‘పునరావాసం’లో పదనిసలు.. | gudumba rehabilitation scheme in warangal | Sakshi
Sakshi News home page

‘పునరావాసం’లో పదనిసలు..

Published Sat, Jan 27 2018 1:25 PM | Last Updated on Wed, Sep 5 2018 8:43 PM

gudumba rehabilitation scheme in warangal

సాక్షి, వరంగల్‌ రూరల్‌: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో గుడుంబా పునరావాస పథకం అమలులో ఎక్సైజ్‌ అధికారులు పారదర్శకంగా వ్యవహరించడం లేదు. ఎక్సైజ్‌ సీఐ, ఎంపీడీఓ, మండల పశువైద్యాధికారి.. లబ్ధిదారులతో కలిసి జీవాలు, సామగ్రి కొనుగోలు చేయాల్సి ఉండగా.. ఈ నిబంధనను తుంగలో తొక్కేశారు. గొర్రెలు, గేదెల పంపిణీలో, కిరాణా దుకాణాల ఏర్పాటులో ఏకపక్షంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. గొర్రెలను, గేదెలను కొనుగోలు చేసి లబ్ధిదారుల ఇళ్ల వద్దకు తీసుకొచ్చి ఇచ్చారు. కిరాణా దుకాణాలు ఏర్పాటు చేసిన వారికి కూడా సామాగ్రి ఇప్పించారే తప్ప రూ.2లక్షల యూనిట్‌కు సంబంధించి ఎక్కడా లెక్కలు చెప్పలేదు. అధికారులు ముందే కమీషన్లు మాట్లాడుకొని లబ్ధిదారులకు అంటగట్టినట్టు తెలుస్తోంది. 

పునరావాసం ఇలా..
సారా తయారీని పూర్తిగా మానేసిన వారికి జీవనోపాధి చూపిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన హామీమేరకు గుడుంబా తయారీకి దూరంగా ఉన్న వారికి గొర్రెలు, బర్రెలు, ఆవులు, ఆటో రిక్షాలు, ఆటో ట్రాలీలు, కిరాణం షాప్, చెప్పుల షాప్, చికెన్‌ సెంటర్, స్టీల్‌ సిమెంట్‌ షాప్‌ల ఏర్పాటు చేసుకునేందుకు  ఆర్థికంగా సాయం చేశారు. ఒక్కో కుటుంబానికి రూ.2లక్షల చొప్పున అందించి పునరావాసం కల్పించారు. పునరావాసం పథకం కింద ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా 1038 మందిని ఎంపిక చేయగా, ఇప్పటివరకు 997 మందికి ఆర్థికసాయం అందజేశారు.

అడిగితే వేధింపులు
గతంలో సారా తాగేవారి ఇండ్లలోనే కాదు... తయారీదారుల ఇండ్లల్లో కూడా  సంతోషం కరువయ్యేది. సారా తాగి మరణించిన వారి ఇండ్లల్లో ఏడుపులు పెడబొబ్బలు వినిపిస్తే... సారా తయారుచేసిన వారి ఇండ్లల్లో కూడా అలాంటి రోదనలే కనిపించేవి. సారా తాగి ఇబ్బందులు పడ్డ కుటుంబాల వారు తయారీదారులపై దాడులు చేసి శాపనర్ధాలు పెట్టేవారు. దానికి తోడు ఎక్సైజ్‌ అధికారుల దాడులు నిర్వహించి సారా తయారీదారుల భరతం పట్టి జైలుకు పంపేవారు. అది తప్పు అని తెలిసినా తయారీదారులు గుడుంబా తయారు చేయడం మానేవారు కాదు. ఎందుకంటే వారికి అదే జీవనాధారం. సారా  తయారుచేసి దొంగ చాటున విక్రయిస్తే తప్పా కుటుంబం గడవలేని పరిస్థితి. తయారుదారులపై దాడులు చేసి జైల్లో పెట్టినా.. జైలు తిండి తిన్నా పర్వాలేదని మళ్లీ వచ్చిన తరువాత ప్రారంభించేవారు. మూడు పుటల పట్టెడన్నం తినాలంటే  సారా తయారు చేయాల్సిందే. దీంతో ఎక్సైజ్‌ శాఖాధికారుల కన్నుపడని చోట తయారుచేసి గుట్టల్లో, పొలాల్లో తయారుచేసి చాటుమాటున విక్రయించేవారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం గుడుంబా నిర్మూలనకు శ్రీకారం చుట్టింది ఇందులో భాగంగా గుడుం బా తయారీ, విక్రయాలను అరికట్టందుకు చేపట్టాల్సిన చర్యలపై దృష్టిసారించింది. వారికి స్వయం ఉపాధి కల్పించడంతోపాటు గుడుంబా అరికట్టేందుకు పటిష్ట ఏర్పాట్లు చేసింది. ఇంతవరకు భాగానే ఉన్నా.. పునరావాస పథకంలో పలువురు అధికారులు అవినీతికి పాల్పడుతుం డడంతో సర్కారు లక్ష్యం నీరుగారులతోంది. రూ.2 లక్షల విలువైన సామగ్రి, జీవాల కొనుగోళ్లకు సంబంధించి రశీ దులు అడిగిన లబ్ధిదారులకు వేధింపులు తప్పడం లేదు.

