ఇది ఆరంభం మాత్రమే | KTR Launched Tech Mahindra And Cyient Campuses At Manikonda | Sakshi
Sakshi News home page

ఇది ఆరంభం మాత్రమే

Published Wed, Jan 8 2020 1:21 AM | Last Updated on Wed, Jan 8 2020 1:29 AM

KTR Launched Tech Mahindra And Cyient Campuses At Manikonda - Sakshi

సైయంట్‌ కంపెనీ శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రులు కేటీఆర్, దయాకర్‌రావు, ఈటల రాజేందర్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే రాజయ్య, కంపెనీ చైర్మన్‌ మోహన్‌రెడ్డి తదితరులు

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: ‘ ఐటీరంగం విస్తరణలో తెలంగాణ దేశానికి దిక్సూచిగా మారుతోంది. వరంగల్‌లో టెక్‌ మహీంద్రా, సైయంట్‌ ఐటీ ఇంక్యుబేషన్‌ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఇది ఆరంభం మాత్రమే. ఈ రెండు కంపెనీలు రావడంతోనే సంతృప్తి చెందట్లేదు. హైదరాబాద్‌ తర్వాత అంతటి పెద్ద నగరం వరంగల్‌. ఇంకా చాలా కంపెనీలు రావాలి. వేలాది మందికి ఉద్యోగాలు లభించాలి. వరంగల్‌కు తొలుత ఒక్క సైయంట్‌ కంపెనీ వచ్చింది. ఆ తర్వాత టెక్‌ మహీంద్రా వచ్చింది. ఒక దాని తర్వాత మరో కంపెనీ వస్తుంది.

హైదరాబాద్, వరంగల్‌ కాదు.. కరీంనగర్, నిజామాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మంతో పాటు దశల వారీగా అన్ని ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటీ రంగాన్ని విస్తరిస్తాం. దీంతో స్థానిక యువతకు ఉద్యోగాలు లభించాలన్నదే సీఎం కేసీఆర్‌ కల. ఈ కల సాకారం కానుంది’అని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా మడికొండలోని ఐటీ సెజ్‌లో ఏర్పాటు చేసిన టెక్‌ మహీం ద్రా, సైయంట్‌ ఐటీ ఇంక్యుబేషన్‌ సెంట ర్లను కేటీఆర్‌ మంగళవారం ప్రారంభించారు. అభివృద్ధి, సంక్షేమ రంగంలో రాష్ట్రం దేశానికి మార్గదర్శకంగా ఉందని.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.

మడికొండలోని ఐటీ సెజ్‌లో టెక్‌ మహీంద్రా కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న సీఈఓ గురునాని, మంత్రి కేటీఆర్‌ 

పారిశ్రామిక కారిడార్‌..
‘రెండేళ్ల కిందట ఆనంద్‌ మహీంద్రా, బీవీఆర్‌ మోహన్‌రెడ్డిని కలిసి వరంగల్‌లో కంపెనీ పెట్టాలని కోరాం. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వారు కంపెనీలు పెట్టారు. ఐటీ తెలం గాణ జిల్లాల కు విస్తరించడం వరంగల్‌ నుంచి ప్రారంభమైంది. టెక్‌ మహీంద్రా, సైయంట్‌ కంపెనీ ల ఏర్పాటు ద్వారా హైదరాబాద్‌ కాకుండా తెలంగాణ జిల్లాల్లో శ్రీకారం జరిగింది. ఈ కంపెనీల ద్వారా వరంగల్‌లో 10 వేల మందికి ఉపాధి కల్పించాలి’అని కేటీఆర్‌ కోరారు. హైదరాబాద్‌–వరంగల్‌ మార్గం పారిశ్రామిక కారిడార్‌గా మారబోతోందని స్పష్టం చేశారు.

ఆలేరు, భువనగిరి, జనగామ ప్రాంతాల్లో కూడా పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు. మహబూబాబాద్‌లో ఆహారశుద్ధి ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఐటీ, వ్యాపార, పరిశ్రమల వరంగల్‌ ప్రాంతాలను మరింత విస్తరించేందుకు మామునూరు ఎయిర్‌పోర్టును తిరిగి ప్రారంభించే ప్రయత్నం చేస్తామన్నారు.  జీఎంఆర్‌ సంస్థనే ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయాలని కోరుతున్నట్లు వివరించారు. ఈ దిశగా సీఎం కేసీఆర్‌ చర్చలు జరుపుతున్నారని, సానుకూలంగా స్పందించే అవకాశముందన్నారు. అప్పటి వరకు హెలీపోర్ట్‌ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఆలోచన చేస్తున్నామన్నారు.

మరో హరిత విప్లవం..
రాష్ట్రంలో త్వరలోనే రెండో హరిత విప్లవం రాబోతుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. సాగు, తాగు నీటి విషయంలో సీఎం కేసీఆర్‌ విజన్‌ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ నిర్మూలనకు విప్లవాత్మకమైన మార్పులతో టీఎస్‌ ఐపాస్‌ ద్వారా పెట్టుబడులకు రెడ్‌ కార్పెట్‌ పరుస్తున్నట్లు గుర్తుచేశారు. ప్రభుత్వ పథకాలు యజ్ఞంలా కొనసాగుతున్నాయని, కేసీఆర్‌ కలల ప్రాజెక్టు కాళేశ్వరాన్ని కాలంతో పోటీ పడి నిర్మించుకుంటున్నట్లు చెప్పారు. ప్రాజెక్టుల ద్వారా తెలంగాణలో 1.25 కోట్ల ఎకరాల భూమి సాగులోకి రానుందని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించడంపై దృష్టి పెట్టామని, ఇప్పటికీ 12 వేల పరిశ్రమలకు అనుమతులిచ్చామని, తద్వారా రూ.1.75 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా, 13 లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి కల్పించామని వివరించారు.

కొరియాకు చెందిన యంగ్‌టక్‌ కంపెనీ 8 ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిందని తెలిపారు. మరో 18 సంస్థలు టెక్స్‌టైల్స్‌ పార్కులో కంపెనీలు ఏర్పాటు చేసేందుకు వస్తున్నాయని తెలిపారు.  కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఈటల రాజేందర్, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్‌ విప్‌లు దాస్యం వినయ్‌భాస్కర్, బోడకుంటి వెంకటేశ్వర్లు, సైయంట్‌ వ్యవస్థాపకుడు బీవీఆర్‌ మోహన్‌రెడ్డి, టెక్‌ మహీంద్రా సీఈవో సీపీ గుర్‌ నాని, ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, ఎంపీలు బండ ప్రకాశ్, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ పోచం పల్లి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement