రవాణాకు రాజయోగమే | RTC Merger government : YS JAGAN | Sakshi
Sakshi News home page

రవాణాకు రాజయోగమే

Published Tue, Jan 9 2018 12:23 PM | Last Updated on Wed, Jul 25 2018 5:02 PM

RTC Merger government : YS JAGAN - Sakshi

సాక్షి, కడప : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను పరిరక్షించడంలో ప్రభుత్వం అంతంత మాత్రంగానే కృషి చేస్తోంది. రాష్ట్రంతోపాటు జిల్లాలోని అనేక డిపోలు నష్టాల బాటలోపయనిస్తున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. చివరకు కార్మికుల  సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టిందా అంటే అది కూడా నామ మాత్రమేనని చెప్పక తప్పదు. ప్రతినిత్యం లక్షలాది మంది ప్రయాణం చేసే ఆర్టీసీ బస్సుల్లో డ్రైవర్లు, కండక్టర్లతోపాటు ఇతర ఉద్యోగులు పనిచేస్తున్నారు. అందరినీ సురక్షితంగా గమ్యస్థానం చేర్చే ఆర్టీసీ ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు కనిపించడం లేదు. ఆర్టీసీ సంస్థకు సంబంధించిన కార్పొరేషన్‌ను ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా సంస్థలో పనిచేస్తున్న అందరికీ  ప్రయోజనాలు ఒనగూరుతాయి. కానీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయకపోవడంతో పాదయాత్రలో ఉన్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కార్మికుల సమస్యలపై సమరశంఖం పూరించారు.  పార్టీ అధికారంలోకి వస్తే ఆర్టీసీని విలీనం చేస్తామని ప్రకటించారు.

30 ఏళ్ల వారికి రాని రూ. 5 వేల పింఛన్‌
 ఎన్నో ఏళ్లపాటు సంస్థను నమ్ముకుని...అంకితభావంతో పనిచేసినా పింఛన్ల విషయంలో అన్యాయం జరుగుతోంది. 30 ఏళ్లపాటు సర్వీసులో ఉండిన తర్వాత పదవీ విరమణ చేసిన వారికి కూడా రూ. 5 వేలు అందని పరిస్థితి నెలకొంది.  ఇన్నేళ్లు సంస్థకోసం, ప్రజల కోసం పనిచేసినా అనుకున్న మేర రాకపోవడంపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతకష్టపడినా చివరి మజిలీలో కూడా రావాల్సిన పింఛన్‌ అంతంత మాత్రం వస్తే వారి కష్టాలు దేవుడెరుగు.

నిబంధనలు సర్కారువీ..నష్టాలు ఆర్టీసీవీ....
 ఆర్టీసీ సంస్థకు సంబంధించి పలు విభాగాల వ్యవహారాలు ప్రభుత్వ అనుమతితోనే జరుగుతున్నా నష్టాలకు మాత్రం సంస్థ బాధ్యత వహించాల్సి వస్తోంది. వేతనాల సవరణ, నియామకాలు, ఛార్జీల పెంపు తదితర వాటి విషయంలో పెత్తనం చెలాయిస్తున్న ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి మాత్రం పెద్దపీట వేయలేదని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. అలాగే నష్టాల్లో ఉన్న  డిపోలను గట్టెక్కించే విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ చూపకపోవడాన్ని పలువురు ఎత్తి చూపుతున్నారు

ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఆర్టీసీలో వేతనాలు తక్కువ
 2015 మే నెలలో ఆర్టీసీ సంస్థకు సంబంధించిన ఉద్యోగులు జీతాలు సరిపోక సమ్మెకు దిగితే 43 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించారు.   ఫిట్‌మెంట్‌ ఇచ్చినా ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఆర్టీసీ కార్మికుల జీతాలు 60 శాతం తక్కువగా ఉన్నాయి. చంద్రబాబు కార్మిక సంస్థలను ఆదుకుంటామని ప్రకటించినా ఇప్పటివరకు అతీగతీ లేదు. పైగా ఆర్థిక మంత్రి నేతృత్వంలో ఉపసంఘం ఏర్పడినా కార్మికులకు మాత్రం న్యాయం జరగడం లేదు.అరకొర వేతనాలతోనే కార్మికులు కాలాన్ని వెళ్లదీస్తున్నారు.

అధికారంలోకి వస్తే ఆర్టీసీ విలీనం
 వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఆర్టీసీని విలీనం చేస్తామని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడంతో కార్మికులు సంబరాలు నిర్వహించుకుంటున్నారు.  పలు డిపోల పరిధిలో స్వీట్లు పంపిణీ చేశారు.  ఇబ్బందులు ఎదురైనా నెట్టుకొని వస్తున్న వీరి జీవితాల్లో విలీనంతోనే వెలుగు లభిస్తుందని వారు ఆశపడుతున్నారు. వైఎస్సార్‌ మజ్దూర్‌ యూనియన్‌తోపాటు కార్మికులు వైఎస్‌ జగన్‌ నిర్ణయంపట్ల తమ హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

వైఎస్‌ జగన్‌తోనే ఆర్టీసీకి మనుగడ:
 రాష్ట్రంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే అటు కార్మికులతోపాటు ఇటు సంస్థకు మేలు జరుగుతుంది. అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ఖాయం. ఆర్టీసీలో కార్మికులంతా కష్టపడి పనిచేస్తున్నా అంతంత మాత్రం జీతాలతో ఇబ్బందులు పడుతున్నారు. కార్పొరేషన్‌ను చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదు.నష్టాల్లో ఉన్న డిపోలను ఆదుకోవడంగానీ, ఆర్థికంగా చేయూత అందించడంగానీ చేయడం లేదు. ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేస్తేనే అందరికీ ప్రయోజనం ఉంటుంది.  వైఎస్‌ జగన్‌ మాట తప్పడని, వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి రాగానే ఆర్టీసీకి మంచి రోజులు రానున్నాయి.
– పి.రవీంద్రనాథ్‌రెడ్డి,
వైఎస్సార్‌ మజ్దూర్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షులు

సంతోషదాయకం
 ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ఎస్సార్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని చెప్పడం సంతోషదాయకం. ఈ విషయం గురించి పోరాటాలు చేస్తున్నా పట్టించుకొనేవారు లేదు. దీనివల్ల  ఆర్టీసీకి తీవ్ర నష్టం వస్తుంది. ప్రభుత్వమే నడిపిస్తే లాభాలబాట పయనిస్తుంది.
 – ఆర్‌.వీ వాసు, కండక్టర్‌ ,మైదుకూరు డిపో  

ఎన్నో ఏళ్ల కల
ఆర్టీసీ కార్మికుల ఎన్నో ఏళ్ల కల వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావడంతో ఫలిస్తుంది. చాలీచాలని జీతాలతో జీవితాన్ని నెట్టుకొస్తున్న ఆర్టీసీ కార్మికులందరికి ఈ ప్రకటన సంతోషకరమైంది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికులు అన్న మాట అనుకుంటేనే ఆనందంగా ఉంది.
– ఫకృద్దీన్, ఆర్టీసీ కార్మికుడు, ప్రొద్దుటూరు.

వైఎస్సార్‌సీపీకి అండగా ఉంటాం..
ప్రభుత్వానికి ఆర్టీసీని విలీనం చేయాలంటూ ఏళ్లతరబడి చేస్తున్న పోరాటాలకు వైఎస్‌ జగన్‌రెడ్డి హామీ ఇవ్వడం శుభపరిణామం. కార్మికుల పక్షాన నిలిచిన వైఎస్‌ జగన్‌కు తప్పక అండగా ఉంటాం. భవిష్యత్‌లో వైఎస్సార్‌సీపీకి అండగా నిలుస్తాం.
– మరియమ్మ(ఆర్టీసీ కండక్టర్‌), పులివెందుల

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement