కూలి పనులకు వెళ్తేనే పూట గడిచే ఆ నిరుపేద కుటుంబాన్ని విధి వెంటాడింది. కుటుంబంలో అందరికీ సపర్యలు చేసే ఇల్లాలికి మాయదారి జబ్బు వచ్చింది. ఒకటి కాదు..రెండు కాదు.. ఏకంగా ఆరేళ్లపాటు అంతుచిక్కని వ్యాధితో ఆమె విలవిల్లాడుతోంది. రోజంతా కష్టపడి సంపాదించిన కూలి డబ్బులు భార్యకు మందులు, పిల్లల చదువులకు సరిపోక ఆ కుటుంబం పడే వేదన అంతాఇంతా కాదు. మహబూబాబాద్ జిల్లా కేసముంద్రం మండలంలోని అమీనాపురానికి చెందిన రమ కన్నీటి గాథ ఇదీ.. – కేసముద్రం
గ్రామానికి చెందిన మట్టె ఉపేందర్, రమకు 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు కుమారుడు వినయ్, కుమార్తె శిరీష ఉన్నారు. భార్యాభర్తలిద్దరూ కూలి పనికి వెళ్తూ పిల్లల్ని చదివిస్తున్నారు. సాఫీగా సాగుతున్న వారి కుటుంబాన్ని మాయదారి జబ్బు శాపంగా పరిణమించింది. రమ అనారోగ్యానికి గురికాగా, ఆమెను ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మందులు వాడినా ఫలితం లేకపోయింది.
చికిత్స కోసం పలుమార్లు ఆస్పత్రులను ఆశ్రయించారు. అప్పటికే చేతిలో ఉన్న డబ్బులతోపాటు, అప్పులు చేసి వైద్యం కోసం ఖర్చుపెట్టారు. ఇప్పటివరకు సుమారు రూ.2లక్షల వరకు డబ్బులను వెచ్చించినప్పటికీ జబ్బు ఏమాత్రం కుదుట పడలేదు. పైగా వ్యాధి తగ్గకపోగా రెండు కాళ్లు చచ్చుబడడంతో నడవలేని పరిస్థితితో రమ మంచం పట్టింది. క్రమక్రమంగా ఆమె ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. కొంత మంది వైద్యులు బోన్ టీబీ అని పేర్కొనగా, మరికొందరు ఆ వ్యాధి గురించి స్పష్టంగా చెప్పలేకపోతున్నట్లు బాధితులు తెలిపారు.
చివరకు హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లగా స్కానింగ్ తీసి, మం దులు ఇచ్చారు. జబ్బు ముదిరిందని మందు లు వాడాలని చెప్పడంతో ఇంటికి చేరుకున్నా రు. ఇలా ఆరేళ్లుగా ఇంట్లోనే రమ మంచానికే పరిమితమైంది. భర్త ఉపేందర్ రమకు అన్ని విధాలుగా సపర్యలు చేస్తూ, కుమారుడిని ఇంటర్మీడియట్, కూతురిని కేసముద్రంస్టేషన్ జెడ్పీఎస్‌ఎస్‌లో ఎనిమిదో తరగతి చదివిస్తున్నాడు.
ఉపేందర్ మండల కేంద్రంలోని ఇనుప సామగ్రి కొట్టులో పనిచేస్తూ.. ప్రతిరోజు వచ్చే రూ.180 కూలి డబ్బు లతో కుటుంబసభ్యులను పోషిస్తున్నాడు. చేతిలో డబ్బులు లేకపోవడంతో దగ్గరలోని ఆస్పత్రుల్లో ఇచ్చే మందులు వాడుతున్నారు. పేదరికంలో మగ్గుతున్న ఆ కుటుంబానికి వచ్చిన కష్టాన్ని చూస్తే.. అందరి హృదయాలు బరువెక్కక మానవు. ఇక ప్రతిరోజు ఆ ఇల్లాలు పడే నరకయాతన చూసి.. కుటుంబ సభ్యులు కన్నీళ్లను దిగమింగుకుంటూ జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. మనసున్న దాతలు ఎవరైనా తమ కుటుంబాన్ని ఆదుకోవాలని ఉ పేందర్, కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment