
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ ఐటీరంగ కంపెనీ టెక్ మహీంద్ర వరంగల్‌లో తమ కేంద్రాన్ని (టెక్ సెంటర్) ఏర్పాటు చేయనుంది. టెక్ మహీంద్ర కార్యకలాపాలు ప్రారంభించా లని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చేసిన విజ్ఞప్తికి కంపెనీ యాజమాన్యం సానుకూలంగా స్పందించింది. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా మంత్రి కేటీఆర్ గురువారం మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర, సీఈవో సీపీ గుర్నానీతో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం–మహీంద్ర సంస్థల మధ్య ఉన్న భాగసామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని మంత్రి కోరగా, వరంగల్‌లో టెక్ సెంటర్ ఏర్పాటు చేస్తానని ఆనంద్ హామీ ఇచ్చారు. తొలుత 500 మందితో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. వరంగల్‌లో ఉన్న అవకాశాలు, టాలెంట్ పూల్ వంటి అంశాల గురించి మంత్రి వివరించారు. టెక్ మహీంద్ర సంస్థ తీసుకున్న నిర్ణయం తెలంగాణలో రెండవ శ్రేణి నగరాలకు ఐటీ పరిశ్రమలను తీసుకెళ్లడంలో ప్రేరకంగా పనిచేస్తుందని, ఇందుకు గాను ఆనంద్ మహీంద్ర, సీపీ గుర్నానిలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును ఆనంద్ మహీంద్ర కలుస్తారని మంత్రి కేటీఆర్ తెలిపారు.
పెట్టుబడులకు ఆహ్వానం
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పలువురు ప్రముఖులు, వివిధ కంపెనీల ప్రతినిధు లను కలిశారు. ఎయిరో స్పేస్ దిగ్గజం లాక్ హీడ్ మార్టిన్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు రిచర్డ్ అంబ్రోస్‌తో సమావేశమయ్యారు. సంçస్థ ఇప్పటికే హైదరాబాద్ నగరంలో కార్యకలాపాలు సాగిస్తోందని, స్పేస్ విభాగంలో పెట్టుబడులు పెట్టేందుకు హైదరాబాద్ అనుకూలంగా ఉందని వివరించారు. ఎయిరో స్పేస్ పార్కులు, మార్స్ ఆర్బిటర్ ప్రయోగంలో హైదరాబాద్‌లోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల భాగస్వామ్యాన్ని తెలిపారు. బల్గేరియా టూరిజం మంత్రి నికోలినా అంగేల్ కోవాతో సమావేశమై ఇరు ప్రాంతాల మధ్య స్టార్టప్, పరిశోధనలు, పర్యాటక రంగాల్లో పరస్పర సహకారంపై చర్చించారు. ట్రినా సోలార్ ఉపాధ్యక్షురాలు రొంగ్ ఫాంగ్‌యిన్, ఫిలిప్స్ సంస్థ ప్రతినిధులు, అబ్రాజ్ గ్రూప్ మేనేజింగ్ పార్టనర్ కీటో డి బోయర్‌తో పాటు పలు కంపెనీ ప్రతినిధులతో కేటీఆర్ సమావేశమయ్యారు. టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, బజాజ్ గ్రూప్ చైర్మన్ రాహుల్ బజాజ్, హీరో మోటో కార్ప్ సీఈవో పవన్ ముంజాల్, ఉదయ్ కోటక్, వెల్‌స్పన్ గ్రూప్ చైర్మన్ బీకే గోయెంకా, కేంద్ర మంత్రి ధరేంద్ర ప్రధాన్‌ను దావోస్‌లో మంత్రి కేటీఆర్ కలిశారు.
పారిశ్రామికవేత్తలతో భేటీ
దావోస్‌లో మూడో రోజు పలు కంపెనీలతో మంత్రి కేటీఆర్ సమావేశమై చర్చలు జరిపారు. సీఏ సంస్థ గ్లోబల్ సీఈవో మైక్ గ్రెగోరీతో కేటీఆర్ సమావేశమయ్యారు. కంపెనీ విస్తరణ చర్యల్లో హైదరాబాద్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో తమ కంపెనీ కార్యకలాపాలు కొనసాగిస్తోందని, కంపెనీ వృద్ధిపట్ల పూర్తి సంతృప్తికరంగా ఉన్నట్లు గ్రెగోరీ తెలిపారు. ట్రాఫిక్, ఎయిర్‌పోర్ట్ అనుసంధానం, చవకైన మౌలిక వసతులున్నాయని హైదరాబాద్‌పై ప్రశంసలు కురిపించారు. అనంతరం ఫైజ ర్ వ్యాక్సిన్ అధ్యక్షురాలు సుసాన్ సిలబెర్మన్‌తో కేటీఆర్ సమావేశమయ్యారు. హైదరాబాద్ ప్రపంచ వ్యాక్సినేషన్ మ్యానుఫాక్చరింగ్ హబ్బులలో ఒకటిగా ఉందని, దాదాపు 25% ప్రపంచ వ్యాక్సిన్లు ఇక్కడే తయారవుతున్నాయని మంత్రి తెలి పారు. జీనోమ్ వ్యాలీ, ప్రభుత్వం ఏర్పా టు చేయనున్న ఫార్మాసిటీ గురించి వివరించారు. ఫైజర్ వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment