సాక్షి ప్రతినిధి, ఏలూరు : ముక్కనుమ రోజు కూడా జిల్లాలో చాలాచోట్ల కోడిపందేలను నిర్వహించారు. అయితే పోలీసుల దాడులతో బుధవారం మధ్యాహ్నానికి పందేలు ఆగాయి. దెందులూరు ఎమ్మెల్యే నిర్వహిస్తున్న కొప్పాక కోడిపందేల బరిపై పోలీసులు దాడి చేసి నిలిపివేశారు. ఎప్పుడూ వారం రోజులకు పైగా ఈ బరిలో పందేలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ మూడు రోజుల్లో కూడా జిల్లాలో అతి పెద్ద పందేలు నిర్వహించిన బరిగా కొప్పాక పేరు పొందింది. అక్కడికి పోలీసులను కాని, మీడియాని కాని అనుమతించకుండా తన సొంత సైన్యంతో చింతమనేని కోడిపందేలు నిర్వహిస్తూ వచ్చారు. ఎట్టకేలకు పోలీసులు ఆ బరివైపు తొంగిచూడటం పట్ల జిల్లాలో హర్షం వ్యక్తం అయింది.
ఎవరిని అరెస్టు చేయకపోయినా చింతమనేని వేస్తున్న పందేలు ఆపే తెగువ పోలీసుల నుంచి రావడం మంచి పరిణామంగా ప్రజలు భావిస్తున్నారు. కొన్ని చోట్ల ముక్కనుమ అయిన బుధవారం కూడా పందాలు వేసేందుకు కొందరు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ సీహెచ్.మురళీకృష్ణ కామవరపుకోట మండలంలోని కోడిపందాల బరులను పరిశీలించారు. మండలంలోని రావికంపాడు, కామవరపుకోట, కొల్లివారిగూడెం తదితర కోడిపందేల బరుల వద్ద పోలీసుల పహారా ఏర్పాటు చేశారు. టి.నరసాపురం మండలంలో బండివారిగూడెం, అల్లంచర్ల రాజుపాలెం గ్రామాల్లో కోడిపందేలపై టి.నరసాపురం పోలీసులు బుధవారం దాడులు నిర్వహించి 9 మందిని అరెస్టు చేశారు.
నిడమర్రు మండలంలో పోలీసులు కోడిపందేల శిబిరాల వద్దకు వెళ్లి జరుగుతున్న పందాలను నిలిపివేసి, టెంట్లు పీకేసారు. పత్తేపురం, బువ్వనపల్లి, సిద్దాపురం, బావాయిపాలెం, తోకలపల్లి తదితర గ్రామాల్లో ఉదయం 9 నుండి 11 గంటలల్లోపు వరకూ పందేలు కొనసాగినా ఆ తర్వాత పోలీసులు రావడంతో ఆయా శిబిరాల్లో పందేలు నిలిచిపోయాయి. పాలకొల్లు మండలంలో శివదేవునిచిక్కాల, వాలమర్రు, లంకలకోడేరు గ్రామాల్లో పందేల శిబిరాలపై దాడులు చేసి 14మందిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు రెవెన్యూ అధికారులు కోడి పందేల కట్టడిలో హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయలేకపోయిన విషయంపై ఆరా తీస్తున్నారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం వీఆర్వోలు, గ్రామకార్యదర్శులతో తహసీల్దార్లు సమావేశం నిర్వహించి వారి నుంచి లిఖితపూర్వకంగా స్టేట్‌మెంట్లు స్వీకరించారు. 144 సెక్షన్ అమలుకు పోలీసు శాఖ తమకు సహకరించలేదని ఎక్కువ మంది తమ నివేదికల్లో పేర్కొన్నట్లు సమాచారం. ఏ ఏ బరుల వద్ద నుంచి పోలీసులు, ఎక్సైజ్ అధికారులు ఎంతెంత మామూళ్లు వసూలు చేశారన్న విషయాలను కూడా తమ నివేదికల్లో పొందుపరుస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment