పొద్దున్నుంచి పడిగాపులే
రాష్ట్రవ్యాప్తంగా ‘నోట్ల’ కష్టాలతో జనం విలవిల
- మూడు రోజుల సెలవుల అనంతరం తెరుచుకున్న బ్యాంకులు
- కిలోమీటర్ల కొద్దీ క్యూలైన్లు.. గంటల తరబడి ఎదురుచూపులు
- అయినా అందని నగదు.. మధ్యాహ్నానికే ‘నో క్యాష్’
- ఆగ్రహంతో ఆందోళనలు, ధర్నాలకు దిగిన జనం
- పలు చోట్ల పరస్పరం దాడులకు దిగిన ఖాతాదారులు
సాక్షి నెట్‌వర్క్: ‘నోట్ల రద్దు’ కష్టాలు పరాకాష్టకు చేరుతున్నాయి. నగదు కోసం జనం అష్టకష్టాలూ పడుతున్నారు. వరుసగా 3 రోజుల సెలవుల అనంతరం మంగళవారం తెరుచుకున్న బ్యాంకులు జాతరలను తలపించాయి. కిలోమీటర్ల కొద్దీ క్యూలైన్లతో జనం అవస్థలు పడ్డారు. చాలా చోట్ల తెల్లవారుజామున ఐదారు గంటల నుంచే క్యూలైన్లు మొదలవగా.. పలుచోట్ల సోమవారం రాత్రే జనం బ్యాంకుల వద్దకు చేరుకుని, రాత్రంతా పడిగాపులు కాశారు. జనం భారీగా బారులు తీరడంతో తోపులాటలు, వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. ఒకటి రెండు చోట్ల ఖాతాదారులు పరస్పరం దాడులు చేసుకునేదాకా వెళ్లాయి. చాలా బ్యాంకుల్లో రూ.2 వేల నుంచి రూ.4 వేల వరకే ఇవ్వడంతో జనం ఉసూరుమన్నారు.
కొన్ని బ్యాంకులు మధ్యాహ్నానికే ‘నో క్యాష్’ బోర్డులు పెట్టడంతో ఆందోళనలకు దిగారు. రహదారులపై బైఠాయించి, ధర్నాలు చేశారు. వైద్యం కోసం.. నిత్యావసరాల కోసం నగదు కావాలంటూ బ్యాంకులకు వచ్చిన మహిళలు, వృద్ధులు కన్నీళ్లు పెట్టుకోవడం కనిపించింది. ఇక అన్ని బ్యాంకుల్లోనూ రూ.2 వేల నోట్లు మాత్రమే ఇవ్వడంతో ప్రజలకు చిల్లర కష్టాలు తప్పలేదు.
రాజధానిలోనూ..: మూడు రోజుల వరుస సెల వుల అనంతరం మంగళవారం బ్యాంకులు, ఏటీ ఎంలు తెరచుకున్నా హైదరాబాద్ వాసులకు కరెన్సీ కష్టాలు తప్పలేదు. జనం బ్యాంకులు, ఏటీఎం ల వద్ద భారీగా క్యూలు కట్టారు. పలు చోట్ల బ్యాంకు ల వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసు పహా రా ఏర్పాటు చేశారు. చాలా బ్యాంకుల్లో కొద్ది మంది ఖాతాదారులకే నగదు పంపిణీ చేసి, మధ్యాహ్నం లోపే ‘నో క్యాష్’ బోర్డులు పెట్టారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తంగా 7 వేల ఏటీఎంలు ఉండగా.. మంగళవారం అందులో వెయ్యి ఏటీఎంలు కూడా తెరుచుకోలేదు. వాటిల్లోనూ నగదు నింపిన ఒకటి రెండు గంటల్లోనే ఖాళీ అయిపోయాయి.
రోడ్డెక్కిన జనం: బ్యాంకుల్లో సరిపడా నగదు లేకపోవడం, పలు చోట్ల మొత్తంగా ‘నో క్యాష్’ బోర్డులు పెట్టడంతో జనం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌లోని ఎస్‌బీఐ వద్ద ఉదయం 8 నుంచే ఖాతాదారులు బారులు తీరగా... ఉదయం 10.30కు వచ్చిన బ్యాంకు అధికారులు ‘నో క్యాష్’ బోర్డు పెట్టారు. నగదు వస్తే ఇస్తామని.. ప్రస్తుతం డిపాజిట్లు స్వీకరిస్తామని చెప్పారు. నగదు కోసం మధ్యాహ్నం వరకు ఎదురుచూసిన ఖాతాదారులు.. అనంతరం ఆందోళనకు దిగారు. చేతిలో చిల్లిగవ్వ లేక, వ్యవసాయ ఖర్చులకు డబ్బుల్లేక ఇబ్బంది పడుతున్నామంటూ బ్యాంకు ఎదుట ధర్నా చేశారు. ఇక సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని ఎస్‌బీఐలో నగదు లేదని బ్యాంకు సిబ్బంది చెప్పడంతో ఖాతాదారులు వారితో వాగ్వాదా నికి దిగారు. బ్యాంకు ఎదుటే 65వ నంబర్ జాతీయ రహదారిపై బైఠాయించారు. దీంతో గంట పాటు వాహనాలన్నీ నిలిచిపోయాయి. పోలీసులు కల్పించు కుని ఆందోళనకారులను శాంతింపజేశారు.