
ఓటర్ల తుదిజాబితా విడుదలలో ప్రతిష్టంభన నెలకొంది. షెడ్యూల్ ప్రకారం శనివారం ఓటర్ల తుది జాబితా విడుదల కావాలి. కానీ ఈసీఐ రెండు తెలుగు రాష్ట్రాల్లో జాబితాలను విడుదల చేయలేదు. భారత ఎన్నిల సంఘం చరిత్రలో ఇలా జరగడం ఇదే ప్రథమమని అధికారులు అంటున్నారు. తుదిజాబితా లేకుండానే ఈనెల 25వ తేదీన ఎనిమిదవ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించనుండడం విచిత్రమైన పరిస్థితి.
కడప సెవెన్‌రోడ్స్ : 2017 సంవత్సరం నాటి ఓటర్ల తుది జాబితా ప్రకారం జిల్లాలో 18,41,000 మంది ఓటర్లు ఉన్నారు. 2018 జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాల వయస్సు పూర్తయ్యే వారిని ఓటర్లుగా నమోదుకు అవకాశం కల్పిస్తూ జాబితాల సవరణకు కేంద్ర ఎన్నికల కమిషన్ గతేడాది ద్వితీయార్థంలో షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, ఏఈఆర్‌ఓలు, బీఎల్‌ఓలు, ఇతర సిబ్బంది సమ్మరి రివిజన్ ప్రక్రియను చేపట్టారు. కడప నగరం మినహా మిగతా మున్సిపాలిటీల్లో ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్ట్రోరల్ రోల్స్ (ఐఆర్‌ఈఆర్) కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలో ప్రస్తుతం 2,576 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. కొత్తగా మరో 25కేంద్రాలు ఏర్పాటు చేయాలంటూ జిల్లా ఎన్నికల అధికారి నుంచి కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు వెళ్లాయి. అయితే ఈసీఐ నుంచి అనుమతి రానందువల్ల గత డిసెంబరు 15న విడుదల కావాల్సిన ఓటర్ల ముసాయిదా జాబితా ఆగిపోయింది. ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ను ఫ్రీజింగ్‌లో ఉంచారు. దీంతో గత సంవత్సరం తుది ఓటర్ల జాబితా విడుదల అనంతరం ఓటర్ల నమోదు, అభ్యంతరాలు, మార్పులు, చేర్పులకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. గత సంవత్సరం జనవరి నుంచి నేటివరకు జరిగిన ఐఆర్‌ఈఆర్, సప్లిమెన్స్ అన్నీ కలిపి తుది జాబితాగా ఫిబ్రవరిలో ఈసీఐ విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో కొత్తగా 40వేల ఓటర్లు పెరగనున్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు.
18 వేలమందికి ఓటరుకార్డులు
జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు వయస్సు పూర్తి చేసుకునే వారు తమను ఓటర్ల జాబితాల్లో నమోదు చేయాలని దరఖాస్తులు సమర్పించారు. వీరిలో 18వేల మందిని జాబితాల్లో నమోదు చేశారు. వీరికి ఈనెల 25వ తేదీ జరగనున్న జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఫొటో ఓటరు గుర్తింపుకార్డులను పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారులకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అందజేశారు. దీని ద్వారా మీ–సేవ కేంద్రంలో ఓటరు గుర్తింపుకార్డులను ముద్రించనున్నారు. అనంతరం గుర్తింపుకార్డులను అన్ని మండలాల తహసీల్దార్లకు ఈనెల 24వ తేదీలోపు పంపనున్నారు.
ఎన్‌వీడీ నిర్వహణకు సన్నాహాలు
జిల్లాకేంద్రంతో సహా నియోజకవర్గ, మండలకేంద్రాల్లో ఈనెల 25వ తేదీ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఈసీఐ నుంచి బ్యాడ్జీలు, ఓటర్ల ప్రతిజ్ఞకు సంబంధించిన కరపత్రాలు, ప్రశంసాపత్రాలు, బ్యానర్లు వచ్చాయి. 9వ తరగతి నుంచి ఇంటర్మీడియేట్ సెకండియర్ వరకు విద్యార్థులకు వక్తృత్వ, వ్యాచరచన పోటీలు శనివారం డీఈఓ నిర్వహించారు. కడప ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆ«ధ్వర్యంలో ఈనెల 22వ తేదీ డిగ్రీ విద్యార్థులకు పోటీలు నిర్వహించనున్నారు. జిల్లాస్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థులను ఈనెల 24వ తేదీ విజయవాడలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీలకు పంపించనున్నారు. ఎన్‌వీడీ రోజున జిల్లాలో గెలుపొందిన వారికి ప్రశంసాపత్రాలు అధికారులు పంపిణీ చేయనున్నారు. అలాగే సీనియర్ ఓటర్లను ఘనంగా సత్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment