
కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి గంటా శ్రీనివాసరావు
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటించాలన్న డిమాండ్‌తో నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన రాత్రి కార్యక్రమం చేపట్టారు. జ్ఞానాపురం వైపు ఉన్న రైల్వే స్టేషన్ ప్రవేశ ద్వారం వద్ద మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు సాగిన ఈ కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ రైల్వేజోన్ అంశం దాదాపు 30 ఏళ్లుగా నడుస్తోందన్నారు. ఇది ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ అని, బోర్డు చైర్మన్ కూడా ఇది పొలిటికల్ విషయమని తెలియజేశారని గుర్తు చేశారు. వుడా మాజీ చైర్మన్ ఎస్.ఎ.రహమాన్ మాట్లాడుతూ ప్రజల్లో చైతన్యం వచ్చి పోరాడినప్పుడు జోన్ తప్పక వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ గత ఎన్నికల సభలో మోడీ ఎన్నో హామీలు ఇచ్చారని, అందులో రైల్వే జోన్ ఒకటని గుర్తు చేశారు.
కానీ ఇప్పుడు దానిని బీజేపీ నాయకులు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఎన్‌జీవో జిల్లా ప్రెసిడెంట్, నాన్ పొలిటికల్ జేఏసీ కన్వీనర్, కె.ఈశ్వరరావు, ఉత్తరాంధ్ర పొలిటికల్ జేఏసీ రక్షణ వేదిక కన్వీనర్ ఎస్.ఎస్.శివశంకర్, వీజేఎఫ్ అధ్యక్షుడు శ్రీనుబాబు, ప్రత్యేక రాష్ట్ర పోరాట సమితి జి.ఎ.నారాయణరావు పాల్గొన్నారు. వేదికపై కూచిపూడి నాట్యం, మిమిక్రీ, మేజిక్‌షో, పేరడీ సాంగ్స్ తదితర పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
Comments
Please login to add a commentAdd a comment