అభిప్రాయం
రైలు ప్రమాదం వంటి ఒక మానవీయ విషాద సందర్భంలో కూడా ఇటువంటి 'విద్రోహ' ప్రచారానికి పూనుకోవడం ఈ రాజ్యానికి, దానికి అండగా నిలిచిన మీడియాలోని ఒక సెక్షన్‌కే చెల్లింది. ప్రజాస్వామ్యమా బహుపరాక్!
ఛత్తీస్‌ఘడ్‌లోని జగదల్‌పూర్ నుంచి ఒడిశా రాజధాని భువ నేశ్వర్‌కు వెళ్లే హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ రైలుకు విజయనగరం జిల్లా కూనేరు రైల్వే స్టేషన్ దగ్గర జనవరి 21 శనివారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో నలభై మందికి పైగా మరణించారు. యాభై మందికి పైగా గాయపడ్డారు. పట్టాలు విరగడం వల్ల, అవి కూడా క్రాస్‌గా కాకుండా షార్ప్‌గా విరగడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఏ ప్రమాదం జరిగినా పలు కోణాల నుంచి ఊహాగానాలు, దర్యాప్తులు సాగవచ్చు. కాని బాధ్యులను కాపాడడానికి 'విద్రోహ చర్య' అని వెంటనే ప్రకటించడం ప్రభుత్వం తన బాధ్యత తప్పించుకోవడానికి ఒక తక్షణ సమీప మార్గం అవుతుంది.
రైల్వే అధికార ప్రతినిధి అనిల్ సక్సేనా ఇది విద్రోహ చర్య అనడానికి ఆధారాలు ఉన్నాయని సమర్థించుకునే ప్రయత్నం చేశాడు.ఇది నక్సల్ ప్రభావం ఉన్న ప్రాంతం గనుక, గణతంత్ర దినం ముందు జరిగింది గనుక’’ ఆయన అనుమానం అటు వెళ్లింది. ఈ రైలు ప్రమాదంలో ఇటువంటి విద్రోహ చర్య ఏమైనా ఉన్నదా అని విచారించడానికి జాతీయ భద్రతా ఏజెన్సీ(ఎన్‌ఐఏ)ని ఆదేశించే అవకాశాలు ఉన్నట్టు ఒక ప్రముఖ ఇంగ్లిష్ దినపత్రిక తెలిపింది. ఒడిశా డీజీపీ కేబీ సింగ్ ఈ రైలు ప్రమాదంలో మావోయిస్టుల ప్రమేయానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని, మావోయిస్టుల కదలికలపై నిఘా వేసిన సీనియర్ అధికారితో మాట్లాడి తాను ధృవీకరించుకున్నట్లు చెప్పారు(సాక్షి, జనవరి 23, 2017, పేజి 5). అయినా కూడా కొన్ని పత్రికలు ఈ మీడియా ట్రయల్ నిర్వహించడం ఏమిటి? ఒక దినపత్రిక పతాక శీర్షికయే 'విద్రోహమా, నిర్లక్ష్యమా?' నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావడంతో విద్రోహ చర్యను తోసి పుచ్చలేమని ఢిల్లీ రైల్వే వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి... ఏది ఏమైనా రైల్వే భద్రతా కమిషనర్ విచారణలో అసలు కారణం వెల్లడవు తుంది’’ అంటూనే, ఆ విచారణ నిష్పక్షపాతంగా జర గకుండా ఉండడానికి ఆ పత్రిక గతం నుంచి చాలా మసాలా అందించింది.
సహజంగానే చంద్రబాబు ప్రభుత్వం వెంటనే సీఐడీ విచారణకు ఆదేశించింది. కనుక ఆ దినపత్రిక ‘‘రైల్వే స్టేషన్ ఏఓబీలోని మావో యిస్టు ప్రాబల్య ప్రాంతంలో ఉంది. సుమారు పదేళ్ల కిందట మావోయిస్టులు ఈ రైల్వే స్టేషన్‌ను పేల్చేశారు. అక్కడ సామగ్రిని తగలబెట్టారు... తాజాగా జరిగిన దుర్ఘటన కూడా అదే ప్రాంతంలో జరగడం, పట్టా విరి గిన తీరుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నా’’యని రాసింది మరో దినపత్రిక. ఎలక్ట్రానిక్ మీడియాలో ఎక్కువగా చెప్తున్నట్లు ఇటీవలి బెజ్జంగి ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారం కావచ్చు అనే మాట ఒక్కటి రాయలేదు.
ఈ విధంగా ఊహించడమూ, అనుమానించడమూ ఏకపక్షం అని కాదు గాని, అటువంటి సందర్భాలలో వివిధ కోణాలలో ఉన్న ఊహాగానాలు, అనుమానాలు కూడా నిష్పక్షపాతంగా రాయాల్సి ఉంటుంది. ఆ పని ఒక 'సాక్షి' పత్రిక చేసింది. దీనిని 'విద్రోహ చర్యగా చిత్రీకరణ?' చేస్తున్నారనే శీర్షికతో ఇట్లా రాసింది: "హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ దుర్ఘటనలో బాధ్యులైన సంబంధిత అధికారులు, ఇంజినీరింగ్ అధికారులను బయట పడేయడానికి రైల్వే ఉన్నతాధికారులు ఎత్తుగడలు వేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనకు విద్రోహ చర్య కారణమై ఉంటుందన్న ప్రచారం లేవదీయడం, విరిగిన పట్టాను ఎవరో కోసారన్న వాదనను తెరపైకి తేవడం ఇందులో భాగమేనని అంటున్నారు. ప్రమాద ప్రాంతం మావోయిస్టుల కదలికలు ఉన్న ఏరియా కావడంతో ఆ నెపాన్ని వారిపై నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారని... ఈ హిరాఖండ్ రైలు ప్రమాదాన్ని కూడా ఏదోలా విద్రోహ చర్యగా నెట్టేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతుంది."
కేంద్ర, ఆంధ్ర ప్రభుత్వాలు, వాటికి అనుకూలమైన దినపత్రికలు స్పందించిన వేగంతోనే నేను స్పందించడా నికి కారణం ఉంది. ఇంచుమించు ఈ రైలు ప్రమాదంలో మరణించినంత మంది బెజ్జంగి ఎన్‌కౌంటర్‌లో కూడా మరణించడం వల్ల కేంద్ర, ఆంధ్ర ప్రభుత్వాలు ఆత్మ రక్షణలో పడి మావోయిస్టు పార్టీపై విపరీతమైన దుష్ప్ర చారం చేస్తున్నవి. జనవరి 23న ఏపీలోని అన్ని జిల్లా కేంద్రాలలో టీడీఎఫ్ నిజనిర్ధారణ బృందం అరెస్టుకు నిరసనగా ధర్నాలు, ప్రదర్శనలు జరుగుతూ ఉంటే, మఫ్టీలోని పోలీసులతో పోస్టర్‌లు, కరపత్రాలతో ఒక కౌంటర్ ప్రచారం చేస్తున్నది ఏపీ ప్రభుత్వం. ఎన్ కౌంటర్ జరిగిన నాటి నుంచి దాన్ని నిరసిస్తున్న అన్ని ప్రజాసంఘాలపై, వాటి కార్యకర్తలు, నేతలపై, మహిళ లపై చెప్పనలవి కాని దుష్ప్రచారానికి పూనుకున్నది.
2009 నుంచి తూర్పు, మధ్య భారతాల్లో గ్రీన్ హంట్ పేరుతో ప్రజలపై సాగిస్తున్న యుద్ధానికి మోదీ ప్రభుత్వం 'మిషన్ 2016' అని పేరు పెట్టింది. అయినా ప్రకటించినట్లుగా 2016 చివరికి ఆదివాసుల విస్థాపన, నిర్వాసితత్వం, మావోయిస్టుల నిర్మూలన సాధించలేకపోవడంతో 'మిషన్ 2017' పేరుతో కొత్త పథకాలను రచిస్తున్నారు. మంద్రస్థాయి యుద్ధంలో భాగంగా ప్రచా రాస్త్రాన్ని పదును పెట్టుకోవడం వాటిలో ఒకటి. టీడీఎఫ్ నిజనిర్ధారణ బృందం అరెస్టు సందర్భంగా దీనినే బస్తర్ ఐజీ కల్లూరి వైట్ కాలర్ మావోయిస్టుల అణచివేత విధానంగా చెప్పుకున్నాడు.
అంటే, ప్రజాస్వామిక శక్తుల ప్రచారానికి విరుద్ధంగా ప్రభుత్వాలు, పోలీస్ యంత్రాంగం ప్రచారానికి ఎత్తుకోవడం అన్న మాట. రైలు ప్రమాదం వంటి ఒక మానవీయ విషాద సందర్భంలో కూడా ఇటువంటి 'విద్రోహ' ప్రచారానికి పూనుకోవడం ఈ రాజ్యానికి, దానికి అండగా నిలిచిన మీడియాలోని ఒక సెక్షన్‌కే చెల్లింది. ప్రజాస్వామ్యమా బహుపరాక్!
వరవరరావు
విరసం వ్యవస్థాపక సభ్యుడు