మంత్రిగారిని ఎక్కడ కలవాలి?
విశ్లేషణ
కేంద్ర మంత్రిగారిని కలవాలని ఉంది. ఎక్కడ ఏవిధంగా కలవవచ్చు. ముందుగా అపాయింట్‌మెంట్ లేకుండానే కలవవచ్చా? సామాన్యులను కలిసే వేళలను ఏవైనా నిర్ధారించారా? అపాయింట్‌మెంట్ తీసుకోవడానికి మార్గ మేమిటి? ఎవరిని సంప్రదించాలి? అని హేమంత్ ధాగే మన న్యాయశాఖ మంత్రిని సమాచార హక్కు దరఖాస్తు ద్వారా అడిగాడు. అటువంటి సమా చారమేమీ లేదు. ఎప్పటికప్పుడు ఎవరయినా కలవాలని అనుకుంటే మంత్రి గారి లభ్యతను బట్టి అపాయింట్‌మెంట్ ఇస్తారు అని కేంద్ర న్యాయ వ్యవహారాల విభాగం ప్రత్యుత్తరం ఇచ్చింది.
ఇది అరకొర సమాచారం. నిజానికి చెప్పిందేమీ లేదు. అసలు మంత్రిని కలిసే హక్కు పౌరుడికి లేదా? ఉంటే ఏ విధంగా కలిసే అవకాశాలు ఉంటాయో తెలియజెప్పే బాధ్యత మంత్రిగారికి లేదా వారి కార్యాలయానికి లేదా? మంత్రిగారి ప్రయివేటు కార్యదర్శిని అడిగిన సమా చారాన్ని మంత్రిత్వ శాఖ ఏవిధంగా ఇస్తుంది? ఇరుపక్షాల వారు రెండో అప్పీలు విచారణ రోజు రాలేదు. అయినా దరఖాస్తు లోతుగా పరిశీలించి చట్టం ప్రకారం సమాచారం ఇవ్వాలో కూడదో తేల్చవలసిన బాధ్యత కమిషన్ పైన ఉంది. చట్టం కింద పబ్లిక్ అథారిటీ మంత్రిని గుర్తించవచ్చా? ఒకవేళ అథారిటీ అయితే మంత్రి సమాధానం ఇవ్వవలసిన బాధ్యత ఉందా?
మంత్రి అనే అధికార పీఠం రాజ్యాంగం సృష్టించింది. ఆర్టికల్ 74 ప్రకారం రాష్ర్టపతికి సలహా ఇవ్వడానికి ఒక మంత్రి వర్గం ఉండాలి. ఆర్టికల్ 75 ప్రకారం ప్రధానమంత్రి సలహా మేరకు మంత్రిని రాష్ర్టపతి నియమిస్తారు. రాష్ర్టపతి ఇష్టపడినంతకాలమే మంత్రి పదవిలో కొనసాగుతాడు. పార్లమెంటు ఆమోదించిన చట్టం 1954 ప్రకారం ఎంపీకి జీతాలు ఇస్తారు. మంత్రికి కూడా. రాష్ట్రాలకు సంబంధించి 163, 164 ఆర్టికల్స్ రాష్ర్ట మంత్రులకు ఈ విధమైన నియమావళినే రూపొందించాయి.
ఈ నియమాలన్నీ సెక్షన్ 2(హెచ్) పబ్లిక్ అథారిటీ నిర్వచనానికి అనుగుణంగా ఉన్నాయి. ఆర్టికల్ 75(3) ప్రకారం మంత్రివర్గానికి సమిష్టి బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత నిర్ణయాలకు పరిమితమవుతుంది. కాని ఒక్కో మంత్రి తనకు ఇచ్చిన శాఖలకు అధిపతిగా ఉంటారు. ఆ శాఖలో నిర్ణయాలకు మంత్రే బాధ్యత వహించవలసి ఉంటుంది. ప్రభుత్వ విధులను అధికారాలను ప్రభుత్వ నిధులను నిర్ణయించేది మంత్రి. కనుక కేంద్ర రాష్ర్ట మంత్రివర్యులు ఒక్కొక్కరు ఒక్కొక్క పబ్లిక్ అథారిటీ అవుతారు. మంత్రిగారికి సరైన సిబ్బంది సౌకర్యాలు లేవు కనుక పబ్లిక్ అథారిటీగా సహ చట్టం కింద సమాధానాలు ఇవ్వాలనడం సమంజసం కాదనే వాదన చెల్లదు.
మంత్రులకు సహాయక సిబ్బంది, వ్యక్తిగత సహాయకులుగా ఐఏఎస్ అధికారులను ప్రభుత్వమే ఇస్తుంది. ప్రభుత్వమే కార్యాలయాన్ని అధికారిక నివాసాన్ని కల్పిస్తుంది. ఒకే వ్యక్తిగా ఉన్నప్పటికీ అటార్నీ జనరల్ ప్రభుత్వ అథారిటీ అయినప్పుడు, మంత్రి కూడా అథారిటీ అయి తీర వలసి ఉంటుంది. మంత్రులంతా పబ్లిక్ అథారిటీలేనని 2015 సెప్టెంబర్ 25న మహారాష్ర్ట సమాచార కమిషన్ నిర్దేశించింది. వేలకోట్ల రూపాయల ప్రజానిధిని ఖర్చుచేసే నిర్ణయాలు తీసుకునే అధికారమున్న మంత్రి పబ్లిక్ అథారిటీ అవుతారు.
రెండో ప్రశ్న.. మంత్రిని కలుసుకునే హక్కు పౌరులకు ఉందా? రామరాజ్యంలో తన ఇంటిముందు గంట మోగించిన వారెవరయినా రాముడు బయటకు వచ్చి వారి బాధలను విని న్యాయం చేసే వారని, మొఘల్ చక్రవర్తులు, రాజపుత్ర రాజులు దర్బారులో జనాన్ని కలుసుకునే వారని కథలు విన్నాం. కొందరు ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు కూడా జనాన్ని రోజూ ఉదయం కలిసే వారు. ఇప్పటికీ కొందరు కలుస్తూనే ఉన్నారు. చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా అనేక పర్యాయాలు ఎన్నికైన ఎన్ యతిరాజారావు మంత్రి పదవిలో ఉన్నా, మామూలు ఎమ్మెల్యేగా ఉన్నా జనం ఇచ్చిన విజ్ఞాపన పత్రాలు ఉత్తరాలు ఒక సూట్ కేసునిండా వెంట పెట్టుకుని అధికారులను కలుస్తూ, ఆ తరువాత సమస్య చెప్పుకున్న వ్యక్తిని పిలిచి ఆయన పని ఎంతవరకు పూర్తయిందో చెప్పేవారు. వెంట ఎప్పుడూ రెండు సూట్ కేసులు ఉండేవి. అందుకే ఆయన ఏడు సార్లు గెలిచారు. ప్రజాప్రాతినిధ్య చట్టం అనే పేరులోనే అతను/ఆమె ప్రజలకు ప్రతినిధిగా ఉండాలని స్పష్టం.
మంత్రితో సమావేశ సమయం దొరకబుచ్చుకోవడం పెద్ద సమస్య. దానికి తెలిసిన వాడు ఉండాలి. లేకపోతే బ్రోకర్లు తయారవుతారు. బోలెడంత డబ్బు చెల్లించవలసి ఉంటుంది. ఇదంతా భ్రష్టాచారం. ఇందులో మంత్రికి పాలు ఉండవచ్చు లేకపోవచ్చు. కాని ఆయన్ను కలుసుకోవడానికి పౌరుడు లంచాలు ఇవ్వకుండా సులువైన విధానాలను కల్పించడం, ముందే సమయాలను ప్రకటించడం మంత్రుల బాధ్యత. సహ చట్టం వచ్చిందే ఇటువంటి అవినీతిని నిరోధించడానికి. సామాన్యునితో సమావేశమయ్యే వేళలను మంత్రి కార్యాలయమే ప్రకటించాలి. మంత్రిత్వ శాఖ ఆ పని చేయలేదు. నెలలో ఏ రోజు ఎక్కడ జనాన్ని కలుస్తారో చెప్పాలి. లేదా ఫలానా నెలలో కలవడం లేదు అని ప్రకటించాలి. సహ చట్టం సెక్షన్ 4(1)(బి కింద ఇది ముందే తమంత తామే తెలియజేయవలసిన సౌకర్య సంబంధిత సమాచారం. కనుక కేంద్రంలో, రాష్ట్రాల్లో ఉన్న ప్రతి మంత్రి ఈ బాధ్యతను నెరవేర్చి ప్రజల సమాచార హక్కును కాపాడడానికి రెండు నెలల్లో పిఐఓను నియమించాలని కమిషన్... కేబినెట్ సెక్రటరీని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది. ( హేమంత్ ధాగే వర్సెస్ న్యాయవ్యవహారాల శాఖ కేసులో మార్చి 12న ఇచ్చిన తీర్పు ఆధారంగా)
(వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్, కేంద్ర సమాచార శాఖ కమిషనర్)