పెళ్లి పేరిట భారీ మోసం
- బాగ్దాద్ డాక్టర్‌నంటూ నగర యువతిని నమ్మబలికిన వైనం
- 10 బ్యాంకు ఖాతాల ద్వారా రూ.34.5 లక్షలు స్వాహా
- సొమ్ము డిపాజిట్ చేసిన ఖాతాలు గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: పెళ్లి పేరిట భారీ మోసం జరిగింది. హైదరాబాద్‌లో మాట్రిమోనియల్ మోసం వెలుగులోకి వచ్చింది. బాగ్దాద్‌లో ప్రముఖ డాక్టర్‌నంటూ ఓ సైబర్ నేరగాడు ఓ మహిళా లెక్చరర్‌కు ఎరవేశాడు. ‘ఖరీదైన పార్శిల్’ పేరు చెప్పి రూ.34.5 లక్షలు దండుకున్నాడు. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ యువతి హైదరాబాద్‌లో స్థిరపడింది. బేగంపేటలోని ఓ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తోంది. ఈమె ఈ ఏడాది ప్రథమార్థంలో ఓ మాట్రిమోనియల్ సైట్‌లో పేరు రిజిస్టర్ చేసుకున్నారు. ఈ ప్రొఫైల్‌ను లైక్ చేసిన ఓ వ్యక్తి ఆన్‌లైన్ చాటింగ్ ద్వారా సంప్రదింపులు ప్రారంభించాడు. తాను బాగ్దాద్‌లో ప్రముఖ వైద్యుడినంటూ పరిచయం చేసుకున్నాడు. కొన్నాళ్లపాటు యువతికి అనుకూలంగా చర్చలు సాగించాడు. వివాహానికి సమ్మతమంటూ సందేశం ఇచ్చాడు.
ఆస్పత్రి నిర్మాణం పేరిట...
తాను బాగ్దాద్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే హైదరాబాద్‌లో భారీ ఆస్పత్రి నిర్మాణం చేపడతానని, అందుకు అవసరమైన నిధులు తన వద్ద ఉన్నాయని ఆమెతో నమ్మబలికాడు. తాను రావడానికి ముందే డబ్బును వజ్రాలు, బంగారం రూపంలోకి మార్చి ఎయిర్ కార్గో పార్శిల్ రూపంలో పంపిస్తున్నానంటూ నమ్మబలికాడు. ఈ ఏడాది మార్చిలో ఓ రోజు ఆ పార్శిల్‌ను పంపానంటూ సందేశం ఇచ్చాడు. అనంతరం రెండు, మూడు రోజులకు ముంబై నుంచి కస్టమ్స్ అధికారి పేరిట బాధితురాలికి ఓ ఫోన్ వచ్చింది. బాగ్దాద్ నుంచి భారీ పార్శిల్ వచ్చిందని, దాన్ని క్లియర్ చేయడానికి పన్ను రూపంలో కొంత చెల్లించాలని ఆమెకు చెప్పారు. దీంతో వారిచ్చిన ఓ బ్యాంకు ఖాతాలో ఆమె నగదు డిపాజిట్ చేసింది. ఇలా దాదాపు మూడు నెలలపాటు వివిధ నంబర్ల నుంచి అనేక విభాగాల పేర్లతో ఫోన్లు రావడం, బాధితురాలు వారు చెప్పిన బ్యాంకు ఖాతాల్లో నగదు డిపాజిట్ చేయడం జరిగింది.
మొత్తం మీద పది బ్యాంకు ఖాతాల్లో రూ.34.5 లక్షలు డిపాజిట్ చేసింది. ఆ తర్వాత తాను మోసపోయానని గ్రహించి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సాంకేతిక ఆధారాలను బట్టి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితురాలు నగదు డిపాజిట్ చేసిన పది బ్యాంకు ఖాతాలు గుజరాత్, ఢిల్లీతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నట్లు గుర్తించారు. నిందితుల్ని గుర్తించడానికి లోతుగా దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. వివిధ మాట్రిమోనియల్ సైట్స్‌లో ఉన్న వ్యక్తుల ప్రొఫైల్స్‌ను చూసిన వెంటనే నమ్మవద్దనీ, ఎవరినీ నేరుగా కలవకుండా, పూర్వాపరాలు పరిశీలించకుండా వ్యక్తిగత వివరాలు చెప్పడం, నగదు డిపాజిట్ చేయడం, ఆర్థిక లావాదేవీలు వద్దని స్పష్టం చేస్తున్నారు.