జనవడుగూరు | ys jagan mohan reddy rythu bharosa yathra | Sakshi
Sakshi News home page

జనవడుగూరు

Published Thu, Jun 2 2016 3:36 AM | Last Updated on Mon, Oct 1 2018 3:57 PM

జనవడుగూరు - Sakshi

జనవడుగూరు

పెద్దవడుగూరు జనసంద్రమైంది. తమ అభిమాననేతను చూసేందుకు తాడిపత్రి నియోజకవర్గ ప్రజలు.....

తాడిపత్రి నియోజకవర్గంలో మొదలైన ఐదోవిడత
రైతు భరోసా యాత్ర పెద్దవడుగూరుకు భారీగా
తరలివచ్చిన రైతులు, మహిళలు  రైతులు, డ్వాక్రా మహిళల
సమస్యలపై వైఎస్ జగన్ ముఖాముఖి
ప్రతిపల్లెలోనూజగన్‌పై పూలవర్షం  
తొలిరోజు నాలుగు కుటుంబాలకు భరోసా

 
 
(సాక్షిప్రతినిధి, అనంతపురం) పెద్దవడుగూరు జనసంద్రమైంది. తమ అభిమాననేతను చూసేందుకు తాడిపత్రి నియోజకవర్గ ప్రజలు భారీగా తరలివచ్చారు. పెద్దవడుగూరుతో పాటు జగన్‌యాత్ర సాగిన ప్రతీపల్లెలోనూ మహిళలు అభిమానహారతి పట్టారు. నుదుట విజయతిలకం దిద్దారు. యువకులు పూలవర్షం కురిపించారు. పల్లె    ప్రజల అభిమానానికి జగన్ కూడా తడిసిముద్దయ్యారు.


అప్పులబాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించి వారి కుటుంబాల్లో భరోసా నింపేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత, విపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన రైతుభరోసాయాత్రలో భాగంగా ఐదో విడతయాత్ర బుధవారం మొదలైంది. హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గం ద్వారా జగన్ మధ్యాహ్నం 12.10 గంటలకు అనంత, కర్నూలు జిల్లా సరిహద్దులోని బాట సుంకులమ్మ దేవస్థానం సమీపానికి చేరుకున్నారు. అక్కడ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కాపు రామచంద్రారెడ్డి, బి.గురునాథరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్తలు వీఆర్‌రామిరెడ్డి, రమేశ్‌రెడ్డి, వై.వెంకట్రామిరెడ్డి క్రమశిక్షణ కమిటీ సంఘం సభ్యుడు ఎర్రిస్వామిరెడ్డిలు పుష్పగుచ్ఛాలు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి మిడుతూరు మీదుగా పెద్దవడుగూరు చేరుకున్నారు.

పెద్దవడుగూరులో డప్పువాయిస్తూ, పూలవర్షం కురిపించారు. ఇక్కడ రచ్చబండ వద్ద రైతులు, డ్వాక్రా మహిళల సమస్యలపై ముఖాముఖి నిర్వహించారు. చంద్రబాబు ప్రభుత్వం వల్ల తామెలా నష్టపోయామో రైతులు, మహిళలు జగన్‌తో ఏకరువు పెట్టారు. మరోసారి చంద్రబాబు ప్రభుత్వానికి ఓటేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. తర్వాత దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి చిన్నవడుగూరు చేరుకున్నారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న నాగసంజీవప్ప కుటుంబాన్ని పరామర్శించి భరోసా కల్పించారు. అక్కడి నుంచి దిమ్మగుడి చేరుకున్నారు. అక్కడ జగన్‌పై పూలవర్షం కురిపించారు. బ్యాండ్, డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికారు. మహిళలు దిష్టితీసి హారతి పట్టారు.

అక్కడ ఆత్మహత్య చేసుకున్న రైతు నాగార్జునరెడ్డి కుటుంబానికి భరోసా కల్పించారు. అక్కడి నుంచి కండ్లగూడూరు చేరుకున్నారు. గ్రామస్తులు రోడ్డుపై జగన్‌కోసం వేచి ఉన్నారు. ఈ గ్రామం దాటేందుకు జగన్‌కు 1.30 గంటల సమయం పట్టింది. రైతులు, మహిళలు, వృద్ధులు జగన్ కోసం గంటల తరబడి వేచి ఉన్నారు. ప్రతి ఒక్కరినీ జగన్ ఆప్యాయంగా పలకరించారు. ‘బాగున్నావా అవ్వా...పేరేంటి?’ అని పలకరించారు. జగన్ ఆప్యాయతను చూసి వృద్ధులు, మహిళలు పట్టరాని సంతోషంతో ఆనందబాష్పాలు రాల్చారు. అక్కడి నుంచి ఆయన చింతలచెరువు చేరుకున్నారు. అక్కడ కూడా దారిపొడవునా ఆయనపై పూలవర్షం కురిపించారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న వెంకటనారాయణరెడ్డి, జగదీశ్వరరెడ్డి కుటుంబాలను పరామర్శించి భరోసా కల్పించారు. తర్వాత అక్కడి నుంచి తెలికి చేరుకున్నారు. రాత్రి 9గంటల సమయంలో కూడా జగన్‌ను చూసేందుకు రైతులతో పాటు వృద్ధులు, మహిళలు రోడ్డుపై వేచి ఉన్నారు. అందరినీ ఆప్యాయంగా పలకరించారు.

అటు నుంచి మేడిమాకులపల్లి చేరుకుని జెడ్పీటీసీ సభ్యుడు చిదంబరరెడ్డి నివాసంలో రాత్రి బస చేశారు. మొదటిరోజు యాత్రలో నియోజకవర్గ సమన్వయ కర్తలు, నాయకులు తిప్పేస్వామి, ఆలూరు సాంబశివారెడ్డి, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, చవ్వా రాజశేఖరరెడ్డి, వీఆర్ వెంకటేశ్వరరెడ్డి, ఆలమూరు శ్రీనివాసరెడ్డి, బోయ సుశీలమ్మ, గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, మీసాలరంగన్న, నదీమ్ అహ్మద్, కొర్రపాడు హుస్సేన్‌పీరా, జయరాంనాయక్, రవీంద్రనాథరెడ్డి, విఘ్నేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
నేటి యాత్ర ఇలా..

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతు భరోసా యాత్ర  రెండో రోజు గురువారం పెద్దవడుగూరు మండలం మేడిమాకులపల్లి నుంచి మొదలవుతుంది. లక్షుంపల్లి, ముప్పాలగుత్తి, బుర్నాకుంట, కదరగుట్టపల్లి మీదుగా కిష్టిపాడు చేరుకుని, ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుడు నాగరాజు కుటుంబాన్ని పరామర్శిస్తారు. తర్వాత రాయలచెరువు మీదుగా నగరూరు చేరుకుంటారు. కోదండరాముడు, రామసుబ్బారెడ్డి కుటుంబాలకు భరోసా ఇస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement