తెలుగు స్వతంత్ర భాష
బెజవాడలో మారిన బండి తెల్లవారుతోందనగా కొండపల్లి దాటింది, అది మొదలు ‘‘పరాయిదేశం వెడుతున్నా’’ మన్నట్టుంది నాకు.
ఇప్పటికన్నీ, తూర్పుగోదావరి జిల్లాలో పుట్టి పెరిగిన వాడికి, మొదటిమాటు, తునిదాటితే మరో ప్రపంచమూ, ఒంగోలు దాటితే మరో ప్రపంచమూ, నరసరావుపేట దాటితే మరో ప్రపంచమూ, కొండపల్లి దాటితే మరో ప్రపంచమున్నూ.
అసలు, ఏలూరు దాటితేనే భేదం కనపడుతుంది, అది అవగాహన కానిది కాదు.
అక్కడిదీ, అక్కడిదీ, అక్కడిదీ, అక్కడిదీ కూడా కండగల తెనుగే; కాని, కాదేమో అనిపిస్తుందెక్కడికక్కడే.
అందుకు బెదరక, మళ్లీ మళ్లీ వెళ్లాడా, తెనుగుభాష తన విశ్వరూపం కనపరుస్తుంది, ఆంధ్రత్వమున్నూ సమగ్రం అవుతుంది, వెళ్లిన వాడికి.
ఒక్కొక్క సీమలోనొక్కొక్క జీవకణం వుంది తెనుగు రక్తంలో, అన్నీ వొకచోటికి చేర్చగల-అన్నీ వొక్క తెనుగువాడి రక్తంలో నిక్షేపించగల మొనగాడు పుట్టుకు రావాలి, అంతే.
మొదటిమాటు విశాఖపట్నం వెళ్లాన్నేను.
అప్పటి నాకున్నది వొక్కటే ప్రాణం.
వారం రోజులున్నా నా మొదటి మాటక్కడ.
రెండో ప్రాణం సంక్రమించినట్టనిపించింది, దాంతో నాకు.
తరవాత నెల్లూరు వెళ్లాను, మూడో ప్రాణం సంక్రమించినట్టనిపించిందక్కడ.
అదయిన తరవాత కడపా, అనంతపురమూ, నంద్యాలా వెళ్లాను. నాలుగో ప్రాణం సంక్రమించినట్టనిపించింది.
చివరికి హనుమకొండ వెళ్లాను, అయిదో ప్రాణం కూడా నాకు సంక్రమించినట్టు-నా ఆంధ్ర రక్తం పరిపూర్ణం అయి నట్టనుభూతం అయింది నాకు.
ఇవాళ చూసుకుంటే, అయిదు ప్రాణాల నిండు జీవితమే నాది, అందుకు తగ్గ దార్డ్యం మాత్రం కూడలేదనే చెప్పాలింకా.
అందుకోసం నేను చేసుకున్న దోహదం బహు తక్కువ, మరి.
ఆంధ్ర హృదయం-ఆంధ్రభాషపరంగా వ్యక్తం అవుతున్న జీవనసరళి నాకింకా బాగా అవగాహన కాలేదు.
నా స్వప్రాంతపు పలుకుబడిలో యెంత జీవశక్తి వుందో, అక్కడక్కడి పలుకుబళ్లలోనూ అంతంత జీవశక్తి వుంది, వారాల్లోనూ మాసాల్లోనూ పట్టు బడేది కాదది.
ఒక్కొక్క చోట ప్రచలితం అయే కాకువూ, వొక్కొక్క చోట ప్రయుక్తం అయే యాసా పుస్తకాలు చదివితే అందవు, వొకచోట కూచున్నా దొరకవు- పల్లెలూ పట్నాలూ తిరగాలి, అష్టాదశవర్ణాల వారిలోనూ పరభాషా వ్యామోహం లేనివారిని కలుసుకోవాలి, ఆ పలుకుబళ్లు చెవులారా వినాలి, ఆ ప్రయోగ వైచిత్రి సవిమర్శంగా పట్టుకోవాలి, ఆ నాదం-చిక్కని ఆ మధుర గంభీరనాదం అవగాహన చేసుకోవాలి, అన్నిటికీ ప్రధానంగా ‘‘ఇది నా సొంతభాష-మొదటిమాటు, నా తల్లి, నా జీవశక్తికి జతచేసిన-నాకు వాగ్ధార ఆవిర్భవింపచేసిన సంజీవిని అన్న ఆత్మీయతా, మమతా ఉద్బుద్ధాలు చేసుకోవాలి, ముందు.
అప్పుడు గాని యే తెనుగువాడికీ నిండు ప్రాణం వుందని చెప్పడానికి వీల్లేదు.
దానికోసం నా పరితాపం యిప్పటికీ.
నిజం చెప్పవలసి వస్తే యే వొక్క శాస్త్రంలో సమగ్ర పరిజ్ఞానంలేని షట్శాస్త్ర పండితుని స్థితి నాదివాళ.
అయినా, నా తెనుగుభాష శాస్త్రీయం-తాటాబూటం కాదు.
నా తెనుగుభాష యుగయుగాలుగా ప్రవాహిని అయివుండినదిగాని, యివాళ, ఆ భాషలో నుంచి వొక మాటా, యీ భాషలోనుంచి వొకమాటా యెరువు తెచ్చుకుని భరతవిద్య ప్రదర్శిస్తున్నది కాదు.
నా తెనుగుభాష ఎక్కడ పుట్టినా చక్రవర్తుల రాజ్యాంగాలు నడిపిందిగాని, పరాన్నభుక్కు కాదు.
నా తెనుగుభాష స్వతంత్రంగా బతగ్గలదిగాని కృత్రిమ సాధనాలతో ప్రాణవాయువు కూర్చుకోవలసిందీకాదు, అక్రమ దోహదాలతో పోషించబడవలసిందీ కాదు.
యావద్భారతదేశంలోనూ, యీ విశాల విశ్వంలో కూడా తెనుగువాణ్ణిగా, నేనే నిర్వహించవలసిన కార్యక్రమం కొంత వుంది, నా దృఢవిశ్వాసం యిది.
అందుకోసం, అన్ని సీమల పలుకుబళ్లూ బోధపరుచుకుని, అన్ని సీమల జీవశక్తీ కూర్చుకుని స్వస్వరూప జ్ఞానంతో దృఢంగా నిలవగలగాలి నేను.
నాకు మాత్రం యీ ఆకాంక్ష కూడా వుంది, పూర్తిగా.
(ఏప్రిల్ 23 శ్రీపాద 125వ జయంతి సందర్భంగా-సుబ్రహ్మణ్య శాస్త్రిగారి ‘అనుభవాలు-జ్ఞాపకాలూను’ నుంచి)