వరంగల్‌ రూరల్‌ జిలాకు చెందిన ఓ వ్యక్తి కొన్నేళ్లుగా  గుడుంబా తయారుచేశాడు. ఇప్పటి వరకు ఎక్సైజ్‌ పోలీసులు సుమారు పదుల సంఖ్యలో కేసులు పెట్టారు. ఇంకా ఒకలో, రెండో కేసులు ఉన్నాయి. గత సంవత్సరం ఆగస్టులో పునరావాసం కింద అతడికి రూ.2లక్షలతో ఆటో అందించారు. దీంతో నెలకు రూ.4వేల వరకు సంపాదిస్తున్నాడు. ఇది వరకు పోలీసులు వస్తున్నారంటే భయంతో జీవనం గడిపేవాడు. ఇప్పుడు కుటుంబసభ్యులతో ఆనందంగా ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇటీవల ఆటోకు ఎంత అయింది సారు.. రశీదులు ఇవ్వలేదని అడిగితే ఎక్సైజ్‌ అధికారులు అతడిని వేధింపులు గురిచేశారు. గత కేసులు తోడుతారనే భయంతో సదరు వ్యక్తి సైతం కిమ్మనకుండా ఉన్నట్లు తెలిసింది. 

ఎలా అంటే.. 
గుడుంబా తయారీ దారులు, విక్రయించే కుటుంబాలకు ప్రభుత్వం స్వయం ఉపాధి కింద పాడిగేదెలు, గొర్రెల వంటి జీవాలు కొనుగోలు చేసి ఇస్తోంది. ఈ డబ్బులు ఎంపీడీఓ ఖాతాల్లో పడుతున్నాయి. నిబంధనల ప్రకారం ఎక్సైజ్‌ సీఐ, ఎంపీడీఓ, మండల పశువైద్యాధికారి.. లబ్ధిదారులతో కలిసి జీవాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కానీ.. అధికారులు ఎవరికి తెలియకుండా ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసి లబ్ధిదారులకు అందజేస్తున్నారు. రశీదులు ఇవ్వకపోగా.. అడిగిన వారిని వేధిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చికెన్‌ సెంటర్లు, కిరాణాషాపులు ఏర్పాటు చేసుకునే వారికి సామగ్రి కొనుగోళ్ల సైతం అధికారులే చేస్తున్నారు. వీరికి ఒక్కొక్కరికి రూ.2 లక్షలు అందితే.. అందులో రూ. 20,000 నుంచి రూ. 50,000 వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

అవినీతికి ఆస్కారం లేదు..
గుడుంబా విక్రయం, తయారీ మానేసిన కుటుంబాలకు పునరావాస పథకం ద్వారా రెండు లక్షల రూపాయలు అందిస్తున్నాం. పథకం దుర్వినియోగం కాకుండా ప్రతి నెలా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి తనిఖీ చేపడుతున్నాం. పూర్తి పారదర్శకంగా జిల్లా కలెక్టర్‌ సౌజన్యంతో సంక్షేమాధికారులు చెక్‌లను అందిస్తున్నారు. అవినీతికి, దుర్వినియోగానికి ఆస్కారం లేదు. వరంగల్‌ అర్బన్‌లో 236 మంది ఎంపిక కాగా, ఇప్పటికే 201 మందికి పథకాన్ని అందించాం.
బాలస్వామి, ఎక్సైజ్‌ సూరింటెండెంట్, వరంగల్‌ అర్బన్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement