వాషింగ్టన్: రెండోసారి అమెరికా అధ్యక్షునిగా ఎన్నికయ్యేందుకు అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసి జార్జియా రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారని డొనాల్డ్ ట్రంప్‌పై అమెరికా గ్రాండ్ జ్యూరీ అభియోగాలు నమోదుచేసింది. మరోసారి అధ్యక్షపీఠంపై కూర్చుకునేందుకు తహతహలాడుతున్న ట్రంప్‌పై అభియోగాలు నమోదవడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. ఫుల్టన్ కౌంటీ గ్రాండ్ జ్యూరీ సోమవారం తన 41–చార్జ్ అభియోగాల పత్రంలో సంబంధిత వివరాలను పొందుపరిచింది.
ట్రంప్‌తోపాటు మరో 18 మందిపై అభియోగాలు నమోదయ్యాయి. ఎన్నికల ఫలితాలు ట్రంప్‌కు అనుకూలంగా వచ్చేలా చేసేందుకు తోటి వ్యక్తులు కుట్ర పన్నారని జ్యూరీ పేర్కొంది. ఆగస్ట్ 25వ తేదీలోపు ఈ 19 మంది స్వచ్ఛందంగా సరెండర్ కావాలని ఫుల్టన్ కౌంటీ జిల్లా మహిళా అటార్నీ ఫ్యానీ విల్లీస్ సోమవారం ఆదేశించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ట్రంప్ మాజీ న్యాయవాది రూడీ గిలియానీ, శ్వేతసౌధం మాజీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మార్క్ మిడోస్, అధ్యక్షభవనం మాజీ న్యాయవాది జాన్ ఈస్ట్‌మన్, న్యాయశాఖ మాజీ ఉన్నతాధికారి జెఫ్రీ క్లార్క్ ఉన్నారు.
రాజకీయ దురుద్దేశం: ట్రంప్
‘ఇదంతా రాజకీయ దురుద్దేశంతో చేస్తున్న ఆరోపణ’ అని ట్రంప్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అభియోగాలను అధికార డెమొక్రటిక్ పార్టీ నేతలు సమర్థించారు. ‘ఎన్నికల ప్రక్రియను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ట్రంప్ పన్నిన కుట్రను ఈ అభియోగాలు బట్టబయలుచేస్తున్నాయి’ అని సెనేట్ మెజారిటీ లీడర్ షూమర్, హౌజ్ మైనారిటీ లీడర్ హకీమ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment