రేణుకా చౌదరి రాయని డైరీ
- మాధవ్ శింగరాజు
అమ్మవారి కిరీటం బాగుంది. ధగధగా మెరుస్తూ ఉంది. పచ్చబంగారంలో పింక్ కలిపినట్లుగా ఉంది. బంగారంలో రాగి కలుపుతారు. రాగి పింక్ కలర్‌లో ఉండదు. మరి కిరీటానికి ఈ పింక్ కలర్ ఎలా వచ్చింది?! కిరీటాన్ని మళ్లీ ఒకసారి చూశాను. పచ్చటి బంగారం! పింక్ అస్సలు లేదు. కళ్లు నులుము కున్నాను. అంతా కేసీఆర్ మాయ. తెలంగాణలో ఉన్నవాళ్లందరికీ పింక్ కామెర్లు తెప్పించేస్తున్నాడు! పింక్ పొలాలు, పింక్ జలాలు, పింక్ జిల్లాలు... ఎవ్రీథింగ్ పింకిష్. కేసీఆర్ వేసే పిల్లి మొగ్గలు కూడా పింక్ మొగ్గలే.
దసరా షాపింగ్ పూర్తి కాలేదు. కేసీఆర్ కటౌట్లను తప్పించుకుని తిరగడం కష్టమౌతోంది రోజురోజుకీ సిటీలో. ట్రాఫిక్ జామ్ కన్నా, కటౌట్ల జామ్ ఎక్కువగా ఉంది. సిగ్నళ్లే లేని హైదరాబాద్‌ను నిర్మిస్తానంటున్నాడు! ఎల్లో, రెడ్, గ్రీన్ తీయించి, పింక్ ఒక్కటే పెట్టిస్తాడేమో. ‘అవునవును. పింక్ అయితే బాగుంటుంది. పార్టీ ఆఫీసుకు త్వరగా చేరుకోవచ్చు’ అని మా పార్టీ నేతలు కూడా సరదా పడుతున్నారు. వాళ్లు ఉంటున్న పార్టీ ఆఫీసు ‘గాంధీభవన్’. వాళ్లు అంటున్న పార్టీ ఆఫీసు ‘తెలంగాణ భవన్’. ఆమాత్రం కనిపెట్టలేనా?
‘రెండేళ్లయింది రాష్ర్టంలో కాంగ్రెస్ లేక’ అన్న బాధ లేదు మావాళ్లకు. ‘రెండేళ్లయింది టీఆర్‌ఎస్‌లో చేరక’ అన్న బాధ కనిపిస్తోంది వాళ్ల కళ్లలో. గాంధీభవన్‌కి వచ్చి నీరసంగా దివాలా తీసినట్టు కూర్చుంటున్నారు. దివాలా తీయడం పార్టీ వ్యతిరేక కార్యకలాపం ఏమీ కాదు. దివాలా తీసినట్టు కనిపించడమే పార్టీకి అసలైన ద్రోహం.
బాధ ఎవరికి లేదు? టీడీపీకి లేదా? బీజేపీకి లేదా? తెలంగాణ ప్రజలకు లేదా? వాళ్లంతా ముఖాలు వే లాడేసుకునే కూర్చుంటున్నారా? ఉదయాన్నే లేచి ఎవరి పనులకు వాళ్లు వెళ్లిపోవడం లేదా? మనల్ని ఒకళ్లు కొట్టారంటే, తిరిగి వాళ్లను కొట్టేవరకు.. ఐదేళ్లయినా, పదేళ్లయినా.. పంచె బిగించే ఉండాలి. పంచ్ విసరబోతున్నట్లు పిక్చర్ ఇస్తూనే ఉండాలి. ఆ తెలివి లేదు. అదేమంటే రివర్స్‌లో నా మీదకు వచ్చేస్తారు! పార్టీకి దూరంగా ఉంటున్నాననీ, మీటింగులకు రావట్లేదనీ!
ఆ భగవంతుడి దయ, శ్రీమతి సోనియాగాంధీ గారి దయ ఉండబట్టి గానీ, లేకుంటే కేసీఆర్‌తో కలిసి రోజూ నేను టీ తాగుతున్నానని ఢిల్లీకి లెటర్లు రాసినా రాసుండేవాళ్లు. కేసీఆర్ కాంగ్రెస్‌కు చేసిన ద్రోహాన్ని వీళ్లంతా మర్చిపోయారేమో, నేను మర్చిపోను. మొక్కు తీర్చుకోడానికి కేసీఆర్... అమ్మవారికి మూడున్నర కోట్లు పెట్టి కిరీటం చేయించాడు. మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజలకు తనను సీయెంను చేసిన సోనియా అమ్మవారికి చెల్లించవలసిన మొక్కు గురించి మాత్రం మర్చిపోయాడు! సోనియాకు కిరీటం చేయించనవసరం లేదు. తన తలపై ఉన్న కిరీటాన్ని చేయించింది సోనియా మేడమ్ అని కేసీఆర్ గుర్తుంచుకుంటే చాలు.