిత పుస్తకాలు, దుస్తులు, మళ్లీ బడికి, ప్రాథమిక విద్యా పథకం, సర్వ శిక్ష అభియాన్ లాంటి కార్యక్రమాలు ఎంతగానో తోడ్పడ్డాయి. ఈ కారణంగా యునెస్కో గణాంకాల ప్రకారం మన దేశంలో 1981లో 29.3 కోట్ల మంది అక్షరాస్యులుండగా 2015 నాటికి వీరి సంఖ్య 93.1 కోట్లకు చేరింది.
ప్రాథమిక విద్యా స్థాయిలో విద్యా ప్రమాణాలు పెంపొందిం చాలనే ఉద్దేశంతో 5 నుంచి 8 తరగతులకు పరీక్షలు నిర్వహించా లని యోచించడమే కాదు... ఉత్తీర్ణతతో సంబంధం లేకుండా పై తరగతికి పోయే (నాన్ డిటెన్షన్) విధానాన్ని 8వ తరగతి వరకు రద్దు చేయాలని ఆగస్టు 2న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వార్షిక పరీ క్షల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థుల్ని 5, 8 తరగతుల్లో నిలిపివేయడా నికి రాష్ట్రాలకు అధికారం కల్పిస్తూ బాలల ఉచిత నిర్బంధ హక్కు సవరణ బిల్లులో తగిన మార్పులు కూడా చేయనున్నారు. అయితే దీనితో పరీక్షలతో విద్యా ప్రమాణాలు పెంపొందకపోగా మధ్యలో బడి మానివేసేవారి సంఖ్య పెరిగి రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధంగా రూపొందుతుంది. పరీక్షలు అనేవి కాలం చెల్లిన మందలాంటిది. అది వ్యాధి నివారణకు బదులు కొత్త జబ్బులొచ్చే ప్రమాద ముంది. ఏ అభివృద్ధి చెందిన దేశాన్ని పరిశీలించినా పరీక్ష విధానం ప్రాథమిక స్థాయిలో లేదనేది గుర్తించాలి.
అమెరికా 8, 9 గ్రేడులలో పరీక్ష కార్యక్రమం ప్రారంభం, రష్యాలో 8వ తరగతి దాకా.. స్వీడన్, ఫ్రాన్స్‌లో అసలు పరీక్షలే లేవు, జపాన్ ఉపాధ్యాయ నిర్మిత పరీక్షలు, ఇరాన్‌లో సామాన్య పరీక్ష మాత్రమే, మారుతున్న విధానాలకు అనుగుణంగా మన విద్యావిధానమూ మారాలి. విద్యా ప్రమాణాల పెంపుదలకు బాహ్య పరీక్షలే ప్రధానమని భావించడం సరికాదు. ప్రాథమిక విద్యాస్థాయిలో ఇవి వాంఛ నీయం కాదు. విద్యార్థుల హాజరు, సక్రమమైన బోధన, అభ్యాసనే అతి ముఖ్యమని గుర్తించాలి. సంవత్సరం పొడవునా మూల్యాం కనం నిర్వహిస్తే విద్యా ప్రమాణాలు పెంపొందడం ఖాయం.
ఈ పరిస్థితిలో మన దేశంలో తిరిగి డిటెన్షన్ విధానాన్ని అమ లుపరిస్తే ఎన్నటికి, ఎప్పటికీ సంపూర్ణ అక్షరాస్యత సాధించలేని దేశంగా మిగిలి విద్యా రంగంలో వెనుకబడిన దేశంగా భారత్ రూపొందుతుంది. సంపూర్ణ అక్షరాస్యత సాధనకు ప్రాథమిక విద్యా స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించనున్న 5 నుంచి 8 తరగతుల వరకు డిటెన్షన్ విధానాన్ని ఉపసంహరించుకొని, ప్రాథ మిక విద్యా వ్యవస్థను పరిరక్షించాలని కోరుకుందాం.
కొల్లు మధుసూదనరావు
వ్యాసకర్త జాతీయ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత
మొబైల్ : 98484 20070