చేనేతలతో కలసి భిక్షాటన చేస్తున్న ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి (ఫైల్)
ప్రొద్దుటూరు టౌన్ : ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి గాంధీ మార్గం ద్వారానే సమస్యను పరిష్కరించగలిగారు. 31 రోజుల ఆందోళన అనంతరం 77 మంది చేనేతలకు అధికారపార్టీ నేతల చేతుల మీదుగాప్రభుత్వం మంజూరు చేసిన పింఛన్లు ఇప్పించి వారి మన్ననలు పొందారు. ప్రభుత్వం చేనేత ఐడీ కార్డులు కలిగిన వారి నుంచి పింఛన్ల కోసం దరఖాస్తులను గత ఏడాది ఆహ్వానించింది. పట్టణంలోని 13 వార్డుల్లో ఉన్న 436 మంది దరఖాస్తు చేసుకున్నారు. జౌళిశాఖ ఏడీఓ విజయానంద్ ఇంటింటికి వెళ్లి వివరాలను సేకరించి ప్రభుత్వానికి పంపారు. వీరిలో ఐడీ కార్డులు ఉన్న 77 మందిని పింఛన్లకు అర్హులుగా తేల్చి నవంబర్‌లో మున్సిపాలిటీకి జాబితా పంపింది. డీఆర్‌డీ అధికారుల ఆదేశాల మేరకు 77 మంది వివరాలను జన్మభూమి కమిటీ సభ్యులు ఆయా వార్డుల కౌన్సిలర్ల సంతకాలు చేయించి క్లర్క్ మనోహర్ ఆన్‌లైన్‌లో పొందుపరిచారు.
అప్పటికంటే ముందు వచ్చిన వారి వివరాలను కమిషనర్‌కు తెలియజేశారు. ప్రభుత్వం 77 మందికి పింఛన్లు మంజూరు చేసి మొత్తాన్ని మున్సిపల్ ఖాతాలో జమ చేసింది. సిబ్బంది రెండు వార్డుల్లో నలుగురు చేనేతలకు పింఛన్ డబ్బు పంపిణీ చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి తన సంతకం లేకుండా ఎలా పింఛన్లు ఆన్‌లైన్‌లో పొందుపరిచారంటూ క్లర్క్ మనోహర్‌పై ఫిర్యాదు చేసి సస్పెండ్ చేయించారు. అనంతరం డీఆర్‌డీఏ అధికారులకు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి పింఛన్లను నిలిపివేశారు. దీంతో నవంబర్ నెల పింఛన్ ఆగిపోయింది. డిసెంబర్‌లో సొమ్ము మున్సిపల్ ఖాతాలో జమ కావడం, చేనేతలకు పింఛన్ ఇవ్వని విషయాన్ని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలుసుకుని కమిషనర్‌ను ప్రశ్నించారు. సరైన సమాధానం రాకపోవడంతో చేనేతలతో కలసి ఆందోళన చేపట్టారు.
మున్సిపల్ కార్యాలయంలో...
డిసెంబర్ 4, 5, 6 తేదీల్లో ఎమ్మెల్యే, చేనేత లబ్ధిదారులు మున్సిపల్ కార్యాలయంలో ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి ఆందోళన చేశారు. అధికారులు ఎవ్వరూ çస్పందించకపోవడంతో డిసెంబర్ 8న ప్రొద్దుటూరుకు వస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దృష్టికి సమస్యను తీసుకెళుతామని ఎంపీ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రకటించారు. దీంతో కలెక్టర్ బాబురావు నాయుడు స్పందించి రామచంద్రారెడ్డి చేత దీక్ష విరమింపచేయాలని డీఆర్‌డీఏ పీడీని పంపించారు. ఉపరాష్ట్రపతి వెళ్లిన మరుసటి రోజు 9వ తేదీ మున్సిపాలిటీకి చైర్మన్ ఫిర్యాదుపై విచారించి పింఛన్ పంపిణీ చేస్తామని పీడీ హామీ ఇచ్చారు. అదే రోజు విచారణ చేసిన పీడీ 77 మంది పింఛన్లకు అర్హులని తేల్చి కలెక్టర్‌కు నివేదిక ఇచ్చారు. అయినా వరదరాజులరెడ్డి పింఛన్ ఇవ్వొద్దని చెప్పడంతో అధికారులు ఇవ్వలేదు.
గత ఏడాది డిసెంబర్ 22న పుట్టపర్తి సర్కిల్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ఎమ్మెల్యే శాంతియుత మార్గంలో చేనేతలతో కలసి భిక్షాటన చేశారు. అయినా అధికారులు స్పందించలేదు. దీంతో డిసెంబర్ 28వ తేదీ నుంచి మున్సిపల్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేనేతలతో కలసి ఎమ్మెల్యే చేశారు. ఐదో తేదీ ఇవ్వకపోతే ఆరో తేదీ ఒక్కొక్కరికి రూ.500 చొప్పున ఆరు నెలల పింఛన్ ఇస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు. 7న అమరావతిలో సీఎం వెళ్లే రహదారిలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో జనవరి 4న 77 మంది చేనేతలకు మంత్రి ఆదినారాయణరెడ్డి, పింఛన్లను అడ్డుకున్న వరదరాజులరెడ్డి చేతుల మీదుగా పింఛన్లను ఇప్పించారు. శాంతి మార్గంలో ఎంతటి కష్టమైన సమస్యకైనా పరిష్కారం లభిస్తుందనేది ఈ సంఘటన నిదర్శనంగా నిలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment