
విజయనగరం మున్సిపాలిటీ: అగ్రిగోల్డ్ మోసపూరిత వైఖరితో ఆర్థికంగా నష్టపోయిన బాధితులకు బాసటగా నిలవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందని అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ సభ్యుడు మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. విజయవాడలో కమిటీ కో ఆర్డినేటర్ లేళ్లఅప్పిరెడ్డి అధ్యక్షతన శనివారం జరిగిన సమావేశంలో బాధితులుగా అండగా పోరాటం చేయాలని 11 మంది సభ్యులు తీర్మానించారన్నారు. పోరాటాలకు ప్రభుత్వం స్పందించకుంటే న్యాయ పోరాటం సాగించాలని నిర్ణయించామని చెప్పారు. సమావేశానికి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ముఖ్య అథిగాగా హాజరయ్యారని తెలిపారు. భవిష్యత్ కార్యాచరణపై కమిటీ సభ్యులకు బొత్స దిశా నిర్దేశం చేశారన్నారు.
అగ్రిగోల్డ్ సంస్థ మోసంలో అధిక సంఖ్యలో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన వారే బాధితులుగా ఉన్నారని, ఒక్క విజయనగరం జిల్లాలో పోలీస్ శాఖ లెక్కల ప్రకారం వెబ్‌సైట్‌లో లక్షా ఒక వెయ్యి 341 మంది బాధితులు నమోదయ్యారన్నారు. బాధితులకు ప్రభుత్వం తరఫున ఎటువంటి న్యాయం జరగకపోవడంతో పలువురు ఎజెంట్‌లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. బాధితులకు న్యాయం జరిగేవరకు పోరాటం సాగించాలని సూచిం చారని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం స్పందించకుంటే వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బాధితులకు న్యాయం చేయాలని నిర్ణయించామని చెప్పారు. సమావేశంలో మాజీ మంత్రి పొలుసు పార్థసారధి, ఎమ్మెల్యేలు ఆదిమూలపు సురేష్, అనిల్‌కుమార్‌యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు ఎం.ప్రసాదరామకృష్ణ, గౌరు.వెంకటరెడ్డి, కన్నబాబు, అధికార ప్రతినిధి టి.జె.సుధాకర్‌బాబు, సురేష్‌బాబు, మజ్జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారన్నారు.