దక్షిణ కొరియాలో ‘రహస్య కెమెరాలతో చిత్రీకరణ’ సమస్య తీవ్రరూపం దాల్చింది. బీచులు, స్విమ్మింగ్‌పూల్‌లే కాకుండా పార్కులు ఇతర బహిరంగప్రదేశాల్లోనూ ఇలాంటి చిత్రీకరణలు పెరిగిపోయి వ్యక్తిగత గోప్యతకు ఆటంకంగా మారుతున్నాయి. ఇది ఎంతవరకు వెళ్లిందంటే సీక్రెట్ కెమెరాలతో రికార్డ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ వేలాది మంది మహిళలు ’ నా జీవితం నీ అశ్లీల చిత్రం కాదు’ అనే ప్లకార్డులు చేపట్టి ఇటీవల వీధుల్లో నిరసనలు తెలిపే వరకు వెళ్లింది. ఇలాంటి వీడియోలు రికార్డ్ చేస్తున్న, వీక్షిస్తున్న వారిని కఠినంగా శిక్షించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. దక్షిణ కొరియాలో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఏడాదికి పైగా ‘మీ టూ ఉద్యమం’ సాగుతోంది. దీని ద్వారా మహిళలపై లైంగికదాడులు, వేధింపులకు పాల్పడిన అధికార డెమొక్రాటిక్ పార్టీ నేత యాన్ హి–జింగ్‌తో సహా పలువురు ప్రముఖులను సైతం ఎండగట్టగలిగారు. ఈ నేపథ్యంలోనే తమను రహస్య కెమెరాల్లో చిత్రీకరించడంపైనా మహిళలు గళమెత్తుతున్నారు.
పార్కులు, స్విమ్మింగ్‌పూల్‌లు, బీచుల్లోని రెస్ట్‌రూమ్‌లు, గదుల్లో దుస్తులు మార్చుకుంటున్న మహిళలను రహస్య కెమెరాల ద్వారా రికార్డ్ చేయడం ఇటీవల కాలంలో పెరిగిపోయింది. వీటిపై మహిళల నుంచి ఒక్కసారిగా ఫిర్యాదులు పెరిగిపోవడంతో పోలీస బృందాలు స్కానర్లతో రంగంలోకి దిగి బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడెక్కడ సీక్రెట్ కెమెరాలు ఉన్నాయన్న దానిని కనిపెట్టే చర్యలు చేపడుతున్నారు. అయితే చిన్న చిన్న కెమెరాలు ఎక్కడ పెట్టారనేది మాత్రం కనిపెట్టలేకపోతున్నారు. దేశవ్యాప్తంగా లెక్కకు మించి తనిఖీలు చేపడుతున్నా ఈ సమస్యకు చెక్ పెట్టలేకపోతున్నారు.
పెరుగుతున్న రహస్య కెమెరా బాధితులు
2012–16 మధ్యకాలంలో రహస్య చిత్రీకరణ బాధితులుæ 26 వేల మందికి పైగానే ఉన్నారని, వారిలో 80 శాతం మంది మహిళలేనని గుర్తించారు. తమను రికార్డ్ చేశారన్న సంగతి కూడా వారిలో చాలా మందికి తెలియదని పోలీసులు చెబుతున్నారు. వారు చెబుతున్న దాని కంటే కనీసం పదింతలు ఎక్కువగా బాధితుల సంఖ్య ఉండొచ్చునని సూన్‌చున్హ్ యాంగ్ వర్సిటీ క్రిమినాలజీ (నేరశాస్త్రం) ప్రొఫెసర్ ఓహ్ యూన్–సంగ్ పేర్కొన్నారు. ‘ఇది రోజువారి జీవితంలో భాగమై పోయింది. ఇలాంటి వాటికి పాల్పడిన వారిపై మరింత కఠినచర్యలు తీసుకోవాల్సి ఉంది’ అని ఆ దేశ అధ్యక్షుడు మూన్ జో–ఇన్ వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. 2011లో 1,354 మందిని పోలీసులు గుర్తించగా, 2017 వారి సంఖ్య 5,363 మందికి పెరిగింది. సులభంగా స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉండడంతో పాటు సోషల్ మీడియా వ్యాప్తి కూడా ఈ నేరానికి దోహదపడుతోంది.
అధికారులకు సవాలే...
బేస్‌బాల్ టోపి, బెల్టు, గడియారం, లైటర్, యూఎస్‌బీ పరికరం, చొక్కాపై ధరించే టై, కారుతాళాలు, పాదరక్షలు ఇలా ప్రతి వస్తువుపై అతిచిన్న రహస్య కెమెరాలు అమరుస్తున్నారు. మాల్‌లు, షాపింగ్‌సెంటర్‌లు, బీచులు, స్విమ్మింగ్ పూల్‌లలోని దుస్తులు మార్చుకునే గదుల్లో డోర్‌లాకర్లు, ఫ్రేమ్‌లు, స్నానపు గదుల్లోని షవర్లు, టాయ్‌లెట్లలో ఎక్కడబడితే అక్కడ వీటిని పెట్టి దృశ్యాలు రికార్డ్ చేస్తున్నారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీన్ని అదుపుచేయడంతో పాటు ఆన్‌లైన్, ఇతర వెబ్ కంటెంట్‌లో ఇలాంటి అక్రమ రికార్డింగ్‌లు పెట్టకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.
కెమెరా హార్డ్‌వేర్ అమ్మకాలపై నిఘాతో పాటు రహస్య చిత్రీకరణలు పెద్ద నేరమనే అంశానికి ప్రచారం కల్పిస్తున్నారు. అంతేకాకుండా బహిరంగప్రదేశాల్లో ఏయే రూపాల్లో అతిచిన్న కెమెరాల ద్వారా రికార్డింగ్‌కు వీలుందో అవగాహన కల్పిస్తున్నారు. రహస్య రికార్డింగ్‌లకు పాల్పడిన వారికి అయిదేళ్ల శిక్ష లేదా రూ.6.2 లక్షల జరిమానా విధిస్తున్నారని, ఇంతకంటే కఠినమైన శిక్షలుండాలని కొరియా మహిళా న్యాయవాదుల సంఘం నేత కిమ్ యంగ్–మి డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసుల్లో పట్టుబడిన వారిలో 5.3 శాతం మాత్రమే జైలుకు వెళ్లినట్టుగా అయిదేళ్ల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
సీక్రెట్ కెమెరాలపై సమరం
Published Wed, Aug 1 2018 10:06 PM | Last Updated on Thu, Aug 2 2018 8:58 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment