బ్యాంకుల వింత పోకడలు | strange trends of Banks: people suffers | Sakshi
Sakshi News home page

బ్యాంకుల వింత పోకడలు

Published Wed, Mar 8 2017 12:01 AM | Last Updated on Tue, Sep 5 2017 5:27 AM

బ్యాంకుల వింత పోకడలు

బ్యాంకుల వింత పోకడలు

చదవేస్తే ఉన్న మతి పోయిందన్న నానుడిని బ్యాంకులు నిజం చేస్తున్నాయి. ఇష్టానుసారం నిబంధనలు విధిస్తూ ఖాతాదార్ల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. దేశాన్ని డిజిటల్‌ బాట పట్టించి నగదు రహిత ఆర్థిక వ్యవస్థను విస్తృతపరుస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అందుకు తగ్గట్టుగా ఫలానా పరిమితి మించితే నగదు లావాదేవీలను అనుమతించబోమని ప్రకటించింది. ఇదే అదునుగా బ్యాంకులు ఖాతాదార్ల జేబులు కొల్లగొట్టేందుకు పథకరచన చేస్తున్నాయి.

డబ్బు వేసినా... తీసినా... ఖాతాలో ఉన్న డబ్బెంతో తెలుసుకోవడానికి ప్రయత్నించినా... ఆఖరికి అందులో నిర్దిష్ట మొత్తం డబ్బు ఉంచకపోయినా సర్‌చార్జిలు వసూలు చేస్తామని ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌ బ్యాంకు తదితర ప్రైవేటు సంస్థలు ప్రకటిం చాయి. తానేమీ తక్కువ తినలేదన్నట్టు ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్‌ బ్యాంకు సైతం పరిమితికి మించి లావాదేవీలు నడిపినా, అసలు లావాదేవీలే జరపకపోయినా, ఖాతాల్లో ఫలానా మొత్తం కంటే తక్కువున్నా వీర బాదుడు తప్పదని ఖాతాదార్లకు ఫర్మానా ఇచ్చింది. ఈ తీరుతో ఆగ్రహించిన నెటిజన్లు వచ్చే నెల 6న బ్యాంకింగ్‌ లావాదేవీలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. దానికీ లొంగకపోతే 24, 25, 26 తేదీల్లో సైతం లావాదేవీలు దూరంగా ఉండాలని కోరుతున్నారు.  

కొత్త నిబంధనల ప్రకారం నెలకు మూడు లావాదేవీలు మించితే ఆ తర్వాత నుంచి రూ. 50 చొప్పున రుసుము వసూలు చేస్తామని ఎస్‌బీఐ చెబుతోంది. యాక్సిస్‌ బ్యాంకులో అయిదు లావాదేవీలు ఉచితమట! ఆ తర్వాత చేసే లావాదేవీ లకు రూ. 95 చొప్పున వడ్డిస్తామంటున్నది. హెచ్‌డీఎఫ్‌సీకి నాలుగు లావాదేవీలు మించితే కుదరదట! ఆ తర్వాత జరిగే లావాదేవీలకు రూ. 150 తక్కువకాకుండా సర్‌చార్జి వసూలు చేస్తామని హెచ్చరిస్తోంది. ఇవన్నీ ఏటీఎంల దగ్గర మాత్రమే కాదు... ఆన్‌లైన్‌ లావాదేవీలకు దిగినా ఇంతే సంగతులని బ్యాంకులు చెబుతు న్నాయి. ఈ సర్‌చార్జిలకు సేవా పన్ను అదనం. నేతి బీరలో నెయ్యిలా ఇందులో సేవ ఎక్కడుందో ఎవరైనా వెదుక్కోవాల్సిందే. ఇప్పుడు తోచినట్టు వేషాలేస్తూ ఖాతా దార్ల సహనాన్ని పరీక్షిస్తున్న బ్యాంకులు కొన్నేళ్లక్రితం ఖాతాలు తెరవాలంటూ జనం వెంట ఎలా పడ్డాయో... తాము కల్పిస్తున్న సౌకర్యాల గురించి ఎలా ఊదర గొట్టాయో ఎవరూ మరిచిపోరు. ఖాతాదార్లంటే బ్యాంకులకు మొహం మొత్తి చాలా కాలమైంది. విత్‌డ్రా ఫాంలు కనబడకుండా చేసి డబ్బు కోసం ఏటీఎంలకే పొమ్మని చెప్పడం సర్వసాధారణమైంది. అలా చేయడం చేతగానివారు ఎవరో ఒకరి సాయం కోసం ఎదురుచూడటం మినహా వేరే గత్యంతరం లేదు. ఆ క్రమంలో మోసపో యినా దిక్కూ మొక్కూలేదు. ఇదంతా చూసి విసిగి, బ్యాంకులంటే ఏవగింపు కలిగి ఖాతా రద్దు చేసుకోవడానికి సిద్ధపడినా పెనాల్టీ తప్పదట!

ఏమిటీ బ్యాంకుల తీరు? ఖాతాదార్లు జమ చేసిన సొమ్ముతో అధిక వడ్డీలకు అప్పులిచ్చి వ్యాపారం చేసి లాభపడాల్సిన బ్యాంకులు ఎక్కడలేని తెలివితేటలనూ వారిపైనే ఎందుకు ప్రదర్శిస్తున్నాయి? వింత నిబంధనలతో ఖాతాదార్లను ఎందు కిలా వేధిస్తున్నాయి? పోగుబడిన సొమ్ముతో వ్యాపారం చేయడం చేతగాక ఇదే సులభమని బ్యాంకులు భావిస్తున్నట్టు కనబడుతోంది. డబ్బు అవసరం ఎవరికెలా వస్తుందో ఎవరూ చెప్పలేరు. ఆపద చెప్పి రాదు. అయినవారికి ఉన్నట్టుండి ఏదైనా జరిగితే, అందుకోసం ఏటీఎంలకు పరుగెడితే మూడు లావాదేవీలు మించాయని, నాలుగు లావాదేవీలు మించాయని లెక్కలు చెప్పి వారి ఖాతాల్లోని డబ్బు కాజేస్తే ఆగ్రహం కలగదా? వారి సొమ్ము వారు తీసుకోవడంపై అసలు బ్యాంకుల పెత్తనం ఏమిటి? జనమంతా ఆగ్రహించి బ్యాంకుల్లోని సొమ్ము ఒకేసారి వెనక్కు తీసుకుంటే ఈ బ్యాంకుల గతేమిటి? రిజర్వ్‌బ్యాంక్, కేంద్రం ఆలోచించాయా? ఖాతాల్లో సొమ్ము లేదన్న పేరిట పెనాల్టీ వసూలు చేయొద్దని కేంద్రం స్టేట్‌ బ్యాంక్‌కు సలహా ఇచ్చిందంటున్నారు. జన్‌ధన్‌ ఖాతాలు గల్లంతవుతాయని భయం ఉన్నట్టుంది. లావాదేవీలకు పరిమితులు విధించి ఇష్టానుసారం వసూళ్లకు దిగడం కూడా తప్పని ఆ బ్యాంకులకు చెప్పాల్సిన బాధ్యత తనపై ఉన్నదని కేంద్రం గుర్తించాలి.

మన ఏటీఎంలు ఎలా ఉంటున్నాయో ఎవరికీ తెలియంది కాదు. చాలా ఏటీఎంలలో డబ్బులుండవు. ఉన్నా వాటి మొరాయింపులు రివాజే. కొన్నిచోట్ల తక్కువ మొత్తం తీసుకోవడానికి సిద్ధపడితే తప్ప ఏటీఎంలు కరుణించవు. చాలా సందర్భాల్లో తీసు కున్న డబ్బుకు రసీదు రాదు. అప్పటికి పట్టించుకోకపోయినా ఖాతాలో ఉన్నదెంత అన్న సందేహం కలిగినప్పుడు మళ్లీ ఏటీఎంకు వెళ్తే దాన్ని పరిమితికి మించిన లావాదేవీగా పరిగణిస్తారు.  ఇదిగాక కొన్నిచోట్ల ఈ–బ్యాంకింగ్‌ పేరిట నగదు జమ యంత్రాలను బిగించి వాటి ద్వారానే డబ్బు జమ చేసుకునే విధానం తీసుకొచ్చారు. నోట్లు నలిగి ఉన్నా, అవి సరిగా పెట్టకపోయినా, మరేవిధమైన పొరబాటు జరిగినా లోపలకు పోయిన సొమ్ముకు జాడ, జవాబు ఉండవు. పర్యవసానంగా కొందరు లబోదిబోమంటూ బ్యాంకులకు పరుగెడుతున్న సందర్భాలు కూడా లేకపోలేదు.

అంతక్రితం మాటెలా ఉన్నా పెద్ద నోట్ల రద్దు సమయంలో మన బ్యాంకింగ్‌ వ్యవస్థ చేతగానితనం అందరికీ అర్ధమైంది. గంటల తరబడి, రోజుల తరబడి క్యూలో నిలబడినా డబ్బు దక్కక జనం అష్టకష్టాలు పడ్డారు. ఆ కష్టాలు పూర్తిగా తీరిన దాఖలాలు కూడా లేవు. ఈలోగా లావాదేవీలపై సర్‌చార్జీలు, పెనాల్టీలంటూ బ్యాంకులు కొత్త ఆట ప్రారంభించాయి. బ్యాంకుల నుంచి వేల కోట్లు అప్పు తీసుకుని ఎగ్గొట్టి  విదేశాలకు పరారైన వ్యాపారవేత్తలున్నారు. ఇక్కడే ఉన్నా బకా యిలు కట్టకుండా కాలక్షేపం చేస్తున్న వారున్నారు. వారి స్థోమత ఎంతో... సెక్యూ రిటీగా చూపిస్తున్న ఆస్తులేమిటో గమనించకుండా ఇచ్చిన అప్పుల్ని ఎలా రాబ ట్టుకోవాలో బ్యాంకులు తెలియడంలేదు. వసూలుకాని బకాయిలు రూ. 6 లక్షల కోట్లుదాకా ఉన్నాయనీ, వాటిని వసూలు చేయాలని, ఎగవేత దార్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఈమధ్యే బ్యాంకు సిబ్బంది దేశవ్యాప్త సమ్మెకు కూడా దిగారు. ఇంతటి పెను సమస్యపై దృష్టి సారించడం మాని సాధారణ ఖాతా దార్లను వేధించే చర్యలకు పూనుకోవడం విచారకరం. వీటిని తక్షణం ఉపసంహరిం చుకుని మొండి బకాయిల వసూలుకు ఇప్పటికైనా బ్యాంకులు ప్రయత్నించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement