
గ్రామీణ అభివృద్ధిలో భాగమే ‘చేనేత’
టీఆర్‌ఎస్ ప్రభుత్వం గ్రామీణ పునరుజ్జీవం పేరుతో చేతివృత్తుల వారికి 2017–18 బడ్జెట్‌లో ప్రత్యేకమైన కేటాయింపులు చేసినట్లు కనపడుతోంది. వివిధ కుల వృత్తులకు నిలయమైన గ్రామీణ అభి వృద్ధికి ఉత్తేజం కల్పించాలనే తపనతో అదనంగా నిధుల కేటా యింపు అని చెబుతున్నారు. అందులో భాగంగానే ‘చేనేత వృత్తికి భరోసా’ కల్పించేందుకు, మొత్తంగా వృత్తికారుల ఉనికిని నిల బెట్టేందుకు చేనేతకు రూ. 12 వందల కోట్లను ప్రభుత్వం ప్రకటిం చింది. దీంతో రాష్ట్రంలో ఒక వర్గానికి జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపు చేసే ప్రక్రియకు తెరతీసింది. చేనేతలకు, వృత్తులపై ఆధారపడిన వారికి మాత్రం ఇలాంటి కేటాయింపులు లేవు. చేనేతకు రూ. 1,200 కోట్లు అనగానే బంగారు తెలంగాణ ఏమోగానీ, చేనేతల బ్రతుకుకు బంగారు భవిష్యత్ ఉందని కార్మికులు ఆశపడుతున్నారు. చావుభయంతో ఉన్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తునికి బ్రతుకు ఆశ కల్పించినట్లుగా ఉనికి కోల్పోతున్న చేనేత రంగానికి పునరు త్తేజం తెస్తున్నట్లు ప్రభుత్వం మరోసారి భ్రమలు కల్పిస్తున్నది.
తెలంగాణ చేనేత ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ప్రత్యేకంగా పోచంపల్లి టై అండ్ డై, గద్వాలు కుప్పడం చీరలు, హన్మకొండ తివాచీ, కరీంనగర్ దుప్పట్లు, ధోతీలు, లుంగీలు; దుబ్బాక గొల్ల భామలు చీరలు ఎంతో ప్రత్యేకత కల్గిన ఉత్పత్తులు. అంతేగాక దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ అవకా శాలు అంది పుచ్చుకుంటున్న ఉత్పత్తి రకాలు. అయితే 1980ల నుంచి చేనేత రంగం తన ఉనికిని కోల్పోతూ సహకార వ్యవస్థ కుంటుపడింది. దీనికి అవినీతి, యాజమాన్యాల నిర్వహణ లోపాలు, రాజకీయ పార్టీల జోక్యమే కారణం. ఈ దుస్థితి వల్లనే 1995 వరకు సుమారు 73,119 మగ్గాలు ఉండగా నేడు 17,000 సంఖ్యకు తగ్గిందని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.
అయితే ప్రభుత్వ డేటా మగ్గాల సంఖ్య తగ్గిందని చూపు తుందే కానీ, 11,643 మగ్గాలపై ఆధారపడి జీవిస్తున్న 69,858 మంది చేనేతపై పొందుతున్న ఉపాధిని కోల్పోయారని మాత్రం చెప్పదు. వృత్తిపై ఆధారపడి జీవిస్తూ అప్పుల బాధ తట్టుకోలేక, అనారోగ్య పీడితులై ఆత్మహత్యలు చేసుకున్న 234 కుటుంబాలలో 89 మందికి సంబంధించిన పోస్ట్‌మార్టం రిపోర్టులు, ఎఫ్‌ఐఆర్ కాపీలు లేవంటూ ఎక్స్‌గ్రేషియా ఇవ్వడానికి ప్రభుత్వం నిరాకరిం చింది. చావులో కూడా ప్రభుత్వ వివక్షకు ఇంతకంటే నిదర్శనం లేదు. కేసీఆర్ పాలనలో 11 మంది చేనేతలు ఆత్మహత్య చేసుకు న్నారు. చేనేతపట్ల చేసిన నిర్లక్ష్యానికి బలైన కుటుంబాలకు జవాబు దారీ ఎవరు? రాజ్యం భరోసా ఇవ్వనందునే, సంక్షేమ చర్యలు, వృత్తిని ఆదుకొనే విధానాలు లేనందునే తెలంగాణలో కానీ మరె క్కడైనా శ్రమించే లక్షణం పుణికి పుచ్చుకునే చేనేత కార్మికులు ఆత్మ గౌరవంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
2014–15 ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన నిధులలో రూ. 74.93 లక్షలలో కేవలం రూ. 49.87 లక్షలు మాత్రమే త్రిఫ్ట్ పథకంకు ఖర్చు చేశారు. 2015–16 సంవత్సరంలో కూడా రూ. 199.50 లక్షలు కేటాయించి రూ. 49.47 లక్షలు మాత్రమే ఖర్చు చేశారు. రుణమాఫీ పథకానికి రూ. 239 లక్షలు కేటాయించి, రూ. 176.16 లక్షలు మాత్రమే నిధులు విడుదల చేసింది. ముడిసరుకు సరసమైన ధరలకు అందించాలనే చేనేతల డిమాండ్ ఫలితంగా ప్రవేశపెట్టిన యారన్ సబ్సిడీ పథకానికి (10 శాతం) రూ. 450.00 లక్షలు కేటాయించి రూ. 225.00 లక్షలు మాత్రమే నిధులిచ్చింది.
గద్వాల్ చేనేత పార్క్ స్థాపనను ప్రకటనకే పరిమితం చేసి నిధులు కేటాయించక పోవడంతో పనులు ప్రారంభించక చేనేత కార్మికుల ఆశలు ‘ఎండమావి’గా మారాయి. వడ్డీ రాయితీని రూ. 750.70 లక్షలు మాత్రమే ఖర్చు చేశారు. బడ్జెట్ కేటాయింపుల ప్రకారం పథకాలను అమలు చేయకపోవడం వలన తెలంగాణలో చేనేత ఉపాధి ప్రశ్నార్థకమై కార్మికులు ఇతర రంగాలలో ఉపాధి పొందేందుకు పట్టణ ప్రాంతాలకు వలసలు వెళ్లడం వలన చేనేత గ్రామాలలో మగ్గాల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇప్పటికే సూరత్, భివాంధే, షోలాపూర్‌లకు వలసలు వెళ్లిన తెలంగాణ చేనే తలు నేడు అమలు జరుగుతున్న వేతనాల సమస్యతో చాలీ చాలని జీతాలతో బ్రతుకునీడ్చలేక అనారోగ్య పీడితులై దుర్భర దారిద్య్ర జీవితాలను అనుభవిస్తున్నారు. వారందరినీ ఇక్కడకు తెచ్చే ఏర్పా టుచేస్తానని కేసీఆర్ ఎన్నికల్లో వాగ్దానం చేశారు. అయితే వారిని ఇక్కడికి తీసుకొచ్చేది వేతన కూలీలుగా చేయడానికా లేక స్వయం సమృద్ధి చెందించడానికా అనేది ప్రశ్న. నిజంగా స్వయంసమృద్ధి కొరకు అయితే అపెరల్ పార్కులను, మెగా టెక్స్‌టైల్ పార్కులను ప్రతిపాదించాల్సిన అవసరం లేదు.
ప్రభుత్వానికి చేనేత పరిశ్రమలను కాపాడాలనే తపన ఉంటే తక్షణమే 20 శాతం వేతన రాయితీని కార్మికులకు ప్రకటించాలి. ఈ పథకం అమలుకు సగటు నెల వేతనాన్ని రూ. 12 వేల నుంచి రూ. 15 వేలుగా గుర్తించి, కార్మికులు నెలవారీగా సంఘాలు లేక మాస్టర్ వీవర్స్ వద్ద పొందుతున్న మజూరీలనుబట్టి వేజ్ ఇన్సెం టివ్‌ను లెక్కకట్టి ఇవ్వాలి. చేనేత అభివృద్ధిని గ్రామీణ అభివృద్ధిలో భాగంగా ఆలోచించి విధానాలు రూపొందించాలి. గ్రామీణ నిరు ద్యోగ నిర్మూలనకు చేనేత రంగ అభివృద్ధి ఒక చక్కని అవకాశంగా గుర్తించి ప్రత్యేక ప్రణాళికలను, స్థానిక మార్కెట్ అవకాశాలను రూపొందించాలి. అంతిమంగా చేనేతనాయకులు, కార్మికులు సమస్య ప్రాతిపదికగా జరిపే పోరాట ఆచరణ మాత్రమే నిజమైన గుర్తింపుగా భావించి సంఘటిత పోరాటాలు చేయాలి.
- మాచర్ల మోహన్‌రావు,
వ్యవస్థాపక అధ్యక్షులు రాష్ట్ర చేనేత జనసమాఖ్య, తెలంగాణ weavers.hl@gmail.com