సోనియాతో రేణుక, డీఎస్‌ల భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో ఎంపీ రేణుకా చౌదరి, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ సోమవారం విడివిడిగా భేటీ అయ్యారు. తొలుత డీఎస్ పది నిమిషాల పాటు సోనియాతో మాట్లాడారు. ఆయన బయటకు వచ్చిన వెంటనే రేణుక ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మహిళా సర్పంచ్‌ను వెంట తీసుకొని సోనియాను కలిసేందుకు లోపలికి వెళ్లారు. ఈ భేటీల్లో ప్రధానంగా రాష్ట్ర రాజకీయాలే చర్చకు వచ్చినట్లుగా తెలిసింది. రాష్ట్ర విభజన బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టిన తదనంతర పరిణామాలను సోనియా అడిగి తెలుసుకున్నారని సమాచారం. విభజన బిల్లుపై వెనక్కెళ్లేది లేదని, ఫిబ్రవరిలో జరిగే సమావేశాల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడం ఖాయమని, సాధారణ ఎన్నికలకు ముందే రెండు రాష్ట్రాల ఏర్పాటు జరుగుతుందని సోనియా సంకేతాలిచ్చినట్లు చెబుతున్నారు.
భేటీ అనంతరం డీఎస్ మీడియాతో మాట్లాడుతూ, ‘‘2014 లోపు రెండు రాష్ట్రాల ఏర్పాటు ఖాయం. సాధారణ ఎన్నికలు రెండు రాష్ట్రాల్లో జరుగుతాయని కచ్చితంగా చెప్పగలను’’ అని అన్నారు. ముఖ్యమంత్రి పదవి కోరుకుంటున్నారా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ‘‘నేను కాంగ్రెస్ కార్యకర్తను, వారు ఏ బాధ్యతను కట్టబెడితే దాన్ని స్వీకరిస్తా’’ అని బదులిచ్చారు. తర్వాత రేణుక మాట్లాడుతూ, తెలంగాణపై ఇప్పటికే ఎవరి పని వారు చేస్తున్నారని చెప్పారు. తెలంగాణపై అసెంబ్లీలో చర్చ జరగాలని అందరూ కోరుకుంటున్నారని, తాను అదే ఆశిస్తున్నానని అన్నారు.