సాక్షి, విశాఖపట్నం: మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు వారికి అవసరమైన మౌలిక వసతులు కల్పించి రాయితీలిస్తామని, సకాలంలో అనుమతులిస్తున్నామని చెప్పారు. విశాఖలో భారత మహిళా పారిశ్రామికవేత్తల సమాఖ్య(అలీప్), దక్షిణాసియా మహిళాభివృద్ధి సంస్థ, ఏపీ ప్రభుత్వం కలిసి మూడు రోజులపాటు నిర్వహించే అంతర్జాతీయ మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సును ఆయన బుధవారం ప్రారంభించి మాట్లాడారు. ఐటీ రంగంలోనూ, ఉత్పాదకతలోనూ పురుషుల కంటే మహిళలే అధికంగా పోటీ పడుతున్నారని పేర్కొన్నారు. విశాఖ జిల్లా గిడిజాల వద్ద 50 ఎకరాల్లో అంతర్జాతీయ మహిళా పారిశ్రామికవేత్తల వ్యాపార సాంకేతిక అభివృద్ధి కేంద్రం ఏర్పాటవుతుందన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ప్రోత్సాహంలో భాగంగా రాష్ట్రంలో నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రియల్ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నట్టు సీఎం ఎతెలిపారు. విశాఖలో ఇప్పటికే రెండు సీఐఐ భాగస్వామ్య సదస్సులు నిర్వహించామని, మూడవది వచ్చే నెలలో జరుగుతుందని, ఈ సదస్సులో మహిళా పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు.
రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ఇప్పటిదాకా రూ.30,47,801 కోట్ల విలువైన 1900 ఒప్పందాలు చేసుకున్నామని, వీటి ద్వారా 30 లక్షల మందికి ఉపాధి కల్పించవచ్చని వివరించారు. ఉత్తమ పారిశ్రామిక విధానాలు అమలులోకి తెచ్చేందుకు సార్క్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్(డబ్ల్యుటీవో) సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. సార్క్ సెక్రటరీ జనరల్ అంజాద్ హుస్సేన్ బిసియల్ మాట్లాడుతూ ఈ సదస్సు వల్ల సార్క్ సభ్య దేశాల్లో మహిళా సాధికారిత మరింత వృద్ధి చెందుతుందన్నారు. అలీప్ అధ్యక్షురాలు కె.రమాదేవి మాట్లాడుతూ మహిళా పారిశ్రామికవేత్తల ప్రోత్సాహకానికి, పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు తమ సమాఖ్య కృషి చేస్తోందన్నారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, అమర్‌నాథ్‌రెడ్డి, కేంద్ర కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రత్యేక కార్యదర్శి బినయ్‌కుమార్, డబ్ల్యూటీవో ఈడీ రత్నాకర్ అధికారి, పారిశ్రామికవేత్తల సంఘం అధ్యక్షురాలు జ్యోతిరావు, కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, సార్క్ ఎనిమిది దేశాల మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు.
టెక్నాలజీ హబ్ ఏర్పాటుకు ఎంఓయూ
విశాఖ జిల్లా గిడిజాలలో అంతర్జాతీయ మహిళా పారిశ్రామికవేత్తల వ్యాపార, సాంకేతిక అభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు భారత మహిళా పారిశ్రామికవేత్తల సమాఖ్య, దక్షిణాసియా మహిళాభివృద్ధి సంస్థ, రాష్ట్ర ప్రభుత్వంల మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి సమక్షంలో మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, దక్షిణాసియా మహిళా అభివృద్ధి సంస్థ అధ్యక్షురాలు పరిమళా ఆచార్య రిజాల్, అలీప్ అధ్యక్షురాలు కె.రమాదేవిలు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment