
సాక్షి, అమరావతి: అగ్రిగోల్డ్ ఆస్తులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు గోల్డ్‌గా మారుతున్నాయని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఆయన శుక్రవారం హైదరాబాద్‌లో పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా ముసుగులో ఢిల్లీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు అగ్రిగోల్డ్ ఆస్తులను కొల్లగొట్టేందుకు అక్కడ చీకటి ఒప్పందాలు చేసుకున్నారని ధ్వజమెత్తారు. ఢిల్లీలో ఎవరికీ తెలియకుండా మాజీ ఎంపీ అమర్‌సింగ్‌ను కలిసి రహస్య ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు.
అగ్రిగోల్డ్ ఆస్తులపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకూ వైఎస్సార్‌సీపీ అండగా నిలుస్తుందన్నారు.బాబు సింగపూర్ పర్యటనకు ఎందుకు వెళ్లారో రెండు రోజుల్లో బయటపెడతామన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు టీడీపీ అధికార ప్రతినిధిగా మాట్లాడుతున్నాడని విమర్శించారు.