ప్రతీకాత్మక చిత్రం
చాలా మందికి తమ జీవితంలో పెళ్లి రోజులు చాలా మధురమైనవి. పెళ్లి జ్ఞాపకాలను ఫోటోల రూపంలో బంధించుకొని జీవితాంతం దాచుకుంటారు. ఇలాగే తాను కూడా దాచుకోవాలని, భర్తతో కలసి ఉండాలని కలలు కనింది. కానీ పెళ్లి రోజు రాత్రి వచ్చిన కొన్ని మెసేజ్‌లు ఆమె జీవితాన్నే మార్చేశాయి. చివరకు పెళ్లిలో తోడుగా ఉంటానన్న ప్రామిస్ బదులు, ఆ మెసేజ్‌లు చదివి పెళ్లిని ఆపేసింది. ఆస్ట్రేలియాలో ఈ ఉదంతం వెలుగు చూసింది.
మియా (పేరు మార్చాం) తాను ఆరేళ్లుగా ప్రేమిస్తున్న అలెక్స్‌ను (పేరు మార్చాం) పెళ్లి చేసుకోవడానికి సర్వం సిద్ధం చేసుకుంది. తెల్లవారితే పెళ్లి అనగా, ముందు రోజు రాత్రి గుర్తు తెలియని నంబర్ నుంచి కొన్ని మెసేజ్‌లు వచ్చాయి.
అది తెరచి చూస్తే, నేనతన్ని పెళ్లి చేసుకోను.. నువ్వు చేసుకుంటావా ? అనే మెసేజ్‌తో పాటు కొన్ని స్క్రీన్‌షాట్లు ఉన్నాయి. ఆ స్క్రీన్‌షాట్లలో తనకు కాబోయే భర్త మరెవరో ఓ అమ్మాయితో చేసిన చాటింగ్ ఉంది. అందులో కొద్ది నెలల నుంచి గత కొద్ది రోజుల వరకు జరిగిన చాటింగ్ ఉంది.
తనకు కాబోయే భర్త మరొకరితో సన్నిహితంగా ఉండడం, సెక్సీగా ఉన్నావంటూ చేసిన ఆ చాట్ మియాను కుంగదీసింది. అతన్ని నమ్మినందుకు సిగ్గు పడుతూ, మోసపోయినందుకు కన్నీళ్ల పర్యంతమైంది. తెల్లవారితే జరిగే పెళ్లిని ఆపేయాలని నిశ్చయించుకుంది.
మరుసటి రోజు ఉదయం తాను ఎంతగానో కలలుగన్న పెళ్లి గౌనును ధరించి చర్చిలోకి వచ్చింది. చర్చి అంతా బంధువులతో, స్నేహితులతో నిండిపోయి ఉంది.
నేను ఈ పెళ్లి చేసుకోవడం లేదు. అని బిగ్గరగా చెప్పింది. హాజరైన వారంతా ఏం జరిగిందా అని సైలెంట్ అయిపోయారు. రాత్రి వచ్చిన మెసేజ్‌లను అందరిముందు చదవడానికి సిధ్ధమైంది. అలెక్స్ ముందుకు వచ్చి ఆమె చేతులను పట్టుకున్నాడు. అయినా మియా చెప్పడానికే నిశ్చయించుకుంది.
రాత్రి తనకు వచ్చిన మెసేజ్‌లు అన్నీ ఒక్కొక్కటిగా చదవడం ప్రారంభించింది. చదువుతూ ఉంటే అలెక్స్ ముఖంలో రంగులు మారసాగాయి. తప్పు చేసిన భావన అతడి ముఖంలో స్పష్టంగా కనబడింది.
తర్వాత అక్కడికి వచ్చిన అతిథులందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘వచ్చినందుకు మీకందరికి కృతజ్ఞతలు. ఇవాళ పెళ్లి వేడుకలు లేవు. నిజాయితీ, నిజమైన ప్రేమ గెలిచినందుకు వేడుకలు చేసుకుందాం. బాధ కలిగినప్పటికీ మనసు చెప్పినట్టు నడుచుకున్నాన’ని పేర్కొంది.
ఇది విన్న వారంతా చప్పట్లు కొడుతూ ఆమెను అభినందించారు. ‘నా పెళ్లి రోజు గురించి ఎన్నో కలలు కన్నానని కానీ ఇలా జరిగిపోయిందని’ చెబుతూ ఆమె ముగించారు.
Comments
Please login to add a commentAdd a comment