నేడు ఉపాధ్యాయదినోత్సవం
తెలుగులో మొదటి అకారాది నిఘంటువు ‘ఆంధ్రదీపిక’(1806), మొదటి చరిత్ర సంచిక ‘రాజరాజ నరేంద్ర పట్టాభిషేక సంచిక’(1921), మొదటి పదచిత్రాల సమాహారం ‘విశాలాంధ్రము’(1940), మొదటి పాఠశాల స్మతులు ‘మా బడి’(1950) పుస్తకాలను రవికష్ణ సంపాదకుడిగా పునఃప్రచురించి అందుబాటులోకి తెచ్చాడు.
ఒకప్పటి మల్లంపల్లి సోమశేఖరశర్మ, నేలటూరి వెంకటరమణయ్య, సురవరం ప్రతాపరెడ్డి, శేషాద్రిరమణ కవుల వంటి వారిలాగా సాహిత్యాన్నీ, చరిత్రనూ ద్వయానుసంధానంగా భావించి పరిశోధనను కొనసాగించినవారు అరుదైపోయారు. అట్లాంటి పెద్దల పరంపరలో కొనసాగుతున్న నవతరం సంపాదకుడు మోదుగుల రవికష్ణ. అతడికి ప్రాచీన చారిత్రకాంశాల పట్ల వల్లమాలిన మక్కువ. భాషా సాహిత్యాలంటే వెలకట్టలేని అభిమానం. అదే ఆయన్ని ఎన్నో విలువైన పుస్తకాలకు సంపాదకత్వం వహించేలా పురిగొల్పింది.
గుంటూరులోని ఆర్వీఆర్ బి.యిడి. కళాశాలలో తెలుగు లెక్చరర్‌గా అన్ ఎయిడెడ్ పోస్టులో పనిచేసే వ్యక్తి తనకొచ్చే అల్పమైన జీతంతో సంసారాన్ని నెట్టుకురావడమే కష్టమైన పని. అలాంటిది సాహిత్యమూ, తత్సంబంధమూ అయిన 40 పుస్తకాలకు సంపాదకత్వం వహించి, మూడు పుస్తకాలు స్వయంగా రచించి ప్రచురించాడంటే ఆశ్చర్యకరంగా వుంటుంది! విశాఖపట్టణం తాలుకాలో రామప్పంతులు పప్పులేని పులగం లేనట్లు గుంటూరు మండలంలో రవికష్ణ ప్రమేయంలేని తెలుగు సాహిత్య కార్యక్రమాలు ఉండవు. అలాగని కేవలం గుంటూరులోనే కాదు, ఉభయ తెలుగురాష్ట్రాల్లోని అనేక మంది సాహిత్యకారులతోనూ, సంగీతజ్ఞులతోనూ, చరిత్రకారులతోనూ, నాట్యకారులతోనూ రవికష్ణది గాఢమైన పరిచయం!
‘మమ్మీ డాడీ వద్దురా ! అమ్మా నాన్నా ముద్దురా’, ‘తెలుగు భాష తల్లి వంటిది. పరాయిభాష ప్రియురాలు వంటిది’ లాంటి సజనాత్మకమైన నినాదాలతో బజారున పడి భాషాసేవ విరివిగా చేస్తున్నామనుకొని మురిసిపోయే తెలుగు ప్రేమికులు బలిసిన రోజులివి. ఒక భాషను కాపాడుకోవాలంటే, ఆ భాష మాట్లాడే ప్రజల జాతీయతనూ, రాజకీయ, ఆర్థిక, సాంస్కతిక చరిత్రనూ విపులంగా అధ్యయనం చేయాలనేది రవికష్ణ దష్టి. భాషకూ, ఆయా చరిత్రలకూ అవినాభావ సంబంధం ఉంటుందనేది అతను నమ్మిన సత్యం. మల్లంపల్లి సోమశేఖరశర్మ చరిత్ర వ్యాసాలు ‘బౌద్ధయుగము’, ‘చారిత్రక వ్యాసమంజరి’, శ్రీ రాజరాజ నరేంద్ర పట్టాభిషేక సంచిక, శ్రీకష్ణదేవరాయల పట్టాభిషేక పంచశతాబ్ది ఉత్సవ ప్రత్యేక సంచిక వంటి పుస్తకాల ప్రచురణ ద్వారా తెలుగు ప్రజల సాంస్కతిక రాజకీయ చరిత్రలను రవికష్ణ మనకు పరిచయం చేస్తాడు. ఇక్కడొక సంగతి చెప్పాలి. రవికష్ణకు రాయలంటే పిచ్చి అనదగినంతటి అభిమానం.
అందుకే, ‘పంచశతాబ్ది’ సందర్భంగానే 42 మంది దిగ్ధంతులు రాసిన వ్యాసాలతో మరో పుస్తకం ‘వనమాల’ తెచ్చాడు. ‘రాయవాచ’కాన్ని ఎన్నో విలువైన వివరణలతో మళ్లీ ముద్రించి రాయల వంశానికి చెందిన 18వ తరం శ్రీకష్ణదేవరాయలు చేత ఆవిష్కరింపజేశాడు. మనకు సినిమాల వల్ల అలవాటైన రాయలు కాకుండా, అసలు రాయలరూపం ఎలావుండేదో తేల్చడానికి దాదాపు 18 శిల్పచిత్రాలు సేకరించి రాయని గిరిధర్‌గౌడ్ చేత రాయల రూపాన్ని చిత్రింపజేశాడు. ఇక, నాట్యంపై వెలువరించిన ప్రత్యేక సంచిక మహామంజీర నాదం నాట్యకళ పట్ల అతని అభిరుచిని తెలుపుతుంది. ‘విఠ్ఠల కీర్తనలు అన్నమయ్యవా’ అనే మకుటంతో స్వయంగా రాసిన వ్యాసాల సంపుటి అతనిలోని పరిశీలనాసక్తిని, పరిశోధన శక్తిని వెల్లడి చేస్తుంది. హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణ దాసు స్వీయ చరిత్ర ‘నా యెఱుక’, చెల్లపిళ్ల వెంకటశాస్త్రి స్వీయచరిత్ర భాగం ‘కాశీయాత్ర’, ‘దేశభక్త’ కొండ వెంకటప్పయ్య స్వీయచరిత్ర వంటి గ్రంథాలకు రవికష్ణ సంపాదకత్వం ఎంతో నిండుతనాన్ని తెచ్చింది. ఈ విషయంలో, బొమ్మిడాల శ్రీకష్ణమూర్తి ఫౌండేషన్ రవికష్ణకు ప్రోత్సాహం అందిస్తోంది.
సంపాదకుడంటే సంపూర్ణ మనుషుడు, చింపాంజీ కన్న నయము అని శ్రీశ్రీ సంపాదకులను యెద్దేవా చేశాడు. రవికష్ణను చూస్తే ఆయన తన అభిప్రాయాన్ని మార్చుకొనేవాడు. తాను సంపాదకత్వం వహించదలచిన పుస్తకం గతంలో ప్రచురించబడి ఉంటే రవికష్ణ ముందుగా ఆ పాత ప్రతిని శ్రద్ధగా చదువుతాడు. పాతగ్రంథంలోని అక్షర స్ఖాలిత్యాలను, పదవిభజనను సరిచేస్తాడు. తర్వాత ఆ గ్రంథంలో ఇప్పటి పాఠకులకు అర్థం కావనుకొన్న విషయాలను జాబితా చేసి వాటికి వివరణలు తయారు చేస్తాడు. వాటిని కొత్తగ్రంథంలో ఫుట్‌నోట్సుగా యిస్తాడు. ఆ గ్రంథంలో ఉదహరించబడిన ప్రాంతాలను వీలైనంతవరకు సందర్శించి అక్కడి విశేషాలను గ్రహిస్తాడు.
ఆయా విశేషాలను ఛాయా చిత్రాలతో సహా పుస్తకంలో సందర్భానుసారం ఉటంకిస్తాడు. తాను సంపాదకత్వం వహించిన పుస్తకానికి సమగ్రతను సాధించి కొత్త రూపు తెస్తాడు. పాత గ్రంథాన్ని, కొత్త ప్రచురణను పరిశీలిస్తే రవికష్ణ కషి బాగా అర్థమవుతుంది. ఇక, ప్రచురించేది కొత్త పుస్తకమైతే తాను చెప్పదలచుకున్న విషయాన్ని సమగ్రంగా పరిశోధించి న భూతో అన్నట్టు ప్రచురిస్తాడు. బెంగళూరు నాగరత్నమ్మ జీవిత చరిత్ర అందుకు ఉదాహరణ. అలాగే కొండ వెంకటప్పయ్య స్వీయ చరిత్రలో పిండారీలను గురించి చెప్పిన ఫుట్‌నోట్సు, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని తెలుగువారు, బకింగ్‌హామ్ కాలువద్వారా ఉన్న ప్రయాణ సౌకర్యాల గురించి ఇచ్చిన ఫుట్‌నోట్సు సంపాదకుడి ప్రతిభను మచ్చుకి వెల్లడిస్తాయి.
లెక్చరర్‌గా రవికష్ణ పిల్లల చదువుల పట్ల విశేష శ్రద్ధ కనపరుస్తాడు. పాఠ్యాంశాలతోపాటుగా తత్సంబంధమైన యితర అంశాలను కూడా జోడించి పాఠాన్ని ఆసక్తికరంగా వినేట్టు చేస్తాడు. స్నేహితుల దగ్గరినుంచి వాళ్లకు అక్కరలేని పుస్తకాలేవైనా ఉంటే పట్టుకెళ్లి తాను క్లాసులో పెట్టే చిన్న చిన్న పరీక్షల్లో నెగ్గిన వారికి బహుమతిగా యిస్తాడు. పిల్లలను విహార యాత్రలకు తీసుకుపోయి ఆయా ప్రాంతాలను గురించి వివరంగా పరిచయం చేస్తాడు. వాటిని గురించి పిల్లల చేత వ్యాసాలు, కవితలు రాయిస్తాడు. వాటిని మళ్లీ పుస్తకరూపంలో ప్రచురిస్తాడు. అలా వచ్చినవే ‘హంపీస్మతులు’, ‘అదిగో భద్రాద్రి’, ‘ఓరుగల్లు శిథిలాలు’ పుస్తకాలు. అంతెందుకు, మెథడాలజీ బోధించే ఈ పంతులుగారు 15 మంది బయాలజీ, సోషల్ విద్యార్థులను సైతం తెలుగు పట్ల ఆకర్షితులయ్యేలా చేసి, వారితో తెలుగు ఎమ్మేలు చేయించి, వారిని తెలుగు టీచర్లుగా స్థిరపడేలా ప్రేరణ ఇవ్వగలిగాడు.
‘నాతో మాట్లాడటమే ఒక ఎడ్యుకేషన్’ అంటాడు గిరీశం. అది నిజమో కాదో తెలియదు కానీ రవికష్ణతో మాట్లాడటం మాత్రం నిజంగా ఒక ఎడ్యుకేషన్. సాహిత్యం, చరిత్ర, సినిమా, నాట్యం, సంగీతం, పదకవిత్వం, నిఘంటువులు, సాహితీమూర్తులు మొదలైన విషయాలు ప్రస్తావన కొచ్చినప్పుడు అతనిలో మహోత్సాహం కన్పిస్తుంది. తనకు తెలిసిన అనేక విషయాలను చతురోక్తులతో దట్టించి వినే వాళ్లను మంత్రముగ్ధుల్ని చేస్తాడు. అతన్ని తెలిసిన వాళ్ళు అతని పలుకుల్నీ, ఉత్సాహాన్నీ, అపారమైన జ్ఞాపకశక్తినీ, అపరిమితమైన సాహితీకషినీ మరిచిపోలేరు.
రచయిత: పిన్నమనేని మత్యుంజయరావు
7794004466