ఫిరాయింపులతో ఓటరుకు అవమానం
మనసులో మాట
కొమ్మినేని శ్రీనివాసరావుతో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు
ఒక పార్టీ తరపున పోటీ చేసి గెలిచాక అవతలి పార్టీ ఏదైనా ఆశ చూపితే పార్టీ మారిపోవడం అంటే ఎన్నికల ద్వారా ఓటరు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగపర్చడమే అవుతుందని టాలీ వుడ్ ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్ పేర్కొన్నారు. జనం మీకు ఓటేసి గెలిపిస్తే ఆ పార్టీకే పనిచేయాలి కాని పార్టీలు మారిపోవడం విలువల రాహిత్యానికే నిదర్శనం అన్నారు.
నమ్మి ఓటేసిన ఓటరును అగౌరవపర్చటం రాజకీయ నేతలకు అలవాటు అయిపోయిందని విమర్శించారు. ధూమపానం కానీ, మద్యం కానీ, డ్రగ్స్ కానీ సినిమాలు రాకముందునుంచే సమాజంలో ఉన్నాయి కానీ సినీ పరిశ్రమ వల్ల అవి పెరగలేదని, ఏరంగంలో అయినా క్రమశిక్షణకే కెరీర్ ఉంటుందని, క్రమశిక్షణారాహిత్యానికి ఉండదంటున్న దగ్గుబాటి అభిప్రాయాలు ఆయన మాటల్లోనే..
మీ తండ్రి రామానాయుడు బ్రాండ్‌కు తగినట్లుగానే మీరు ఎలా నడుస్తున్నారు?
చిన్నప్పుడు నాన్న ఇంజనీరింగ్ చదువుకోమని చెబితే కోర్సు పూర్తి చేశాను. అమెరికా నుంచి తిరిగొచ్చి ఏదైనా పరిశ్రమ ఏర్పాటు చేయాలనుకున్నాను. కానీ పెట్టలేకపోయాము. ఆ సమయంలోనే దేవత సినిమా షూటింగ్ జరుగుతుంటే స్టూడియోలో చేరిపోయాను. దాంట్లో పుంజుకున్నాను. నాన్నకు సహాయంగా ఉండేవాడిని. డెవలప్‌మెంట్, డబ్బింగ్ స్టూడియోలు పెట్టడంలో పాలు పంచుకున్నాను. ఈలోగా వెంకటేశ్ చదువు ముగించి అమెరికా నుంచి తిరిగొచ్చాడు. తనతో తీసిన బొబ్బిలి రాజా వంటి కొన్ని సినిమాలు బాగా ఆడాయి. ఇక బయటకు వెళ్లాలనే కోరిక కూడా లేకుండా పోయింది. స్టూడియోలు, ల్యాబ్‌లు ఇలా సినీరంగంలోనే సెటిలైపోయాను.
మీ తాజా సినిమా ‘నేనే రాజు నేనే మంత్రి’ గురించి చెబుతారా?
ఇది జోగేంద్ర అనే సాధారణ వ్యక్తి కథ. ఈ సమాజంలో ఉండే చెడువల్ల తన భార్యకు జరిగిన అన్యాయం వల్ల అతడు ఎలా రాజకీయాల్లోకి ప్రవేశిం చాడు? రాజకీయాల్లోకి వచ్చాక వాటిని ఎలా ఉపయోగించుకున్నాడు? ఎలా దుర్వినియోగపర్చాడు? తర్వాత అతడు తప్పు తెలుసుకుని ఎలా బయటికొచ్చాడు అనేదే ఈ సినిమా కథ. ఒక మంచి ఫ్యామిలీ అంటే భార్యా భర్త ద్వారా చెప్పిన కథ ఇది. ఈ పాత్రలు చాలా నిజాలను ఓపెన్‌గా మాట్లాడేస్తాయి. ఆ పాత్రల ద్వారా ఇవ్వాళ్టి రాజకీయనేతలందరినీ చూస్తాం. అలా అని ఎవరినీ ఏకలేదు. నేతలందరినీ చూస్తాం.
ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారా?
ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కాదుగానీ, రాజకీయ వ్యవస్థకు వ్యతిరేకంగా ఉంటుందీ సినిమా. చాలామందికి చాలా కోపాలున్నాయి. ఒక పార్టీ తరఫున పోటీ చేసి గెలుస్తున్నారు. అక్కడేదో ఆశ చూపిస్తే ఈ కండువా వదిలేసి ఆ పార్టీలోకి వెళుతున్నారు. ఇది సరైందా కాదా? జనం నీకు ఓటేసి గెలిపిస్తే ఆ పార్టీకే పనిచేయాలి. కానీ నువ్వేమో వేరేవాళ్లు అధికారంలోకి వచ్చారు అని చెప్పి అటు వెళ్లిపోతావు. అంటే ఎన్నికల ద్వారా వచ్చిన అధికారాన్ని నువ్వు దుర్వినియోగపరుస్తున్నావు. ఓటేసిన ఓటరును అగౌరవపర్చడం అలవాటు చేసుకున్నావు.
బాబుతో మీకు మంచి పరిచయం ఉంది కదా, తనతోనే నేరుగా చెప్పవచ్చు కదా?
చాలాసార్లు చెప్పానండి. మా నాన్న రాజకీయాల్లో చేరినప్పుడుగానీ రాజకీయ వ్యవస్థ ఇలా ఉంటుందని నాకు అసలు తెలీదు. డబ్బులిచ్చి ఓట్లు కొనుక్కుంటారనే విషయాలు నాకు షాక్ కలిగించేవి. అందుకే మా నాన్న ఎంపీ అయ్యాక ఒక్కరోజు కూడా నేను ఢిల్లీ వెళ్లలేదు. వెళ్లానంటే అధికారాన్ని నేను దుర్వినియోగం చేస్తానేమో అని ఆలోచించాను. బాపట్ల నియోజకవర్గ ప్రజ లకు నాన్న సహాయం చేయాలి అంతే కాని ఇంజనీరింగ్ కాలేజీలు వస్తున్నాయి. మనం ఒకటి తీసుకుందాం అనే ఆలోచనలను కూడా నేను మనసులోకి రానివ్వలేదు.
ప్రస్తుత రాజకీయాలను చూస్తే ఏమనిపిస్తుంది?
ఏమంత సంతృప్తిగా లేను. ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో పోటీ చేసి అధికారం కావాలనుకుంటున్నారు. గెలిచి అధికారంలోకి వచ్చాక కొంతమేరకు పాలన చేస్తున్నారు కాని అది ఏమాత్రం సరిపోదు. ఆ మాత్రం సేవతోటే సంతోషపడే మనుషుల నుంచి ఓట్లు మళ్లీ పొందగలుగుతున్నారు. అందుకే రాజకీయనేతలు చేయాల్సింది చాలా ఉంది.
నాన్న పోటీ చేసినప్పుడు ప్రచారంలో మీకు ఏమనిపించింది?
బాగా తిరిగాను. చాలా వాస్తవాలను తెలుసుకున్నాను. నగరాల్లో మనం సుఖంగా ఉంటున్నాం. కానీ గ్రామాల్లో అన్ని సమస్యల మధ్య కొనసాగుతూ కూడా ప్రజలు చాలా పాజిటివ్‌గా బతుకుతున్నారు. కొన్ని ఊళ్లకు మేం వెళితే ఎన్టీరామారావుగారికి మేం ఓటేసినాం ఆయన్ను చూసే మీకు ఓటేస్తాం అనేవారు తగిలారు. ఆయనతో చాలా పాత జ్ఞాపకాలను వారు గుర్తు పెట్టుకున్నారు. వాళ్లకు కనీసంగా రోడ్లు లేవు. టాయిలెట్లు లేవు. కాని ఎప్పుడో ఒక చిన్న పని, సహాయం చేశారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకుని వారు ఓట్లు వేసేస్తున్నారు. మనకు ఎంత రెస్పాన్సిబిలిటీ ఉండాలండీ.. అలాంటి ప్రజలను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి అనిపిస్తుంది.
ఏ ముఖ్యమంత్రి అంటే మీకు బాగా ఇష్టం?
ఎన్టీరామారావు, రాజశేఖరరెడ్డి ఇద్దరూ నిజమైన నాయకులు. నిర్ణయాలను వేగంగా తీసుకోవడంలో వీరిని మించిన వారు లేరు. అందుకే వారిలో నాయకత్వ లక్షణాలు ఉండేవి. ఆ నిర్ణయాలు మంచివా, చెడువా అనేది ముఖ్యం కాదు. వారిలో లీడర్‌షిప్ గుణం ఉండేది.
సినిమావల్ల సమాజానికి మేలు జరుగుతోందా.. కీడు జరుగుతోందా?
సమాజానికి చాలా కోణాలనుంచి చెడు జరుగుతోంది. ఒక్కసినిమా వల్లే మార్పు జరగదు. ఆడమ్ ఈవ్ వచ్చిన రోజునుంచి వద్దన్న దాని జోలికి వెళ్లడం మనిషికి అలవాటు అయిపోయింది. ప్రకృతి సహజంగానే మనిషికి అది అలవాటయిపోయింది. దొంగతనం, రేప్ వంటివి తప్పు అయితే అవి సినిమాలు రాకముందు నుంచే సమాజంలో ఉన్నాయి కదా. ధూమపానం హాని కరం అని ప్రచారం చేస్తున్నాం. ఎంతమంది సిగరెట్లు తాగటం మానేశారు? తాగడం అనారోగ్యకరం అనే ఎరుక వచ్చింది కాని తాగడం మానలేకపోతున్నారు. ధూమపానం తప్పు అని ప్రభుత్వం నిజంగా గుర్తిస్తుంటే దాన్ని పూర్తిగా ఎందుకు బ్యాన్ చేయదు? మద్యం సరఫరా ఎందుకు ఆపేయదు? అందుకే మనం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాం. అభివృద్ధి అనే పేరుతోటి ఏది తప్పో దాన్ని మనం సమర్ధిస్తూ వస్తున్నాం.
డ్రగ్స్ కేసులో చిత్ర పరిశ్రమ పాత్ర గురించి?
డ్రగ్స్ భూతాన్ని ఆపగలిగిన శక్తి ప్రభుత్వానికే ఉంది. దేశ సరిహద్దులు, కస్టమ్స్ శాఖను దాటి డ్రగ్స్ వస్తున్నాయి. దాన్ని ఆపలేకపోతున్నారు. కానీ అలా వచ్చిన డ్రగ్స్ చిన్న పిల్లల వద్దకు చేరుకోవడం చాలా బాధాకరమైన విషయం. చిన్నపిల్లలను డ్రగ్స్‌కు బానిసలుగా చేస్తూ.. వారిని జీవిత కాల కస్టమర్లుగా మార్చేస్తున్నారు.
మరి డ్రగ్స్ తీసుకున్నారంటున్నవారిపై మీ అభిప్రాయం?
వారు బాధితులే కానీ నేరస్తులు కాదండి. సినీ పరిశ్రమలో చిన్న ఘటన జరిగినా చాలా పెద్దగా ప్రచారం చేస్తారు. అది భరించాల్సిందే. క్రమశిక్షణా రాహిత్యాన్ని చిత్రపరిశ్రమ ఎన్నడూ సహించదు. ఎవరైనా తాగి సెట్‌లోకి వస్తేనే వారికి పని దొరకదు. ఇలాంటి వారిని తట్టుకోలేమని పంపించేస్తుంటాం. ఏ రంగంలో అయినా క్రమశిక్షణకే కెరీర్ ఉంటుంది, క్రమశిక్షణా రాహిత్యానికి ఎక్కడా కెరీర్ ఉండదు. డ్రగ్స్ తీసుకున్న వారి వల్ల షూటింగులో ఎవరికీ ఇబ్బంది కలిగి ఉండదు కాబట్టి వారి అలవాటువల్ల చిత్ర పరిశ్రమ ప్రభావితం కాలేదు.
(సురేశ్ బాబుతో ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి)
https://goo.gl/smJCxE