ఇది తగునా?!
బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవారు నోరు పారేసుకోవడం తరచు జరిగేదే. మహిళలకు సంబంధించిన అంశాల్లో ఈ ధోరణి మరీ ఎక్కువ. పక్షం రోజుల నుంచి దేశమంతా పెద్ద నోట్ల రద్దు, దాని పర్యవసానాలపైనే దృష్టంతా కేంద్రీకరించగా కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ అత్యాచారాలపై వివాదాస్పద వ్యాఖ్య చేశారు. అత్యాచారాల సంఖ్య కనిష్ట స్థాయిలో ఉన్న నాలుగు దేశాల్లో భారత్ ఒకటని చెప్పి అందరినీ దిగ్భ్రమపరిచారు. ఆమె చెప్పిన గణాంకాలు, వాటిని వివరించిన తీరు మహిళల్ని మాత్రమే కాదు... అందరినీ బాధిస్తాయి. ఈమధ్య ఆమె స్వీడన్ పర్యటనకెళ్లినప్పుడు మహిళలకు భారత్‌లో భద్రత లేదని అన్నప్పుడు ఈ గణాంకాలు చెప్పానని ఆమె వివరించారు. అంతే కాదు... మన దేశంలో ఆ ఉదంతాలు మీడియాలో ఎప్పటికప్పుడు వెల్లడవు తుండటంవల్ల అధికంగా జరుగుతున్నాయన్న అభిప్రాయం కలుగుతోందని వివరించానన్నారు.
ఈ మాదిరి ఘటనల్లో బాధితులనే నేరస్తులుగా చూసే మనస్తత్వం వల్ల కావొచ్చు... బయటకు వెల్లడైతే పరువు పోతుందని, భవిష్యత్తు దెబ్బ తింటుందని ఆందోళన పడటం వల్ల కావొచ్చు... ఏళ్లతరబడి దర్యాప్తు పేరుతో, విచారణ పేరుతో తిరగాల్సి వస్తుందన్న బెంగతో కావొచ్చు- చాలామంది బాధితులు మన దేశంలో ధైర్యంగా ముందుకు రావడం లేదు. పెపైచ్చు రాజకీయ ఒత్తిళ్లు, డబ్బు ఎర చూపడం, కేసుల వరకూ వెళ్లకుండా చూడటం వంటివి సరేసరి. నేరగాళ్లు బాధితులకు సమీప బంధువులైతే పరిస్థితి మరింత ఘోరంగా ఉంటుంది. ఫిర్యాదు ఇవ్వడానికొచ్చే బాధితుల్ని పోలీస్‌స్టేషన్లలో ప్రశ్నించే తీరు సరేసరి. ఇన్ని అవరోధాలు దాటుకుని కేసులు వెలుగులోకొచ్చినా అవి నత్తనడకన సాగు తున్నాయి. ఈలోగా నిందితులు నిర్బంధంలో ఉండి లేదా బెయిల్‌పై బయటికొచ్చి బెదిరిస్తున్నారు.
ఇటీవల అసోం నుంచి మధ్య ప్రదేశ్ వరకూ జరిగిన వేర్వేరు ఉదంతాల్లో నిందితులు బెయిల్‌పై బయటికొచ్చి బెదిరించిన పర్యవసానంగా కనీసం ముగ్గురు యువతులు ఆత్మహత్యాయత్నం చేశారు. వారిలో ఒకరు మరణించారు. నిప్పంటించుకున్న ఒక దళిత బాలిక 40 శాతానికి పైగా కాలిన గాయాలతో నరకం చవిచూస్తోంది. వాస్తవాలు ఇలా ఉంటే మేనక ఏ ప్రాతిపదికన మన దేశం మెరుగ్గా ఉన్నదని చెప్పగలిగారో... ప్రతి లైంగిక నేరం మీడియాలో వస్తున్నదని అనగలిగారో అనూహ్యం. నిజమే... నిర్భయ ఉదంతం తర్వాత లైంగిక నేరాలపై బాధితులు ఫిర్యాదు చేయడం పెరిగింది. అప్పట్లో దేశవ్యాప్తంగా పెల్లుబికిన ఆగ్రహావేశాలు చూసి తమకు సమాజం అండ దండలుం టాయని, కేసులు సత్వరం కొలిక్కి వస్తాయని, నిందితులకు ఖచ్చితంగా శిక్షలు పడతాయని బాధితులు ఆశించడమే ఇందుకు కారణం. అయితే మారిందేమీ లేదని అర్ధమయ్యాక మళ్లీ పూర్వస్థితే ఏర్పడింది.
మహిళలపై సాగుతున్న నేరాలను అరికట్టడానికి కఠినమైన చట్టాలుండటం ఒక్కటే చాలదని... ఆ తరహా కేసుల్ని సత్వరం పరిష్కరించి నిందితులకు శిక్ష పడేలా చూడటం అవసరమని మానవహక్కుల సంఘాలు, మహిళా సంఘాలు డిమాండు చేస్తున్నాయి. న్యూఢిల్లీలో నిర్భయ ఉదంతం జరిగినప్పుడు వెల్లువెత్తిన ఆందోళనల పర్యవసానంగా నిర్భయలాంటి కఠిన చట్టం వచ్చింది. కానీ దాని వల్ల నేరాలు తగ్గిన దాఖలాలు లేవు. కారణం పాతదే. యథాప్రకారం నిందితుల అరెస్టు మొదలుకొని ఆ కేసుల దర్యాప్తు, విచారణ వరకూ అన్నీ ఎప్పటిలా నత్త నడకన నడుస్తున్నాయి. జాతీయ క్రైం రికార్డుల బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) గణాంకాలను బట్టి చూస్తే నిరుడు మన దేశంలో 34,651 అత్యాచారాలు చోటు చేసుకున్నాయి. అందులో 95.5 శాతం కేసుల్లో నేరగాళ్లు బాధితులకు తెలిసిన వారు. అయినా పోలీసులు విఫలమవుతున్నారు. ఇక శిక్షపడిన సందర్భాలు అత్యల్పం. నిరుడు కేవలం 29.37 శాతం కేసుల్లో మాత్రమే దోషులకు శిక్షపడింది. సామాజిక, ఆర్థికాభివృద్ధిలో దేశాల మధ్య పోలిక తీసుకురావడం వేరు. నేర గణాంకాలు ముందు పెట్టుకుని ఎవరెంత మెరుగ్గా ఉన్నారో లెక్కలేయడం సాధ్యంకాదు.
లైంగిక నేరాల విషయమే తీసుకుంటే స్వీడన్ అవగాహనకూ, మన అవగాహనకూ ఎంతో తేడా ఉంది. అక్కడ మహిళలపై జరిగే వివిధ రకాలైన 52 నేరాలను అత్యాచారం పరిధిలో చేర్చారు. 2005లో అక్కడి సోషల్ డెమొక్రటిక్ ప్రభుత్వం తెచ్చిన చట్టం ప్రకారం ఒక మహిళను ఆమె ఇష్టానికి విరుద్ధంగా తాకినా దాన్ని అత్యాచారంగా పరిగణిస్తారు. భర్త తనపై నాలుగుసార్లు అత్యా చారం చేశాడని మహిళ ఫిర్యాదు చేస్తే అతనిపై నాలుగు రేప్ కేసులు పెడతారు. వేరే దేశాల్లో ఇవన్నీ ఒక కేసుగానే పరిగణిస్తారు. మన దేశంలో అదీ లేదు. దాంప త్యంలో ఇలాంటివి చోటు చేసుకున్నా ఆ సమస్య ‘సున్నితమైనది, సంక్లిష్టమైనది’ గనుక ప్రభుత్వం జోక్యం చేసుకోలేదని, మన దేశంలోని పరిస్థితులు అందుకు అనుమతించవని ఇదే మేనకాగాంధీ అయిదు నెలలక్రితం లోక్‌సభలో చర్చ సంద ర్భంగా చెప్పారు. పైగా స్వీడన్‌లోని సామాజిక స్థితిగతులు లేదా ఇలాంటి కేసు లతో వ్యవహరించడంలో అక్కడి పోలీసులు అనుసరించే విధానాలు మహిళలు ధైర్యంగా ఫిర్యాదు చేయడానికి వీలుకల్పిస్తున్నాయి.
ఇలాంటి అంశాలపై ఉన్నతాధికారులతో, పౌర సమాజ ఉద్యమకారులతో చర్చిస్తే మంత్రికి వాస్తవ పరిస్థితిపై అవగాహన కలగడం కష్టం కాదు. మహిళలు, బాలికలపై లైంగిక నేరాలను అరికట్టడానికి అవరోధమవుతున్నవేమిటో, వాటిని అధిగమించడానికి ఏం చేస్తే బాగుంటుందో మేనకాగాంధీ దృష్టి పెట్టాలి. నేరగాళ్లు ఎందుకు తప్పించుకుంటున్నారో, ఎక్కడ వైఫల్యాలు ఎదురవుతున్నాయో ఆరా తీయాలి. అంతేతప్ప ఇక్కడ అంతా సవ్యంగా ఉన్నదని, అందరికన్నా మనమే మెరుగ్గా ఉన్నామని భ్రమపడితే సమస్య తీరదు సరికదా... మరింత జటిలమ వుతుంది. అత్యాచారాల విషయంలో కొందరు మగ నేతలు ఎటూ బాధ్యతా రహితంగా మాట్లాడుతున్నారు. మహిళలు, అందునా మేనకాగాంధీలాంటి వారు అసంకల్పితంగానైనా ఆ ధోరణికి చోటీయడం మంచిది కాదు.