
ట్రంప్ తెంపరితనం
కొత్తగా అధికార పీఠాన్ని అధిరోహించిన వారిపై ప్రజానీకంలో భ్రమలో, ఆశలో ఉంటాయి. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలకూ, ప్రభుత్వాధినేతగా చేసే పనులకూ మధ్య పొంతన లేనిపక్షంలో వాటి స్థానంలో సందేహాలు బయల్దేరతాయి. అదే ధోరణి కొనసాగుతుంటే ఆ సందేహాలు బలపడి ప్రభుత్వ వ్యతిరేకతగా మారతాయి. కాలం గడుస్తున్నకొద్దీ ఆ వ్యతిరేకత విస్తరిస్తుంది. పాలకులను నిలువునా ముంచేస్తుంది. కానీ అమెరికా అధ్యక్షుడిగా ఈ నెల 20న బాధ్యతలు చేపట్టిన డోనాల్డ్ ట్రంప్ తీరే వేరు. ఆయనను విజేతగా ప్రకటించిన నాటినుంచే దేశంలో నిరసనలు బయల్దేరాయి. అవి నానాటికీ విస్తరిస్తున్నాయి.
ఆయన ప్రమాణ స్వీకా రోత్సవంలో పాల్గొన్నవారికన్నా ఆరోజు దేశంలో నిరసన ప్రదర్శనల్లో పాలుపంచుకున్నవారి సంఖ్యే అధికం. మహిళలు ప్రపంచవ్యాప్తంగా భారీ ప్రదర్శనలు నిర్వహించారు. మరొకరైతే ఇవన్నీ గమనించి కాస్తయినా పునరాలోచనలో పడేవారేమో. తీరు మార్చుకునేవారేమో. ట్రంప్ మొండి ఘటం. ప్రమాణస్వీకారం చేయగానే అల్పాదాయ వర్గాలకు తక్కువ ప్రీమియంతో ప్రాణావసరమైన వైద్య చికిత్సలను అందిస్తున్న ‘ఒబామా కేర్’ను నిలుపుదల చేసే కార్యనిర్వాహక ఉత్తర్వులపై తొలి సంతకం చేసి తనది విధ్వంసక మార్గమేనని తేల్చిచెప్పారు. ఈ ఒక్క సంతకంతో కోటి 80 లక్షలమంది అమెరికా పౌరుల ఆరోగ్య బీమాను ఆయన అనిశ్చితిలో పడేశారు. ముందూ మునుపూ ఇది సెనేట్‌లో ఆమోదం పొందితే ‘ఒబామా కేర్’ శాశ్వ తంగా రద్దవుతుంది.
శరణార్ధులకూ, వలసవచ్చినవారికి కూడా కష్టాలు మొదలయ్యాయి. సిరియా నుంచి వచ్చేవారిపై నిరవధిక నిషేధం విధించారు. శరణార్ధుల పునరావాస కార్య క్రమం రెండు నెలలు ఆపేస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాదు ఏడు ఇస్లామిక్ దేశాల పౌరులకు మూడు నెలలపాటు వీసాల జారీని నిలిపేశారు. ఈ ఉత్తర్వులు వెలువడిన వెంటనే దేశంలోని విమానాశ్రయాల్లో దిగినవారి తనిఖీలు మొదల య్యాయి. గ్రీన్‌కార్డులున్నా, వీసాలున్నా ఆ దేశాలకు చెందినవారికి నిర్బంధం తప్పలేదు. 18 నెలల పసిగుడ్డు మొదలుకొని 80 ఏళ్ల రిటైర్డ్ ప్రొఫెసర్ వరకూ అందరి కందరూ నానా ఇబ్బందులకూ లోనయ్యారు.
వీసాలుంటే అడ్డుకోవద్దని అమెరికా జడ్జి ఆదేశాలిచ్చిన సమయానికే విమానాశ్రయాల్లో ప్రభుత్వ అరాచకం మొదలైపో యింది. విమానాశ్రయాల్లోనే కాదు.. అధ్యక్ష భవనంలో కూడా ఆ మాదిరి అరా చకం కొలువుదీరింది. తొలుత ఈ ఉత్తర్వులు గ్రీన్‌కార్డున్నవారికి వర్తించబోవని ఆంతరంగిక భద్రతా విభాగం ప్రతినిధి ప్రకటించారు. అనంతరం మరో ప్రతినిధి అలాంటివారిపైనా తనిఖీలుంటాయని చెప్పారు. ఇప్పటికే వందమందిని ఆపేశా మని ఇంకొక ప్రతినిధి వెల్లడించారు. దీనిపై అమెరికాలోని 30 నగరాలు నిరసన ప్రదర్శనలతో అట్టుడుకుతుండగా తన నిషేధంలోని ఆంతర్యం పర్యాటక ఆంక్షలే తప్ప ముస్లింలను ఉద్దేశించింది కాదంటూ ట్రంప్ గొంతు సవరించుకున్నారు.
‘కొత్త బిచ్చగాడు పొద్దెరగడ’న్నట్టు ట్రంప్ ఇలా తొలి వారంలోనే నానా రకాల ఉత్తర్వులూ వెలువరించారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అధ్యక్షుడు కార్య నిర్వాహక ఉత్తర్వులు జారీ చేయడం అమెరికాలో రివాజు. కానీ ట్రంప్ వచ్చాక అదంతా అటకెక్కింది. తోచిందే తడవుగా అనాలోచిత ఉత్తర్వులు బయటికొస్తు న్నాయి. ఆ ఏడు దేశాల పౌరులకూ వీసాల జారీలో క్షుణ్ణంగా తనిఖీలుంటాయని ప్రకటిస్తే ఎవరూ అభ్యంతర పెట్టరు. అలాంటి హక్కు, అధికారం ప్రపంచంలో ఏ దేశానికైనా ఉంటుంది. కానీ గంపగుత్తగా నిలిపేస్తామంటే, నిషేధం విధిస్తామంటే చెల్లదు. అలా చేయడానికి ముందు దేశంలో జరిగిన ఉగ్రవాద చర్యలకు ఆ దేశాల నుంచి వచ్చినవారు కారకులని ప్రభుత్వం నిరూపించాల్సి ఉంటుంది.
చిత్రమే మంటే అమెరికాలో గత కొన్నేళ్లుగా నమోదైన ఉగ్రవాద కేసుల్లో ఈ దేశాల పౌరులు ఒక్కరూ లేరు. కేసులున్నవారిలో ఎక్కువమంది సౌదీ అరేబియాకు చెందినవారు కాగా ఆంక్షలున్న దేశాల జాబితాలో అది లేనేలేదు! ట్రంప్ కపటత్వానికి, అవగాహ నలేమికి ఇంతకన్నా నిదర్శనం ఏం ఉంటుంది? ఆయనకున్న ‘ఇస్లామ్ ఫోబియా’ ప్రపంచానికంతకూ తెలుసు. ఎన్నికల ప్రచార పర్వంలోనే దాన్ని అనేకానేకసార్లు బయటపెట్టుకున్నారు. ఇప్పుడు అధికారంలోకొచ్చాక అలాంటి అనాలోచిత, నిరా ధార భయాలన్నిటిపైనా కార్యాచరణ మొదలెట్టారు.
భవిష్యత్తులో ట్రంప్‌లాంటి పాలకులు దాపురిస్తారని చాన్నాళ్లక్రితమే జార్జి ఆర్వెల్ (1984), ఆల్డస్ హక్స్‌లీ (బ్రేవ్ న్యూవరల్డ్), సింక్లెయిర్ లెవిస్ (ఇట్ కాంట్ హ్యాపెన్ హియర్) వంటి కాల్పనిక రచయితలు కొందరు ఊహించారు. మేధావి నోమ్ చోమ్‌స్కీ అయితే అయిదు దశాబ్దాలుగా తన రచనల ద్వారా, ప్రసంగాల ద్వారా హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇది మేడిపండు ప్రజాస్వామ్యమని చెబుతూ వచ్చారు. పరాయి దేశాల్లో పరమ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ప్రభుత్వాలను కూల్చే... ప్రజాదరణ గల అధినేతలను హతమార్చే అమెరికన్ పాలకులు ఏదో ఒకరోజున ఇక్కడ కూడా అలాంటి నిరంకుశ ధోరణులనే ప్రతిష్టిస్తారని చెప్పారు.
ప్రస్తుత పరిణామాలను గమనిస్తే ట్రంప్ రూపంలో అదంతా వాస్తవ రూపం దాల్చినట్టు కనబడుతోంది. ఈ దుస్థితికి ట్రంప్ అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన రిపబ్లికన్ పార్టీ మాత్రమే కాదు... దాని ప్రత్యర్థి పక్షం డెమొక్రటిక్ పార్టీ బాధ్యత కూడా ఉంది. అలాంటి ధోరణులకు ఉద్దేశపూర్వకంగానో, ఉదాసీనం గానో ఆ రెండు పార్టీలూ కారణమయ్యాయి. ఇప్పుడు తమ దేశానికేర్పడిన ముప్పుపై అమెరికా పౌరులు రోడ్లపైకి వచ్చారు. ఇలాంటి పోకడలను తాము సహించబోమని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఫేస్‌బుక్, గూగుల్ వంటి సాఫ్ట్‌వేర్ దిగ్గజాల అధిపతులు సైతం అభ్యంతరం చెబుతున్నారు. వీటన్నిటి పర్యవసానంగా ట్రంప్ మానసిక స్థితి మెరుగుపడవచ్చునని ఎవరైనా భావిస్తే అది దురాశే. కనీసం ఆయన్ను అందలం ఎక్కించిన రిపబ్లికన్లకైనా జ్ఞానోదయం అవుతుందో, లేదో చెప్పలేం. నిరంతర జాగురూకత కొరవడితే ఏమవుతుందో అందరూ తెలుసు కోవడానికి మాత్రం ఇది పనికొస్తుంది.