భగత్‌సింగ్‌పై ఇంత ప్రేమకు ఏది కారణం? | what is the reason behind over love on baghath singh | Sakshi
Sakshi News home page

భగత్‌సింగ్‌పై ఇంత ప్రేమకు ఏది కారణం?

Published Fri, May 13 2016 12:48 AM | Last Updated on Sun, Sep 3 2017 11:57 PM

భగత్‌సింగ్‌పై ఇంత ప్రేమకు ఏది కారణం?

భగత్‌సింగ్‌పై ఇంత ప్రేమకు ఏది కారణం?

అభిప్రాయం
మే 3వ తేదీన ‘సాక్షి’లో 'చరిత్ర చర్చ' శీర్షికతో వచ్చిన సంపాదకీయం ఆలోచింప చేసేదిగా ఉంది. ‘తరగతి గదుల నుంచి నిష్క్రమిస్తున్న ‘చరిత్ర’ పార్లమెంటుకెక్కడం మంచిదే అయినా ఆ చర్చ భగత్‌సింగ్‌ వ్యక్తిత్వం, ఆదర్శాలు, ఆయన కలలుగన్న సమాజం తదితరాలపై సాగాలని ఆశించి నప్పుడు ఆయన అవగాహనపై, విప్లవాచర ణపై మరింతగా దృష్టి పెట్టాలి. భగత్‌సింగ్‌ను బ్రిటిష్‌ వలసవాదులు ఉరితీయాలని సంకల్పించుకోవడానికి ప్రధాన మైన కారణం ‘ఆయన రూపొందుతున్న లెనిన్‌’ అని గుర్తించి భయపడ టమేనని అన్నాడు బిపన్‌ చంద్ర. అయితే భగత్‌సింగ్‌ను విప్లవకారు డుగా గుర్తించడానికి దేశంలోని నాటి ప్రధాన రాజకీయ పార్టీల కన్నిటికీ ఏదో ఒక అభ్యంతరముండింది. ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ అనే నినా దంతో, ఆయన ఉత్తర భారత్‌లో ఏర్పాటు చేసిన పలు సంస్థల ఆశయాలు, మార్గం ఆనాటి రాజకీయ పార్టీలలో వేటికీ ఆమోదయో గ్యమైనవి కాదు. నెహ్రూ, ఆయన అనుయాయులు భగత్‌సింగ్‌ ఆదర్శాన్ని, త్యాగాన్ని కొనియాడినట్లు కనిపించినా నెహ్రూపై, కాంగ్రెస్‌ పార్టీపై గాంధీకున్న పట్టువల్ల వాళ్ల సమర్థనకు పరిమితులేర్పడినాయి.

భగత్‌సింగ్, సహచర విప్లవకారుల పోరాటాల నాటికే కమ్యూనిస్టు పార్టీ ఏర్పడినా, ఆయన మార్గాన్ని అది అనుసరించనూ లేదు, ఆయ నను తమలోకి ఆహ్వానించనూ లేదు. ఐక్య కమ్యూనిస్టు పార్టీ 1946లో మెుదటిసారి సాయుధ పోరాట పంథాను ప్రకటించింది. 1947, సెప్టెంబర్‌ 11న సాయుధ పోరాటాన్ని ప్రారంభించినా 1948, సెప్టెంబర్‌ 13-17 నాటికే ఆ పంథా పట్ల అందులోని మితవాద వర్గా నికి విశ్వాసం సన్నగిల్లింది. బిపన్‌ చంద్ర ఈ కమ్యూనిస్టు సంప్ర దాయానికి, అవగాహనకు చెందినవాడు. కనుక వలస పాలకులకు, గాంధీకే కాదు 1951 నాటికి కమ్యూనిస్టు పార్టీకి కూడా భగత్‌సింగ్‌ను ఆయన విప్లవలక్ష్యం, పంథాను సమర్థించడానికి పరిమితులేర్పడి నాయి. బిపన్‌ చంద్ర వంటి వాళ్లకు కూడా అందుకే భగత్‌సింగ్‌ విప్లవ టెర్రరిస్టుగా కనిపించాడు. ఆ తర్వాత కాలంలో ఆయనను ‘సామ్యవాద విప్లవకారుడు’గా పేర్కొన్నప్పటికీ కమ్యూనిస్టు పార్టీకీ, బిపన్‌చంద్రకూ సామ్యవాద విప్లవానికీ వర్గపోరాటం అనివార్యమన్న అవగాహన పట్ల విశ్వాసం పోయింది. బిపన్‌ చంద్ర మెుదలైన మార్క్సిస్టు చరిత్రకారుల కృషి పట్ల పూర్తి గౌరవం చూపుతూనే, వాళ్ల చరిత్ర రచనకున్న ఈ పరిమితిని కూడా అర్థం చేసుకోవాలి. భగత్‌సింగ్‌పై ప్రత్యేకించి కృషి చేసిన వారిలో బిపన్‌ చంద్ర, ప్రొఫెసర్‌ చమన్‌లాల్‌లను మించిన వాళ్లు ఉండకపోవచ్చు. కాని భగత్‌సింగ్‌ను‘రూపొందుతున్న లెనిన్‌’గా చరి త్రలో నమోదు చేయడానికి ఆయన విప్లవ హృదయాన్ని వర్తమానంలో ఆవిష్కరించే ప్రాపంచిక దృక్పథం చరిత్రకారులకుండాలి.

‘ప్రజల కర్ణాటక చరిత్ర’ను పునర్‌నిర్మించే క్రమంలో స్వయంగా విప్లవకారుడు, అమరుడు సాకేత రాజన్‌ అటువంటి చరిత్ర రచనకు ప్రయత్నం చేశాడు. అది రెండు బృహత్‌ సంపుటాలుగా వెలువడి విశేష కృషిగా గుర్తింపు పొందింది. సాకేత రాజన్‌ వంటి వేలాది విప్లవ కారులను బూటకపు ఎన్‌కౌంటర్లలో చంపుతున్న పాలకులకు.. విప్లవ కారులను దేశద్రోహులుగా పేర్కొంటున్న బీజేపీకి భగత్‌సింగ్‌ మీద ఇంత ప్రేమ కలగడం చారిత్రక అవకాశవాదం కాక మరేమిటి? ఆయన ‘ఫిలాసఫీ ఆఫ్‌ బాంబ్‌’ గానీ, ‘నేను నాస్తికుణ్ని ఎలా అయ్యాను’ అంటూ ఆయనలో ఏర్పడిన పరిణామంగానీ, ఆయన ఎంచుకున్న విప్లవ మార్గం గానీ బీజేపీకి జీర్ణమయ్యే విషయాలేనా?
హిందూ జాతీయవాదాన్ని భారత జాతివాదంగా రుద్దుతున్న బీజేపీ.. భగత్‌సింగ్‌ భుజం మీద తుపాకి పెట్టి బిపన్‌ చంద్ర వంటి లౌకిక ప్రజాస్వామిక చరిత్రకారులను, కమ్యూనిస్టులను మాత్రమేకాదు విప్లవకారులను కూడా కాల్చదలుచుకున్నది. రోహిత్‌ వేముల మెుదలు కన్హయ్య కుమార్‌ వంటి విద్యార్థి నాయకుడు, ఉమర్‌ ఖలీద్, అనిర్బన్‌ వంటి విప్లవ విద్యార్థులు దేశద్రోహులుగా కనిపిస్తున్న సంఘ్‌ పరివార్‌కు భగత్‌సింగ్‌ను విప్లవ టెర్రరిస్టు అనడం అభ్యంతరకరం కావడం పచ్చి అవకాశవాదమే. మావోయిజాన్ని దేశద్రోహంగా చిత్రి స్తున్న హిందుత్వ శక్తులకు.. ఆ మావోయిస్టులకు వేగుచుక్క అయిన భగత్‌సింగ్‌ మీద ప్రేమ కలగడాన్ని మించిన ద్వంద్వనీతి ఉందా?
వ్యాసకర్త విరసం వ్యవస్థాపక సభ్యుడు
వరవరరావు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement