వైఎస్సార్ యాదిలో..
అవి వైఎస్ పాదయాత్ర చేస్తున్న రోజులు.. సిరిసిల్ల ప్రాంతంలో పర్యటిస్తున్నారు.. 2003 ఏప్రిల్ 24న ఎగువ మానేరు ప్రాజెక్టును సందర్శించాక పాదయాత్ర ద్వారా నామాపూర్ గ్రామానికి చేరుకున్నారు.. ఓ రైస్‌మిల్లులో బసచేశారు. అప్పటికే పెరిగిన క్షవరంతో ఉన్న వైఎస్.. క్షురకుడి కోసం వాకబు చేశారు. నామాపూర్‌లోనే ఉన్న మంగలి రాములు.. వైఎస్సార్‌కు క్షవరం చేసేందుకు వెళ్లాడు.
ఆయనతో కాసేపు సరదాగా మాట్లాడిన వైఎస్.. ఇక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయని అడిగారు. ‘‘సర్.. అంతా కరువు, కాటకాలతో అల్లాడుతున్నారు. చేతిలో పనిలేదు. మీకు బాధలు చెప్పుకునేందుకు ఎందరో ఎదురుచూస్తున్నరు’’ అని రాములు అనడంతో.. ‘సరే’ అంటూ వైఎస్ చిరునవ్వు నవ్వారు. నాటి జ్ఞాపకాలను రాములు యాది చేసుకున్నాడు. ‘‘పాదయాత్రలో వైఎస్‌కు క్షవరం చేయడం నా అదృష్టం. వైఎస్ సీఎం అయ్యాక ఒక్కసారైనా కలవాలనుకున్న. కానీ వీలు కాలేదు. రెండోసారి సీఎం అయ్యాక కలిసేందుకు నిర్ణయించుకున్న. కానీ విధి ఆ దేవున్ని తీసుకెళ్లింది’’ అంటూ రాములు దిగాలుగా చెప్పాడు.