అరాచకత్వానికి చిరునామా..! | the real examples of American anarchism | Sakshi
Sakshi News home page

అరాచకత్వానికి చిరునామా..!

Published Tue, Feb 28 2017 12:25 AM | Last Updated on Fri, Aug 24 2018 8:18 PM

భార్య సునయనతో శ్రీనివాస్‌ కూచిభొట్ట - Sakshi

భార్య సునయనతో శ్రీనివాస్‌ కూచిభొట్ట

రెండో మాట
ఇలాంటి బలిదానాలు గత రెండు దశాబ్దాలుగా పలువురు అధ్యక్షుల హయాంలలో జరగక పోలేదు. ట్రంప్‌ రంగ ప్రవేశం తరువాత వాతావరణం మరింత విషపూరితమైంది. కూచిభొట్ల శ్రీనివాస్, అలోక్‌రెడ్డిలపై జరిగిన తాజా దాడి ట్రంప్‌ ధోరణితో రెచ్చిపోయిన ఒక శ్వేతజాతీయుడి నిర్వాకమే. ఇందులో శ్రీనివాస్‌ మరణించగా, అలోక్‌ బతికి బయట పడ్డారు. ఇలాంటి వార్తలు, వాటిపై వ్యాఖ్యానాలు వెలువడకుండా చేసేందుకు ట్రంప్‌ ప్రచార, ప్రసార మాధ్యమాలను ‘ప్రజా శత్రువులు’ అంటూ మూకుమ్మడిగా ప్రకటించారు.

‘విదేశాల నుంచి ఎదురవుతున్న పోటీ అమెరికా వస్తూత్పత్తుల కంపెనీ లను పీల్చివేస్తున్నది. ఫలితంగా కర్మాగారాలు ఉద్యోగులకు ఉద్వాసన చెబుతు న్నాయి. ఈ పరిస్థితిలో ఆసియా దేశాల ఎగుమతులు చౌక ధరలకు లభ్యమ వుతూ ఉండడంతో మార్కెట్‌లో అమెరికా తన షేర్ల విలువనూ కోల్పోతోంది. ఈ పతన పరిస్థితిని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సహించలేరు. ఈ విషయంలో ఆయన నిర్ణయం మారే అవకాశం లేదు. – జెన్నిఫర్‌ ఎం హారిస్‌ (అమెరికన్‌ వ్యాఖ్యాత)

రెండో ప్రపంచ యుద్ధం తరువాత బ్రిటన్‌ నుంచి అమెరికా ఆక్రమించిన వలస సామ్రాజ్య దోపిడీ ప్రపంచాధిపత్యం కొద్దిగా కొడిగట్టినా కూడా డొనాల్డ్‌ ట్రంప్‌ సహించలేక పోవడం బహుశా ఇలాంటి దుగ్ధతోనే. మితవాద రిపబ్లికన్‌ పార్టీ నాయకత్వ స్థానంలోకి అమెరికన్‌ కార్పొరేట్‌ సంస్థల ప్రతినిధి హోదాలో ఆకస్మికంగా ప్రవేశిస్తూనే ఒక విద్వేషకర, జాత్యహంకార ప్రకటన విడుదల చేయడం కూడా ఇందుకే.

ట్రంప్‌ వాచాలత
ఉన్నత విద్య కోసమో, ఉపాధి అవసరాలకో ముస్లిం దేశాల నుంచి, విభిన్న జాతులకూ విశ్వాసాలకూ నిలయమైన ఇండియా; ఆసియా, ఆఫ్రికా దేశాల నుంచి అమెరికాకు వెళుతున్న పౌరుల మీద ట్రంప్‌ నిషేధాజ్ఞలు ప్రకటిం చాడు. అమెరికా పౌరుల ఉపాధి అవకాశాలను పెంచేందుకే ఈ వలసలను అదుపాజ్ఞలలో ఉంచుతున్నట్టు అధ్యక్షుడు వివరించారు. కానీ ఈ ధోరణి నిజరూపం–జాత్యహంకారమే, వర్ణ వివక్షే. అధ్యక్ష ఎన్నికల సందర్భంలోనూ, పదవీ స్వీకారోత్సవంలోనూ ఈ ధోరణిని ట్రంప్‌ బాహాటంగానే బయట పెట్టుకున్నారు. అమెరికా పూర్వ వైభవాన్ని పునః ప్రతిష్టించాలన్నదే తన ధ్యేయమని ట్రంప్‌ చెప్పారు.

అంటే, తాము వలస పెత్తందారీతనం, ప్రపం చాధిపత్యం క్రమంగా కోల్పోతున్నామన్న బెంగ అగ్రరాజ్య పాలకులు బయట పెట్టుకున్నట్టే. అసలు వలసల దేశంగా ప్రారంభమై, బానిసల విమోచన ద్వారా సకల జాతుల సమాహారంగా ప్రయాణం ప్రారంభించిన దేశం అమెరికా. కానీ ఈ చరిత్రను వెనక్కు తిప్పే ప్రయాసలో ఉన్నారు ట్రంప్‌. అమెరికాలో ఉద్యోగాలు ఆ దేశీయులకే దక్కాలన్న ట్రంప్‌ అభిప్రాయం తప్పు కాదు. స్వతంత్రంగా దేశీయ సంపదపైన, వనరులపై ఆధారపడి ఎదగాలనుకునే ఇండియా, ఇతర ఆఫ్రికా దేశాలకూ ఈ నిర్ణయం మేలే చేస్తుంది. అయితే వివిధ కారణాలతో ఆ దేశం వెళ్లే విద్యార్థుల పట్ల, ఉద్యో గుల పట్ల స్థానికులలో కక్ష పెంచే రీతిలో హత్యలను ప్రోత్సహించే జాత్యహం కారపూరిత ధోరణి గర్హనీయం. బలిదానాలకే అమెరికా చదువులు, ఉద్యో గాలు అన్న అపఖ్యాతిని ట్రంప్‌ మూటకట్టుకోవడం సరికాదు.

గడచిన రెండు దశాబ్దాలుగా....
నిజానికి ఇలాంటి బలిదానాలు గత రెండు దశాబ్దాలుగా, బరాక్‌ ఒబామా పాలనాకాలం సహా, పలువురి అధ్యక్షుల హయాంలలో జరగకపోలేదు. కానీ ట్రంప్‌ రంగ ప్రవేశం తరువాత, ఆయన విద్వేష భాష వల్ల వాతావరణం మరింత విషపూరితమైంది. కూచిభొట్ల శ్రీనివాస్, అలోక్‌రెడ్డిలపై జరిగిన తాజా దాడి ట్రంప్‌ ధోరణితో రెచ్చిపోయిన ఒక శ్వేతజాతీయుడి నిర్వాకమే. ఇందులో శ్రీనివాస్‌ మరణించగా, అలోక్‌ బతికి బయటపడ్డారు. పైగా ఇలాంటి వార్తలు, వాటిపై వ్యాఖ్యానాలు వెలువడకుండా అడ్డుకోవడానికి ట్రంప్‌ (24–2–17) ప్రచార, ప్రసార మాధ్యమాలను ‘ప్రజా శత్రువులు’ అంటూ మూకుమ్మడిగా ప్రకటించారు (ఇలాంటి ఛాయలు ఇండియా పాల కుల విధానాలలో కూడా ప్రతిబింబిస్తున్నాయి).

ఆసియా వారు, ఆఫ్రికన్లు, హెచ్‌–1బి వీసాల మీద వెళ్లే భారతీయ విద్యార్థులు అమెరికాలో వర్ణవివక్షను చవి చూడవలసివస్తున్నది. దీనికి తోడు బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడాలలో కూడా భారతీయ విద్యార్థుల మీద వర్ణ వివక్ష పెచ్చరిల్లుతున్నది. ఈ దేశాలలో కూడా మన బిడ్డలు కొందరు బలైన సంగతిని విస్మరించలేం. నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కాలంలో, గత పదిహేనేళ్లుగా అమెరికా సహా బ్రిటన్, ఆస్ట్రేలి యాలలో తెలుగు ప్రాంతాల నుంచి వెళ్లిన యాభై నుంచి అరవై మంది విద్యా ర్థులు ఆ ధోరణులకు బలైపోయారు. ఫిబ్రవరి 23న అమెరికాలో తెలుగువా రైన ఇంజనీరింగ్‌ విద్యాధికులకు ఎదురైన విషాదంlఒక పార్శ్వం కాగా, ఐటీ ప్రవేశంతో వచ్చిన (అందులోని ప్రయోజనకర అంశాలను పక్కన పెట్టి) ప్రవృత్తులను ప్రకోపింప చేసే ప్రతికూల లక్షణాలకు ఆకర్షితులు కావడంతో వ్యవస్థ ఎన్నో అనర్థాలకు లోను కావలసి వస్తున్న మాట మరో వాస్తవం.

విద్యలో కార్పొరేట్ల చొరబాటు
వ్యాపారం పేరుతో వచ్చి వ్యవహారాన్ని చక్కబెట్టుకోవడం సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ వ్యవస్థ స్వభావం. రాను రాను విద్యాలయాలు, ఉన్నత విద్యా  సంస్థలు పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రభావంతో ఎలా రూపాంతరం చెందుతు న్నాయో అమెరికా విద్యావేత్త, మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (మిట్‌) సాంకేతిక చరిత్ర ఆచార్యుడు ప్రొఫెసర్‌ డేవిడ్‌ నోబెల్‌ ఇలా చెప్పారు: ‘ఈనాటి అమెరికన్‌ విద్యా వ్యవస్థలు వస్తుదాహ వ్యాపకంపైన, విద్యా వ్యాపారీకరణపైన, కార్పొరేట్‌ సంస్థలకు వ్యక్తిగత లబ్ధి సమకూర్చి పెట్టే లాభ సాటి కేంద్రాలుగా మారాయి. మొత్తం విద్వత్‌లోకాన్నే కార్పొరేట్‌ మయంగా చేసి కూర్చుంది... ఈ పరిణామం ఎప్పుడు చోటు చేసుకుంది?

1970లలో పెట్రోలియం సంక్షోభం వచ్చి,  కుమ్ములాటల దశకు అంతర్జా తీయ పోటీ చేరుకున్న సందర్భంగా దాని తొలి దశ ఆరంభమైంది. అప్పుడు కోటా నుకోట్లకు పడగలెత్తిన ప్రపంచ ప్రధాన పారిశ్రామిక రాజ్యాల రాజ కీయ నాయకులు ప్రపంచంలోని అగ్రగామి సంస్థలపై ఆధిపత్యం కోల్పోయే పరి స్థితి వచ్చింది. కాబట్టి వైజ్ఞానిక ప్రాతిపదికపైన ఏర్పడే కీలక పరిశ్రమలు రోదసి, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, టెలికమ్యూనికేషన్స్, బయో ఇంజనీరింగ్‌ వంటి కండ పుష్టిగల సంస్థలపైన ఆధిపత్యం సాధించడం ద్వారానే తమ ఉనికి ఆధారపడి ఉందని నిర్ణయించుకున్నాయి. ఈ క్రమంలోనే విశ్వవిద్యాల యాలను ‘మేధో పెట్టుబడి’కి కేంద్రాలుగా మార్చాలన్న తలంపు వచ్చింది. ఇలా ఆర్థికాంశాలపై విశ్వవిద్యాలయాలను కేంద్రీకరింప చేయాలన్న ఆలోచన అంతకు ముందు రాలేదు. కనుకనే విశ్వవిద్యాలయాలు పారిశ్రామిక పెట్టు బడి దారి వర్గాల ఎత్తుబిడ్డలయ్యాయి. ఇలా పరిశ్రమల భాగస్వామ్యం విస్త రించడంతో విశ్వవిద్యాలయాల మీద పారిశ్రామికవేత్తలకు హక్కు సంక్రమిం చింది. దీనితో విశ్వవిద్యాలయాలు, కార్పొరేట్లు కలసి నష్టాలను సమాజం మీద రుద్దుతూ, ఈ కలయికతో వచ్చిన లాభాలను మాత్రం ప్రైవేటీకరించడా నికి  మార్గం ఏర్పరచుకున్నాయి’ (డిజిటల్‌ డిప్లొమా మీల్స్‌ పే.27–28).

ఇక్కడా అలాంటి కుతంత్రమే
ఈ పరిణామంలో భాగంగానే ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని తొలిమెట్టుగా కోకాకోలా యూనివర్సిటీగా మార్చే యత్నం 1990లలోనే జరిగింది. అయితే అధ్యాపకులు, విద్యార్థుల నిరసనను ఎదుర్కొనవలసి వచ్చింది. కోలా కంపెనీ తోక ముడిచింది. ఈ ఊపులోనే తెలుగుదేశం ప్రభుత్వం విశ్వవిద్యాల యాల స్వయం ప్రతిపత్తిని దెబ్బ తీస్తూ ప్రభుత్వ జోక్యాన్ని ఉపసంహరిస్తూ, ఆ సంస్థలే నిధులు సమకూర్చుకోవాలని, ప్రభుత్వం నుంచి నిధులు రావని చెబుతూ ప్రైవేటీకరణకు, విదేశీ జోక్యానికి దారులు వేసిన సంగతిని మరచిపోలేం.

ఇదే సమయంలో మెక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ తన ఆఫ్రికా పర్యటనలో ఎదురైన  కొన్ని జీవనసత్యాలను వెల్లడించారు: ‘టెక్నాలజీ అనేది దారిద్య్రాన్ని నిర్మూలించడానికి తోడ్పడే పాలనా వ్యవస్థకు సహకరించే సాంకే తిక పరిజ్ఞానమేగానీ, దానికదే దారిద్య్రాన్ని నిర్మూలించలేదు. అలాగాక, టెక్నాలజీ లేదా కంప్యూటర్లే సమస్యను పరిష్కరించిపెడతాయని ఎవరైనా భావిస్తే తెలివితక్కువతనం’(చూ: ‘ది రోడ్‌ ఎహెడ్‌’–బిల్‌గేట్స్‌). ‘అయ్యా! మీ కంప్యూటర్‌తో మీక్కావలసిన భోజనం, తిండి సదుపాయాలు వస్తా యా?’ అని సామాన్య ప్రజలూ, అన్నార్తులూ ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక బాధతో నోరు కట్టేసుకున్నానని తన అనుభవాన్ని గేట్స్‌ చెప్పారు. బడా గుత్త కంపెనీలకూ, కార్పొరేట్లకూ దేశ దేశాల జాతీయ సంపదను దోచుకోడానికి ప్రధానంగా టెక్నాలజీని అందుబాటులో ఉంచడం పెట్టుబడి వ్యవస్థ లక్ష్య మని అమెరికా విద్యావేత్తలు మైఖేల్‌ డాసన్, బెలామీ హెచ్చరిస్తున్నారు.

పద్నాలుగు రాష్ట్రాలలో ఇదే తంతు
ఏతావాతా జరుగుతున్నది లాభాల ప్రైవేటీకరణ, నష్టాల సామాజీకరణ. ఈ లాభాల తొక్కిసలాటలోనే అమెరికన్‌ స్వాతంత్య్ర చిహ్నాన్ని, స్వేచ్ఛాగీతాన్ని ఆధునిక అమెరికన్‌ పాలనా వ్యవస్థలు భ్రష్టు పట్టించి, ఇతర దేశాలను దురా క్రమించే ‘తుపాకీ సంస్కృతి’ని (గన్‌ కల్చర్‌) అమెరికా పౌర జీవితానికి ‘రక్షరేఖ’గా మలిచాయి. ఉద్యోగాన్వేషణలో, విద్యార్జనలో భాగంగా అమెరికా వెళ్లగోరే భారత విద్యార్థులకు అదే ‘శిక్షా’స్మృతిగా మారింది. 2003లో అమె రికా విద్యకు బలైన ధీరజ్‌ (ఈ వ్యాసకర్త మనుమడు)తో మొదలైన ముక్కు పచ్చలారని తెలుగుబిడ్డల ఆహుతితో కలుపుకుని అమెరికాలో భారత విద్యా ర్థులు, వారి కుటుంబీకులు, మిగతావారూ నేటివరకు ప్రాణాలొడ్డిన వారి సంఖ్య 14 రాష్ట్రాలకు వ్యాపించింది.

ఈ సందర్భంగా ఆ దుష్పరిణామాల వెనుక మరో కోణాన్ని చూడాలి. తన ఆర్థిక సంక్షోభాన్ని ‘తిలా పాపం తలా పిడికెడు’గా పంచే ప్రయత్నంలో భాగంగానే ‘హెచ్‌ 1–బి’ వీసాల అనుమతి ద్వారా భారత్‌ నుంచి రిక్రూట్‌ చేసుకునే అభ్యర్థులతో ఎక్కువ జీతాల మీద అమెరికాలో ఉంచి పని చేయించుకోవాల్సి వస్తున్నదన్న మిషపైన, భారత ఐటీ రంగంలోనే వారిని ఉంచి తక్కువ జీతాలతో లాభించవచ్చునని అమె రికా పాలకులు భావించి చాకిరీ చేయించుకుంటున్నారు. మరోవైపున తమ పౌరులæ ఉద్యోగాలను భారతీయులు కాజేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అమెరికన్‌ నిరుద్యోగుల ఒత్తిడి న్యాయబద్ధం. కానీ భారతీయుల్ని ఉద్యోగాలకు తీసుకురాకుండా స్థానికులకే (అమెరికన్లకే) ఉద్యోగాలివ్వాలని, తప్పితే దుకా ణాలు వదిలివెళ్లాలన్నది ట్రంప్‌ పథకం. ఒబామాదీ ఇదే తంతు. కానీ భార త్‌ను బుజ్జగించడానికి ఒబామా, క్లింటన్‌లు చేసిన పని–అమెరికా మంత్రి వర్గాల్లోకి, దౌత్య వ్యవహారాల్లోనూ కొందరు ‘ఇండియన్‌ అమెరికన్ల’ను ప్రవేశ పెట్టడం. మొన్నటిదాకా ఢిల్లీలో అమెరికా రాయబారిగా ఉన్న రిచర్డ్‌ వర్మ అందుకు ఉదాహరణ. గతంలో రాయబారి మల్‌ఫోర్డ్‌ అన్నమాట–‘అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇండియన్‌ అమెరికన్ల వల్లనే నిలబడుతోంది’. ఇది మనకు కితాబా? మన పరాధార స్థితిని ఎగతాళిజేసే మతాబా?!

- ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement