బాబు జమానా.. జనాలకు గుదిబండ | Chandrababu Government Shocks the Bills of the Customer | Sakshi
Sakshi News home page

బాబు జమానా.. జనాలకు గుదిబండ

Published Fri, Mar 29 2019 12:04 PM | Last Updated on Fri, Mar 29 2019 12:14 PM

Chandrababu Government Shocks the Bills of the Customer - Sakshi

సాక్షి, అమరావతి : ఆర్టీసీ చార్జీల బాదుడు.. కరెంట్‌ బిల్లుల బాదుడు..  రిజిస్ట్రేషన్‌ చార్జీల బాదుడు.. ఇంటి పన్ను బాదుడు.. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో బడుగు జీవిపై బాదుడే బాదుడు.. కొంత నేరుగా పిండటం.. దొంగ దారిలో బండ వేసేది మరికొంత..  ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే.. సామాన్యుడు జడుసుకోవాల్సిందే.. కరెంట్‌ స్విచ్‌ వేస్తే చాలు.. వినియోగదారుడికి వేలల్లో బిల్లుల షాక్‌ .. సెంటు స్థలం కొందామంటే.. రిజిస్ట్రేషన్‌ చార్జీలతో చుక్కలు.. చివరికి ఇంటి పన్నును కూడా పెంచేసి..జనం నడ్డి విరిచింది చంద్రబాబు సర్కారు.. ఈ బాదుడుకు జడిసిన సగటు జీవి.. ‘బాబు’ ఇక వద్దే వద్దంటున్నాడు.

అధికారంలోకొస్తే బస్సు చార్జీలను పెంచబోమని గద్దెనెక్కిన చంద్రబాబు సర్కారు.. గత ఐదేళ్లుగా ప్రయాణికులపై భారం మోపుతూనే ఉంది. రెండుసార్లు ఆర్టీసీ చార్జీలు పెంచి.. ఓసారి సవరణ పేరుతో చార్జీల భారం ప్రయాణికులపై మోపింది. టోల్‌ చార్జీలు, డీజిల్‌ రేట్లు పెరిగినప్పుడల్లా ఆ భారం ప్రజలపైనే వేసింది. రోజుకు 68 లక్షల మందిని గమ్యస్ధానాలకు చేరుస్తున్న ఆర్టీసీ.. సర్కారు ఏ మాత్రం ఆదుకోకపోవడంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా భారం మోపుతూనే ఉంది. ఈ ఐదేళ్ల వ్యవధిలో చార్జీల పెంపు, ప్యాసింజర్‌ సెస్, సేఫ్టీ సెస్‌ల పేరిట రూ.979 కోట్ల వరకు చార్జీలు పెంచింది.  

  • 2015 అక్టోబరులో ఆర్టీసీ చార్జీలను 10 శాతానికిపైగా ప్రభుత్వం పెంచింది. అప్పట్లో ప్రయాణికులపై ఏడాదికి రూ.330 కోట్ల భారం పడింది.  
  • 2016లో యూనియన్‌ నేతలకు సైతం అర్ధం కాకుండా చార్జీలను పెంచింది. 4 శాతం వరకు చార్జీలను పెంచింది. ఈ భారం రూ.132 కోట్ల వరకు ఉంది. ఆ తర్వాత అదే ఏడాదిలో.. టిక్కెట్‌పై సౌకర్యాల కల్పన కోసమంటూ రూ.2 వసూలు చేసింది. ఈ బాదుడు వల్ల ఏటా రూ.130 కోట్లు అదనంగా ఆర్టీసీకి సమకూరింది.  
  • 2017లో సేఫ్టీ సెస్‌ అంటూ ప్రతి టిక్కెట్‌పై రూపాయి వసూలు చేసింది. రోజుకు సేఫ్టీ సెస్‌ కింద రూ.20 లక్షలు వసూలు చేసింది. ఈ భారం ఏడాదికి రూ.72 కోట్లు ప్రయాణికుల నుంచే రాబట్టింది. అప్పటికే రెండుసార్లు బస్సు చార్జీలను పెంచిన ప్రభుత్వం.. ప్రజాగ్రహం చవిచూడాల్సి వస్తుందని భయపడి నేరుగా చార్జీలు పెంచకుండా.. దొడ్డిదారిన వడ్డింపు కార్యక్రమం మొదలెట్టింది.  
  • ఈ ఐదేళ్లలోనూ పండుగల సందర్భాల్లో.. రద్దీ సీజన్‌లో సినిమా బ్లాక్‌ టిక్కెట్ల మాదిరిగా విక్రయాలు చేపట్టి రెట్టింపు చార్జీలు వసూలు చేసింది. పుణ్యక్షేత్రాలకు బాదుడు తప్పలేదు.  ఇలా రకరకాలుగా చార్జీల భారం మోపుతూ.. ప్రజా రవాణా వ్యవస్ధలో హాయిగా ప్రయాణి ద్దామనుకున్న సామాన్యుడిపై ఏటేటా చార్జీల పెంపుతో పెనుభారం మోపింది. 

8 తెలుగు వెలుగుకూ తప్పని బాదుడు
పల్లెలకు వెళ్లే తెలుగువెలుగు బస్సుల్ని చంద్రబాబు సర్కారు వదిలిపెట్టలేదు. అధికారంలోకొచ్చిన ఏడాది తర్వాత పల్లెవెలుగు బస్సుల్లో కిలోమీటరుకు 3 పైసల్ని పెంచింది. ఎక్స్‌ప్రెస్, డీలక్స్‌ సర్వీసుల్లో కిలోమీటరుకు 8 పైసలు, ఏసీ సర్వీసుల్లో 9 పైసల వంతున చార్జీలు పెంచింది. ఈ భారం ఏటా రూ.330 కోట్ల వరకు సామాన్యుడిపై పడింది. సవరణ పేరుతో చిల్లర సమస్యను సాకుగా చూపి.. ప్రయాణికుల్ని దోచుకున్నారు.

ఉదాహరణకు టిక్కెట్‌ ధర రూ.81 ఉంటే సవరించే చార్జీల ప్రకారం రూ.85 వసూలు చేశారు. అలాగే రూ.87 చార్జీ ఉంటే.. రూ.90 వసూలు చేస్తారన్న మాట. చిల్లర సమస్యను పరిష్కరించడానికి ఈ విధంగా చార్జీలను సవరిస్తున్నట్లు అప్పట్లో ఆర్టీసీ పేర్కొంది. టిక్కెట్లు రద్దు చేసుకున్నా.. తిరిగి డబ్బు చెల్లించే సమయంలోనూ ‘రౌండింగ్‌ ఆఫ్‌’ వర్తించేలా ఉత్తర్వులు జారీ చేసింది. టిక్కెట్‌ రద్దు చేసుకుంటే ఆర్టీసీ రూ.149 ఇవ్వాల్సి ఉంటే.. రూ.145 మాత్రమే చెల్లించారు.    

8 పుణ్యక్షేత్రాల సందర్శనకు తప్పని బాదుడు
ఏపీఎస్‌ఆర్టీసీ రద్దీ, పండగ సీజన్‌లో ప్రయాణికుల్ని దోచుకునేందుకు 50శాతం చార్జీలను అధికంగా మోపి ఓ వైపు నడ్డివిరుస్తుంటే... మరోవైపు డిపోల వారీగా ఇష్టారీతిన టిక్కెట్ల ధరలను వసూలు చేయడం ఫక్తు సినిమా బ్లాక్‌ టిక్కెట్లను తలపించింది. సామాన్య ప్రజలు పుణ్యక్షేత్రాల సందర్శనలోనూ ఆనందాన్ని ఆవిరి చేస్తూ అధిక చార్జీలను మోపింది. డీజిల్‌ ధరలు పెరిగినా.. చార్జీలు పెంచడం లేదని పైకి చెబుతూ.. జిల్లా జిల్లాకో టిక్కెట్లు రేట్లు పెంచి ప్రయాణికుల జేబులు గుల్ల చేసింది. ఇక పండగ వేళల్లో వేరే చెప్పనక్కర్లేదు. ప్రత్యేక బస్సులంటూ 50% నుంచి వంద శాతం వరకు చార్జీలను పెంచుతూ.. ఏకంగా ప్రజా రవాణా వ్యవస్ధను ప్రజలకు దూరం చేసింది.  

8 సెస్సులు వేసినా.. సౌకర్యాలు లెస్సు
సౌకర్యాల పేరుతో టిక్కెట్‌పై రూ.2 వసూలు చేసినా.. సౌకర్యాలు అత్యంత అధ్వానం. బస్టాండ్లలో మూత్ర విసర్జనకు రూ.5 వసూలు చేస్తున్నారు. ప్రయాణికుల నుంచి ప్యాసింజర్‌ సెస్‌ పేరుతో వసూలు చేస్తున్నా.. అందుకు తగ్గట్లు ఏ మాత్రం సౌకర్యాలు కల్పించడం లేదు. ఇప్పుడు సేఫ్టీ సెస్‌ అని టిక్కెట్టుపై రూపాయి వంతున తీసుకుంటున్నారు. కిలోమీటర్లతో సంబంధం లేకుండా.. ప్రతి ఒక్క ప్రయాణికుడిపై ఈ భారం మోపారు. సేఫ్టీ సెస్‌ కింద రూపాయి వసూలు చేసినా.. రాష్ట్రంలో తిరిగే బస్సుల్లో కనీసం ప్రథమ చికిత్స బాక్సులు కూడా ఏర్పాటు చేయలేదు. ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు పరిహారం కూడా ఇవ్వడం లేదు. 

8 షాక్‌ కొట్టేలా విద్యుత్తు చార్జీల పెంపు 
రాష్ట్రంలో సామాన్య ప్రజలు కరెంట్‌ స్విచ్‌ వేస్తే.. బిల్లుతో షాక్‌ కొట్టే పరిస్థితి నెలకొంది. గతంలో నెలకు వందకి మించి రాని కరెంట్‌ బిల్లు.. టీడీపీ అధికారంలోకి వచ్చాక.. వెయ్యి, రెండువేల దాకా వస్తోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చీ రావడంతోనే విద్యుత్‌ చార్జీలను పెంచింది. గత నాలుగున్నరేళ్లలో ప్రజలపై ప్రత్యక్షంగా రూ.1562 కోట్లు.. పరోక్షంగా రూ.3700 కోట్లు..
వెరసి మొత్తంగా రూ.5,262 కోట్ల భారం వేసింది.

8 45 లక్షల మంది వినియోగదారులపై అదనపు భారం 
2015–16సంవత్సరంలో ఏకంగా రూ.941 కోట్ల భారం విద్యుత్‌ వినియోగదారులపై వేసింది. మరో రూ.750 కోట్లు ట్రూ అప్‌ చార్జీల రూపంలో పిండుకోవాలని చూసింది. జనాగ్రహంతో ట్రూ అప్‌ మాట వెనక్కు తీసుకుంది. 2016–17లో మరో దఫా విద్యుత్‌ చార్జీల భారం మోపింది. నేరుగా రూ.242 కోట్ల మేర చార్జీలు పెంచింది. కానీ శ్లాబుల వర్గీకరణతో దాదాపు రూ.1200 కోట్లు దండుకుంది. 2014–15లో ఏడాదికి 600 యూనిట్ల విద్యుత్‌ వాడకం దాటితే.. నెలవారీ బిల్లు రెట్టింపయ్యే ఎత్తుగడ వేసింది.

మొదటి 50 యూనిట్లకు రూ.1.45(యూనిట్‌కు) చొప్పున చెల్లించే విద్యుత్‌ వినియోగదారుడు.. ఏడాదికి 601 యూనిట్ల వినియోగం ఉంటే చాలు యూనిట్‌కు రూ.2.60 చొప్పున చెల్లించాలి. దీన్ని బట్టి ఏడాదికి ప్రతీ వినియోగదారుడు రూ. 600 వరకూ అదనపు భారం మోయాల్సి వచ్చింది. ఇలా 45 లక్షల మంది విద్యుత్‌ వినియోగదారులపై అదనపు భారం పడింది. దళిత పేద వర్గాల సబ్సిడీ ఎగిరిపోయింది. సర్కారు దీంతో శాంతించలేదు. ఈ ఏడాది(2017–18)లో కొత్త రకం దొంగ దెబ్బను కనిపెట్టింది.

ఇప్పుడు 1 కేవీ లోడ్‌ దాటితే ఫిక్స్‌డ్‌ చార్జీలు వసూలు చేస్తామంటోంది. అంటే.. వెయ్యి వాట్స్‌కు సరిపడా లోడ్‌ ఉంటే బిల్లు మోతమోగినట్టే.  రకరకాల విద్యుత్‌ ఉపకరణాలున్న ఈ రోజుల్లో 1 కేవీ లోడ్‌ దాటని వారు ఎవరుంటారు? ప్రతిఇంట్లో.. నాలుగు బల్బులు, ఫ్యాన్లు, మిక్సీ, కూలర్, ఇస్త్రీ పెట్టె... ఇలాంటివన్నీ సర్వసాధారణం కదా? ఈ విధానం వల్ల మధ్యతరగతి వినియోగదారుడి బిల్లు రూ.150 నుంచి రూ. 600 వరకూ పెరిగే వీలుంది. ఇది దొంగదెబ్బ కాదా? ఒక పక్క విద్యుత్‌ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ.. మరోవైపు ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం..  భారాన్ని మాత్రం ప్రజలపై మోపుతోంది.

సంస్కరణల పేరుతో విద్యుత్‌ నియంత్రణ మండలిని ఏర్పాటు చేసినా.. ఈ స్వతంత్ర సంస్థ స్వేచ్ఛను సర్కారే పూర్తిగా హరించింది. నాలుగేళ్లుగా ప్రతీఏటా ప్రజాభిప్రాయ సేకరణలో అనేక అంశాలు ముందుకొచ్చినా.. ఏపీఈఆర్‌సీ మాత్రం ప్రభుత్వ పెద్దల కొమ్ముగాస్తోందనే ఆరోపణలున్నాయి.  

8 రిజిస్ట్రేషన్‌ చార్జీలు అదనంగా రూ.1,500 కోట్లు   
రాష్ట్రంలో భూములు, ఇళ్ల స్ధలాలు, నిర్మాణ రంగంలో రిజిస్ట్రేషన్‌ చార్జీలను చంద్రబాబు అధికారంలోకి రాగానే పెంచారు. సెంటు స్ధలం కొందామన్నా చుక్కలు కనిపించే పరిస్థితి తెచ్చారు. ప్రతి ఏటా రిజిస్ట్రేషన్‌ రంగంపై సర్కారుకు రూ.4,600 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. చంద్రబాబు హయాంలో 2014 నుంచి ఇప్పటివరకు రెండుసార్లు రిజిస్ట్రేషన్‌ చార్జీలు పెంచారు. 2015లో, 2018లో రెండుసార్లు పెంచిన చార్జీలతో.. రాష్ట్ర ప్రజలపై రూ.1,500 కోట్ల వరకు అదనపు భారం పడింది.  

పోలవరం యాత్రలు, సీఎం సభలకు ఉచితంగా బస్సులు తిప్పి..ప్రయాణీకులపై భారమా? 
పోలవరం యాత్రలు, సీఎం సభలకు మాత్రం ఉచితంగా బస్సులు తిప్పారు. అధికారులు వచ్చి బలవంతంగా బస్సులు ఎక్కించి మరీ పంపించారు. వీటికయ్యే ఖర్చును పుణ్యక్షేత్రాలకు వెళదామనుకున్న మాపై మోపుతారా? పండగ వచ్చిదంటే ఈ చార్జీల దోపిడీ ఆకాశమే హద్దుగా సాగింది. ఒక్కో టిక్కెట్‌పై 150 శాతం చార్జీలు వసూలు చేసి పండగ ఆనందాన్ని ఆవిరి చేశారు.  
– సలాది చక్రవర్తి, జనుపాలెం, తూ.గో.జిల్లా 

వైఎస్‌ హయాంలో పైసా పెంచలేదు
వైఎస్‌ హయాంలో పైసా చార్జీ పెంచలేదు. ఆర్టీసీని ఆదుకుని కార్మికులకు మెరుగైన వేతనం ఇచ్చినా..
ఆ భారం ప్రయాణికులపై ఏనాడూ మోపలేదు.
ప్రజా రవాణా వ్యవస్ధను ఆదుకుని ఆర్టీసీకి జవసత్వాలు కల్పించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని హామీతో.. కార్మికులకు మేలు జరగడంతోపాటు ప్రయాణికులకు చార్జీల భారం తప్పుతుందని ఆశిస్తున్నా. 
– రాజారెడ్డి, అధ్యక్షుడు, వైఎస్సార్‌ ఆర్టీసీ మజ్దూర్‌ యూనియన్‌ 

రూ.210 కోట్ల మేర ఇంటి పన్ను వడ్డింపు
ప్రతి ఏటా 5 శాతం మేర ఇంటి పన్నును చంద్రబాబు సర్కారు పెంచింది. టీడీపీ  అధికారంలోకొచ్చే నాటికి రూ.300 కోట్ల మేర ఉన్న ఇంటి పన్ను.. ఈ ఆర్ధిక సంవత్సరం జనవరి నాటికి రూ.510 కోట్లకు చేరింది. అంటే.. ఈ ఐదేళ్లలో అదనంగా రూ.210 కోట్ల మేర ఇంటి పన్ను రాష్ట్ర ప్రజల నుంచి వసూలు చేశారన్న మాట!! 
- లంకిరెడ్డి విద్యాధర్‌రెడ్డి, సాక్షి, అమరావతి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement