Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Sukma Dantewada border encounter Latest News1
Sukma: భారీ ఎన్‌కౌంటర్‌.. 20 మంది మావోయిస్టుల మృతి

రాయ్‌గఢ్‌: మరో భారీ ఎన్‌కౌంటర్‌తో ఛత్తీస్‌గఢ్‌ ఉలిక్కిపడింది. సుక్మా జిల్లాలో ఈ ఉదయం ఎదురు కాల్పులు చోటు చేసుకోగా.. ఇప్పటిదాకా 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. సుక్మా-దంతేవాడ సరిహద్దులో ఉప్పనల్లి వద్ద గోగుండ అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం కూంబింగ్‌ నిర్వహిస్తున్న భద్రతా బలగాలపై మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. ప్రతిగా జరిపిన కాల్పుల్లో మావోయిస్టులకు భారీగా నష్టం వాటిల్లింది. ఘటనా స్థలం నుంచి ఆయుధాలను, పేలుడు పదార్థాలను స్వాధీనపర్చుకున్నారు. ఘనటలో ఇద్దరు జవాన్లకు గాయాలైనట్లు అధికారులు ప్రకటించారు. అయితే కాల్పుల్లో మావోయిస్టు కమాండర్ డీవీసీఎం జగదీష్ మృతి చెందాడని ప్రచారం జరుగుతున్నప్పటికీ.. అధికారికంగా ధృవీకరణ కావాల్సి ఉంది.ప్రస్తుతం అక్కడ ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. సుక్మా ఎస్పీ కిరణ్‌ చవాన్‌ పర్యవేక్షణలో డీఆర్జీ, సీఆర్పీఎఫ్ జవాన్లు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉంటే.. గత మూడు నెలల్లో జరిగిన వివిధ ఎన్‌కౌంటర్‌లలో 100 మంది దాకా మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుపెట్టడం గమనార్హం.ఈ ఏడాది జనవరిలో భద్రతా సిబ్బందిని లక్ష్యంగా మావోయిస్టులు జరిపిన దాడుల్లో ఎనిమిది మంది మరణించారు. అదే నెల చివర్లో.. కూంబింగ్‌ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఫిబ్రవరిలో బీజాపూర్‌ జిల్లాలోనే జరిగిన ఎన్‌కౌంటర్‌లో 31 మంది మావోయిస్టులు, ఇద్దరు భద్రతా సిబ్బంది మరణించారు. బీజాపూర్‌-దంతెవాడ సరిహద్దుల్లోని.. గంగలూరు పరిధి ఆండ్రి దండకారణ్యంలో మార్చి 20వ తేదీన జరిగిన ఎన్‌కౌంటర్‌లో 26 మంది మావోయిస్టులు, ఓ డీఆర్‌జీ జవాన్‌ రాజు మరణించారు. అదే రోజున కాంకేర్‌ జిల్లా(Kanker Encounter) ఛోటెబేథియా కోరోస్కోడో గ్రామంలో జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.మావోయిస్టు రహిత భారత్‌ లక్ష్యంగా ఆపరేషన్ కగార్‌(Operation Kagar) పేరిట హోం మంత్రి అమిత్‌ షా పర్యవేక్షణలో ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. ఇప్పటికే జరిగిన అనేక ఎన్‌కౌంటర్లలో భారీగా మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో.. ఆపరేషన్ కగార్‌ చర్యను ఖండిస్తూ మావోయిస్టులు స్పందించారు. మావోయిస్టు పశ్చిమ బస్తర్ కమిటి అధికార ప్రతినిధి మోహన్ పేరిట ఓ లేఖ విడుదల చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కగార్ దాడులతో 2025 జనవరి నుంచి ఇప్పటి వరకు మావోయిస్టులు, ఆదివాసీలను కలిపి మొత్తం 78 మందిని హతమార్చారని అందులో పేర్కొన్నారు. జనవరి నుంచి ఇప్పటి వరకు ఏయే ప్రాంతాల్లో, ఎప్పుడు ఎన్‌కౌంటర్లు జరిగాయి.. ఎంతమంది చనిపోయారు.. వారి వివరాలను తెలుపుతూ మావోయిస్టు పశ్చిమ బస్తర్ కమిటి అధికార ప్రతినిధి మోహన్ లేఖను విడుదల చేశారు. పోరాటం విషయంలో రాజీపడబోమని వెల్లడించారు. మావోయిస్టుల ప్రభుత్వ హత్యలను ఖండిస్తూ ఏప్రిల్‌ 4వ తేదీన బీజాపూర్ బంద్‌కు పిలుపునిస్తున్నట్లు ప్రకటించారు. ఈ లేఖ విడుదలైన మరుసటిరోజే మరో భారీ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకోవడం గమనార్హం.

Phone Tapping Case: Sravan Rao SIT Inquiry Updates2
కొత్త ట్విస్ట్‌.. శ్రవణ్‌ రావు విచారణపై ఉత్కంఠ!

హైదరాబాద్‌, సాక్షి: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. మీడియా సంస్థ నిర్వాహకుడు, ఫోన్ ట్యాపింగ్‌ కేసు నిందితుడు శ్రవణ్ రావు నగరానికి వచ్చినట్లు సమాచారం. అయితే ఆయన ఇప్పుడు ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) ఎదుట హాజరు అవుతారా? అనే ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే.. ఈ కేసులో ఏ6 నిందితుడిగా ఉన్న శ్రవణ్‌ కుమార్‌కు ఈ నెల 26వ తేదీన సిట్‌ నోటీసులు జారీ చేసింది. 29వ తేదీన తమ కార్యాలయానికి విచారణ నిమిత్తం రావాల్సిందిగా తెలిపింది. ఆయన అమెరికాలో ఉండడంతో కుటుంబ సభ్యులకు ఆ నోటీసులను అందజేసింది. అయితే ఈలోపు అరెస్ట్‌ నుంచి ఆయనకు సుప్రీం కోర్టు ఊరట ఇచ్చింది. అయినప్పటికీ ఈ కేసులో విచారణకు సహకరించాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం షరతు విధించింది. దీంతో ఆయన విచారణకు హాజరు అవుతారని అంతా భావించారు. మరోవైపు.. శ్రవణ్‌ రావు విచారణకు హాజరు అవుతారని కుటుంబ సభ్యులు ఇప్పటికే ప్రకటించారు. ఈ వేకువఝామున ఆయన నగరానికి వచ్చారని తెలుస్తోంది. ఈ కేసులో శ్రవణ్‌ వాంగ్మూలం కీలకంగా ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో శ్రవణ్‌ వెర్షన్‌ ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. ఫోన్‌​ ట్యాపింగ్‌ వ్యవహారంలో.. స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ) కేంద్రంగా ఎవరెవరిపై నిఘా ఉంచాలనే విషయంలో శ్రవణ్‌ రావు సూచన మేరకే కీలక నిందితులు ప్రభాకర్‌రావు, ప్రణీత్‌రావులు నడుచుకున్నారనేది దర్యాప్తుసంస్థ ప్రధాన అభియోగం. ఓ మీడియా సంస్థకు అధిపతిగా ఉంటూ 2023 శాసనసభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు లబ్ధి చేకూర్చారని.. కాంగ్రెస్‌ అభ్యర్థులతోపాటు వారికి ఆర్థిక వనరులు సమకూర్చుతున్న వ్యాపారులపై నిఘా ఉంచాలని ఈయనే సూచించారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన్ను విచారిస్తే ఈ విషయాలపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. గతేడాది మార్చి 10న పంజాగుట్ట ఠాణాలో ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు నమోదైన వెంటనే ఆయన తొలుత లండన్‌కు.. అక్కడి నుంచి అమెరికాకు వెళ్లిపోయారు. సిట్‌ విచారణకు రాకుండా అక్కడే ఉండిపోయారు. ఇటీవలే ఆయనపై రెడ్‌కార్నర్‌ నోటీస్‌ సైతం జారీ అయింది. అయితే తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్‌ నిరాకరించడంతో.. సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ దాఖలు వేసి ఊరట పొందినప్పటికీ విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

IPL 2025: RCB Captain Rajat Patidar Comments After Winning Match Against CSK3
మంచి స్కోర్‌ చేశాము.. సీఎస్‌కేను వారి సొంత ఇలాకాలో ఓడించడం చాలా ప్రత్యేకం: పాటిదార్‌

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ఆర్సీబీ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. సీఎస్‌కేతో నిన్న (మార్చి 28) జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ అన్ని విభాగాల్లో సత్తా చాటింది. కష్ట సాధ్యమైన పిచ్‌పై తొలుత బ్యాటింగ్ చేసి 196 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. అనంతరం అద్భుతంగా బౌలింగ్‌ చేసి విజయంవంతంగా లక్ష్యాన్ని కాపాడుకుంది. బ్యాటింగ్‌లో రజత్‌ పాటిదార్‌ (32 బంతుల్లో 51; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), ఫిల్‌ సాల్ట్‌ (16 బంతుల్లో 32; 5 ఫోర్లు, సిక్స్‌), పడిక్కల్‌ (14 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), టిమ్‌ డేవిడ్‌ (8 బంతుల్లో 22 నాటౌట్‌; ఫోర్‌, 3 సిక్సర్లు) సత్తా చాటగా.. బౌలింగ్‌లో హాజిల్‌వుడ్‌ (4-0-21-3), లవింగ్‌స్టోన్‌ (4-0-28-2), యశ్‌ దయాల్‌ (3-0-18-2) మ్యాజిక్‌ చేశారు. ఫలితంగా ఆర్సీబీ సీఎస్‌కేను 17 ఏళ్ల తర్వాత వారి సొంత ఇలాకాలో ఓడించింది.ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ అద్భుత ‍ప్రదర్శనలతో ఆకట్టుకోగా.. సీఎస్‌కే స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక ఓటమిపాలైంది. టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన సీఎస్‌కే కీల​క సమయాల్లో క్యాచ్‌లు జారవిడచడంతో పాటు ఫీల్డింగ్‌లో అనవసర తప్పిదాలు చేసి అదనపు పరుగులు సమర్పించుకుంది. నూర్‌ అహ్మద్‌ (4-0-36-3), పతిరణ (4-0-36-2), ఖలీల్‌ అహ్మద్‌ (4-0-28-1) బాగానే బౌలింగ్‌ చేసినా మిగతా బౌలర్లు సామర్థ్యం మేరకు రాణించలేక ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. స్లోగా ఉన్న పిచ్‌పై సీఎస్‌కే బౌలర్లు 20-30 పరుగులు అదనంగా ఇచ్చారు.అనంతరం కష్ట సాధ్యమైన ఛేదనలో సీఎస్‌కే బ్యాటర్లు ఆదిలోనే చేతులెత్తేశారు. కనీస పోరాటం కూడా చూపలేక మ్యాచ్‌ను ఆర్సీబీకి అప్పగించారు. ఓ పక్క వికెట్లు పడుతున్నా రచిన్‌ రవీంద్ర (41) ఒక్కడే క్రీజ్‌లో నిలబడి ఏదో చేసే ప్రయత్నం చేశాడు. ఆఖర్లో ధోని (16 బంతుల్లో 30 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) భారీ షాట్లు ఆడినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సీఎస్‌కేకు పిచ్‌ నుంచి కూడా ఎలాంటి సహకారం లభించలేదు. వికెట్‌ చాలా స్లోగా ఉండింది. కొత్త బంతి కూడా వారికి కలిసి రాలేదు.మ్యాచ్‌ అనంతరం విన్నింగ్‌ కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఈ వికెట్‌పై మంచి స్కోర్‌ చేశాము. వికెట్‌ చాలా స్లోగా ఉండింది. బ్యాటర్లకు ఇది అంత సులభం కాదు. సీఎస్‌కేను వారి సొంత అభిమానుల మధ్య ఓడించడం చాలా ప్రత్యేకం. ఈ వికెట్‌పై ఛేజింగ్ చేయడం అంత సులభం కాదని తెలుసు. అందుకే 200 పరుగులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. నేను క్రీజ్‌లో ఉన్నంత సేపు ప్రతి బంతికి భారీ షాట్‌ ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. ఓ రకంగా సఫలమయ్యాను. స్పిన్నర్లకు ఈ ట్రాక్ చాలా ఉపయోగకరంగా ఉండింది. అందుకే ముందుగానే స్పిన్నర్లను బరిలోకి దించాలని అనుకున్నాము. లివింగ్‌స్టోన్ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. హాజిల్‌వుడ్‌ తన తొలి ఓవర్‌లో, ఆతర్వాత కొత్త బంతితో మ్యాజిక్‌ చేశాడు. ఈ రెండు సందర్భాలు మ్యాచ్‌ను మాకు అనుకూలంగా మార్చాయి. మేము పరుగులు సాధించగలిగినా వారి బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు.

CBN, Pawan Silence On Rajahmundry Pharmacy Student Incident4
‘ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంటే నోరు మెదపరా?'

తూర్పుగోదావరి, సాక్షి: ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంటే సహించబోనని.. చెయ్యి వేసిన వాడి తాట తీస్తానని గతంలో పవన్‌ కల్యాణ్‌ ఎన్నో ప్రకటనలు ఇచ్చారు. మరి ఇప్పుడు ఆయనెక్కడ ఉన్నారు? అంటూ రాజమండ్రి ఫార్మసీ విద్యార్థిని తల్లిదండ్రులు, ఆమె స్నేహితులు ప్రశ్నిస్తున్నారు. పోలవరం దాకా వచ్చిన చంద్రబాబుకి.. ఇక్కడిదాకా వచ్చే టైం లేదా? అని అడుగుతున్నారు. మహిళా హోం మంత్రి అనితకు పరామర్శించే సమయమే లేదా? అని నిలదీస్తున్నారు. లైంగిక వేధింపులకు గురై ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టిన డీ ఫార్మ్‌ ఫైనలియర్‌ విద్యార్థిని పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఆమె చికిత్స పొందుతున్న రాజమండ్రి బొల్లినేని కిమ్స్ ఆస్పత్రి యాజమాన్యమే వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నమూ చేస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో హెల్త్ బులిటెన్ విడుదల చేస్తారని సమాచారం అందుతోంది. ఫార్మసీ విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి కమిటీ వేశారు. జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి వెంకటేశ్వరరావు సారథ్యంలోని ముగ్గురు సభ్యులతో కూడిన ఈ బృందం శుక్రవారం ఆసుపత్రికి వచ్చి విద్యార్థినికి అందిస్తున్న చికిత్స వివరాలు తెలుసుకున్నారు. ఆమె ఆరోగ్యంపై ఇవాళ(శనివారం) హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేయనున్నారు.బాధిత విద్యార్థిని డైరీలో రాసుకున్న సూసైడ్‌ నోట్‌తో ఆత్మహత్యా యత్నం బహిర్గతమైంది. నిందితుడు దీపక్ ఓ టీడీపీ ఎమ్మెల్యేకి బంధువు కావడంతో కేసును నీరు కారుస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘటన జరిగిన మూడు రోజుల దాకా అంతా గోప్యంగా ఉంచారని అంటున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆందోళన బాట పట్టారు. సీసీ ఫుటేజీ ఎక్కడ? బాధితురాలు వేకురోనీమ్‌ 10 ఎంజీ ఇంజక్షన్‌ తీసుకుందని.. దీనివల్ల బ్రెయిన్‌ డెడ్‌ అయ్యే ప్రమాదం ఉందని కొందరు పేర్కొంటుండగా.. ఇంకా బ్రెయిన్‌ డెడ్‌ కాలేదని ఆస్పత్రి యాజమాన్యం అంటోంది. మరి అంత ప్రమాదకరమైన ఇంజక్షన్‌ ఆమె చేతికి ఎలా వచ్చిoది? ఆమే చేసుకుందా..? ఎవరైనా ఇచ్చారా? సీసీ ఫుటేజీలో ఏం ఉంది? అనే దిశగా పోలీసు దర్యాప్తు చేయకపోవడం సందేహాలకు తావిస్తోంది. వాడిని చంపేయండి..! చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తన చెల్లికి ఈ పరిస్థితి కల్పించిన దీపక్‌ను చంపేయాలని బాధితురాలి సోదరి, మేనత్త ఆగ్రహంతో మండిపడ్డారు. తన చెల్లెలు బాగా చదువుకునేదని, మంచి మార్కులతో ఫార్మసీ పూర్తి చేసే లోపు ఈ దారుణం జరిగిందని కన్నీరుమున్నీరయ్యారు. ఆసుపత్రి లోపల ఏం జరుగుతోందో తెలియడం లేదని, ఎలాంటి వైద్యం అందిస్తున్నారో చెప్పడం లేదని బాధితురాలి అక్క విలపించింది. దీపక్‌ను కఠినంగా శిక్షించాలని విద్యార్థిని మేనత్త డిమాండ్‌ చేసింది. సూసైడ్‌ లేఖ దొరక్కపోయి ఉంటే ఈ కేసును వేరే విధంగా మార్చేసేవారన్నారు.

L2 Empuraan Movie 2 Days Collections5
లూసిఫర్‌2 కలెక్షన్ల సునామీ.. ప్రకటించిన మోహన్‌లాల్‌

మలయాళ సినిమా 'లూసిఫర్‌2: ఎంపురాన్‌' (L2 Empuraan) బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్లతో దుమ్మురేపుతుంది. మోహన్‌లాల్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌(Prithviraj Sukumaran) కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే, తాజాగా ఈ సినిమా రెండు రోజుల్లోనే బెంచ్‌మార్క్‌ కలెక్షన్స్‌ రాబట్టినట్లు మోహన్‌లాల్‌ ప్రకటించారు. 2019లో వచ్చిన లూసిఫర్‌ చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీని భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్‌ నిర్మించింది. సుమారు రూ.140 కోట్ల బడ్జెట్‌తో లూసిఫర్‌2 చిత్రాన్ని నిర్మించారు. పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ చిత్రాన్ని స్టార్‌ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ తెరకెక్కించారు.లూసిఫర్‌2 కేవలం రెండురోజుల్లోనే రూ. 100 కోట్లు రాబట్టినట్లు మోహన్‌లాల్‌ ఒక పోస్టర్‌తో ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 48 గంటల్లోపు రూ. 100 కోట్లను అధిగమించి, సినిమా చరిత్రలోనే కొత్త రికార్డ్‌ను లూసిఫర్‌ నెలకొల్పిందని మోహన్‌లాల్‌ అన్నారు. ఈ విజయంలో భాగమైనందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలని ఒక పోస్ట్‌ చేశారు.మలయాళ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు వంద కోట్ల క్లబ్‌లో చేరిన సినిమాలు కేవలం 10 మాత్రమే ఉన్నాయి. అయితే, ఎంపురాన్‌ 48 గంటల్లోనే రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరడం విశేషం. ఈ సినిమా ఫైనల్‌గా రూ. 200 కోట్లు దాటొచ్చు అని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. వాస్తవంగా 2019 వరకు మలయాళంలో రూ.100 కోట్లు రాబట్టిన సినిమాలే లేవు. అప్పట్లో లూసిఫర్‌ సినిమానే మొదటిసారి ఈ మార్క్‌ను దాటి రూ.127 కోట్లు రాబట్టింది. ఆ తర్వాత వచ్చిన మంజుమ్మల్‌ బాయ్స్‌ రూ.242 కోట్లతో ఏకైక మలయాళ మూవీగా రికార్డుకెక్కింది. మరి ఈ రికార్డును ఎంపురాన్‌ బ్రేక్‌ చేస్తుంది అని మోహన్‌లాల్‌ అభిమానులు అంటున్నారు. The Cicada himself. #L2E #Empuraan surpasses 100 crore at the box office worldwide in less than 48 hours, setting new benchmarks in cinematic history.A heartfelt thanks to all of you for being part of this extraordinary success! Your love and support made this possible. pic.twitter.com/SoGeHClLY2— Mohanlal (@Mohanlal) March 28, 2025

Myanmar Thailand Bangkok Earthquake March 29 2025 Live Updates6
Earthquake Updates: మృత్యు ఘోష.. 700 దాటిన మృతుల సంఖ్య

Earthquake Live Rescue OP Updates👉 మయన్మార్‌, థాయ్‌లాండ్‌లో మృత్యు ఘోషభారీ భూకంపంతో రెండు దేశాల్లో మృత్యు ఘోషమయన్మార్‌, థాయ్‌లాండ్‌లో 700కి పెరిగిన భూకంప మృతుల సంఖ్యఒక్క మయన్మార్‌లోనే 694 మంది మృతి, 1500 మందికి పైగా గాయాలుబ్యాంకాక్‌లో ఇప్పటిదాకా 10 మంది మృతి చెందినట్లు ప్రకటనసహాయక చర్యల్లో భాగంగా.. శిథిలాల నుంచి బయటపడుతున్న మృతదేహాలు సజీవంగా బయటపడుతున్నవాళ్ల సంఖ్య తక్కువేరెండు దేశాల్లోనూ కొనసాగుతున్న సహాయక చర్యలుమయన్మార్‌లో కూలిపోయిన సగాయింగ్‌ బ్రిడ్జిశిథిలా కింద చిక్కుకున్న వాళ్లను కాపాండేందుకు రెస్క్యూ టీం సహాయంమృతుల సంఖ్య 10వేలకు పైగా ఉండొచ్చని అమెరికా సంస్థ అంచనా 👉 భూకంపం ధాటికి బ్యాంకాక్‌లో కుప్పకూలిన భారీ భవనంకుప్పకూలిన 33 అంతస్తుల భవనంనాలుగు మృతదేహాల వెలికితీత90 మంది ఆచూకీ గల్లంతుకొనసాగుతున్న శిథిలాల తొలగింపు👉మయన్మార్‌, థాయ్‌లాండ్‌లో ప్రకృతి విలయం200 దాటిన మృతుల సంఖ్యమయన్మార్‌లో నేలమట్టమైన 40 భారీ అపార్ట్‌మెంట్లుబ్యాంకాక్‌లోనూ కూలిన భవనాలుశిథిలాల కింద వందలాది మంది.. కొనసాగుతున్న సహాయక చర్యలురక్షించాలంటూ శిథిలాల నుంచి కేకలుఅయినవాళ్ల కోసం కన్నీళ్లతో గాలిస్తున్న పలువురుమృతుల సంఖ్య భారీగా ఉండొచ్చని అంచనా👉అఫ్గాన్‌లో భూకంపంరిక్టర్‌ స్కేల్‌పై 4.7 తీవ్రత నమోదుఉదయం 5.16 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించినట్లు తెలిపిన నేషనల్ సెంటర్‌ ఫర్‌ సిస్మాలజీ👉భూకంప బాధితులకు భారత్‌ ఆపన్న హస్తం15 టన్నుల సహాయక సామగ్రిని మయన్మార్‌కు పంపించిన భారత్గుడారాలు, స్లీపింగ్ బ్యాగ్స్, ఆహార పొట్లాలు, సోలార్‌ లైట్లు, ఔషధాలను మిలిటరీ విమానంలో పంపించినట్లు వెల్లడించిన విదేశాంగశాఖ 👉మయన్మార్‌లో మళ్లీ భూకంపంమయన్మార్‌ను వణికించిన మరో భూకంపంసహాయక చర్యలు కొనసాగుతుండగానే గతరాత్రి మళ్లీ భూకంపం4.2 తీవ్రతతో మళ్లీ ప్రకంపనలునిన్నటి భూకంపం ధాటికి 200 మంది మరణించినట్లు ప్రకటించిన అధికారులుఇంకా భారీగా మృతులు ఉండే అవకాశంవెయ్యి మంది మరణించి ఉండొచ్చని అంచనా వేస్తున్న అమెరికా భూకంపం సర్వే సంస్థ👉 థాయ్‌లాండ్‌లో కొనసాగుతున్న ఎమర్జెన్సీథాయ్‌లాండ్‌లో భూకంపంతో అత్యవసర పరిస్థితి ప్రకటనఉత్తర థాయ్‌లాండ్‌లో తీవ్ర నష్టంరాజధాని బ్యాంకాక్‌ అతలాకుతలంకొనసాగుతున్న శిథిలాల తొలగింపు భారీ సంఖ్యలో మృతులు ఉండే అవకాశంA huge earthquake hits Bangkok Capita Thai and Mayanmar.#trending #breakingnews #viralreels #viral #earthquake #bangkok #mayanmar #NEW pic.twitter.com/AoNn9P30Oq— Dr Maroof (@maroof2221) March 28, 2025👉హృదయ విదారకం మయన్మార్, థాయ్‌లాండ్‌ల్లో హృదయవిదారకంగా భూకంప దృశ్యాలు పలుచోట్ల కుప్పకూలిన భవనాలు, నిర్మాణాల కింద నుంచి హాహాకారాలు స్కూల్స్‌, ఆఫీసులు, ఆస్పత్రులు.. ఇలా అన్ని కుప్పకూలిన వైనంశిథిలాల నడుమ తమవారి కోసం కన్నీటి మధ్యే వెదుక్కుంటున్న జనం కంటతడి పెట్టిస్తున్న దృశ్యాలు👉మయన్మార్‌, థాయ్‌లాండ్‌ను కుదిపేసిన భారీ భూకంపంకుప్పకూలిన భవనాలతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టంఇంకా శిథిలాల కిందే పలువురు.. కొనసాగుతున్న సహాయకచర్యలుమయన్మార్‌లో ఆరు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటనథాయ్‌లాండ్‌లో భారతీయుల సహాయార్థఇండియన్‌ ఎంబసీ హెల్ప్‌లైన్‌థాయ్‌లాండ్‌లో హెల్ఫ్‌లైన్‌ నెంబర్‌ +66618819218ఊహించని ప్రకృతి వికృతి చర్య.. అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న మయన్మార్‌ పాలిట భారీ భూకంపం గోరుచుట్టుపై రోకటిపోటుగా మారింది.టిబెట్‌ పీఠభూమి ప్రాంతంలో సంక్లిష్టమైన టెక్టానిక్‌ ఫలకాలపై ఉన్నందున మయన్మార్‌కు భూకంప ముప్పు ఎక్కువే. ఇక్కడ హెచ్చు తీవ్రతతో కూడిన భూకంపాలు పరిపాటి. భూమి పై పొరలోని ఇండో, బర్మా టెక్టానిక్‌ ఫలకాలు సమాంతరంగా కదలడమే తాజా భూకంపానికి కారణమని సైంటిస్టులు తేల్చారు. భూ ఫలకాల అంచులను ఫాల్ట్‌గా పిలుస్తారు. లక్షలాది ఏళ్ల కింద భారత ఉపఖండం ఆసియాను ఢీకొట్టడం వల్ల ఏర్పడ్డ సాగయింగ్‌ ఫాల్ట్‌గా పిలిచే పగుళ్ల వెంబడే తాజా భూకంపం చోటుచేసుకుంది. ఇక్కడ టెక్టానిక్‌ ఫలకాలు ఏటా 0.7 అంగుళాల చొప్పున పరస్పర వ్యతిరేక దిశలో కదులుతున్నాయి. ఫలితంగా పుట్టుకొచ్చే ఒత్తిడి భూకంపాలుగా మారుతుంటుంది. ఇక్కడ దశాబ్దానికి ఒక్క భారీ భూంకంపమన్నా నమోదవుతుంటుంది. మయన్మార్‌లో గత వందేళ్లలో 6కు మించిన తీవ్రతతో 14కు పైగా భూకంపాలు నమోదయ్యాయి. 1946లో 7.7, 1956లో 7.1 తీవ్రతతో భూకంపాలు వచ్చాయి. 1988 నాటి భూకంపానికి వేలాది మంది బలయ్యారు. 2011, 2016ల్లో కూడా 6.9 తీవ్రతతో భూకంపాలొచ్చాయి. 👉ప్రకృతి ప్రకోపానికి చిగురుటాకుల్లా వణికిపోయిన థాయ్‌లాండ్, మయన్మార్‌మార్చి 28 శుక్రవారం మధ్యాహ్నం మయన్మార్‌లో 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం ఇటు మయన్మార్‌లో.. 7.4 తీవ్రతతో సంభవించిన ప్రకంపనలు అటు థాయ్‌లాండ్‌లోనూ భారీ విధ్వంసం సృష్టించాయి. మయన్మార్‌లో 6.4 తీవ్రతతో మరోసారి భూమి కంపించగా తర్వాత కూడా మరో నాలుగైదు ప్రకంపనాలు వణికించాయి. ఇటు మయన్మార్‌లో.. అటు థాయ్‌ రాజధాని బ్యాంకాక్‌లో భారీ భవనాలు కళ్లముందే పేకమేడల్లా కుప్పకూలాయి. మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి

inter caste marriage Life Ends in karimnagar7
ప్రేమ.. పరువు.. ఆత్మహత్య.. హత్య!

ప్రేమ.. త్యాగం నేర్పుతుంది అంటారు. కానీ.. యువతీ, యువకుల మధ్య చిగురించిన ప్రేమ బలికోరుతోంది. సామాజిక సమీకరణాలు కుదరక కులాల కుంపటి రాజుకుంటోంది. గ్రామాల్లో ఈ పోకడ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాము కనీ, పెంచిన పిల్లలు తమకు దక్కకుండా పోతారన్న భయం, పరువు పోతుందన్న ఆందోళనలో తల్లిదండ్రులు తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. .. ఇవి హత్యల వరకు దారితీస్తున్నాయి. మరోపక్క తమ ప్రేమను తల్లిదండ్రులు అంగీకరించన్న భయంతో ప్రేమికులు ప్రాణత్యాగాలు చేసుకుంటున్నారు. దురదృష్టవశాత్తూ ఉమ్మడి జిల్లాలో ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతుండగా.. సామాజిక అంతరాలకు అద్ధం పడుతున్నా యి. వేర్వేరు కులాల యువతీ, యువకులు ప్రేమించుకుంటే వారిపై దాడులు సహజమే అయినా.. అది చంపుకునేదాకా వెళ్తుండడమే ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు ఉత్తరాదికే పరిమితమైన ఈ పోకడ ఉమ్మడిజిల్లాకు పాకడం గమనార్హం.పంతాలతో కుటుంబాలు నాశనంసామాజిక కట్టుబాట్లను ఛేదించలేక, అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లల ప్రేమను అంగీకరించలేక పెద్దలు తీసుకుంటున్న తీవ్ర నిర్ణయాలు ఆయా కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయి. కుటుంబ పెద్ద జైలుకు వెళ్లడంతో ఆర్థికంగా చితికిపోతున్నా యి. వాస్తవానికి ఏ సమాజంలో ఏ పరువు కోసం హత్యలు చేస్తున్నారో.. తరువాత అదే సమాజం ఆయా కుటుంబాలకు అండగా నిలబడని విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో యుక్తవయసులో ప్రేమే సర్వస్వం అంటూ జీవితంలో స్థిరపడక ముందే ప్రేమ వ్యవహారాల్లో చిక్కుకొని ప్రాణాలు తీసుకుని, తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగుల్చుతున్నారు.ఉమ్మడి జిల్లాలోని పలు ఘటనలు⇒ మార్చి 27న పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోటకు చెందిన సాయికుమార్‌ను అదే గ్రామానికి చెందిన ముత్యం సద య్య తన కుమార్తెను ప్రేమిస్తున్నాడని గొడ్డలితో నరికి చంపడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. కేవలం కులాలు వేరన్న కా రణమే సాయిని చంపేలా చేసింది.⇒ ఇల్లందకుంట యువకుడు, నిర్మల్‌ జిల్లాకు చెందిన యువతి ప్రేమించుకున్నారు. పెద్దల ఆమోదం ఉండదన్న ఆందోళనతో మార్చి 17న జమ్మికుంట పరిధిలోని రైల్వేస్టేషన్‌లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.⇒ మార్చి 6న చొప్పదండికి చెందిన ప్రేమికులు ఇంట్లోవారు తమ ప్రేమను అంగీకరించరన్న భయంతో కరీంనగర్‌లో స్నేహితుడి ఇంట్లో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు.⇒ 2024 ఏప్రిల్‌లో తాను అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు కులాంతర వివాహం చేసుకుని వెళ్లిపోయిందన్న బాధతో సిరిసిల్ల జిల్లాలో ఓ తండ్రి తన కుమార్తెకు పిండ ప్రదానం చేశాడు. తమ ఆశలను అడియాశలు చేసిన కూతురు మరణించిందని ఫ్లెక్సీ పెట్టించడం సంచలనంగా మారింది.⇒ 2023 నవంబరులో సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలానికి చెందిన ప్రేమికులు విషం తాగి ప్రాణాలు తీసుకున్నారు.⇒ 2023 ఆగస్టులో కోరుట్ల పట్టణంలో తన ప్రియుడితో పరారయ్యే క్రమంలో ప్రియురాలు తన అక్కనే హత్య చేసి పరారవడం కలకలం రేపింది.⇒ 2021 ఆగస్టులో మంథనికి చెందిన ఓ ప్రేమజంటపై యువతి తండ్రి హేయంగా దాడి చేశాడు. ఈ దాడిలో ప్రేమికులు తృటిలో చావు నుంచి తప్పించుకున్నారు. ⇒ 2017లో మంథనిలో మధుకర్‌ అనే దళిత యువకుడి అనుమానాస్పద మరణం కూడా పరువుహత్యగా ప్రాచుర్యం పొందింది. అనుమానాస్పద మరణం అని పోలీసులు, ప్రి యురాలి బంధువులే చంపారని మధుకర్‌ కుటుంబ సభ్యులు ఆరోపించారు. దళితసంఘాలు ధర్నా చేయడంతో మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించారు. అప్పట్లో ఇది జాతీయస్థాయిలో చర్చానీయాంశంగా మారింది. ఈ కేసు ఇంకా తేలాల్సి ఉంది.⇒ 2016లో తిమ్మాపూర్‌లోని ఓ గుడిలో ప్రేమ వివాహం చేసుకునేందుకు పీటల మీద కూర్చున్న జంటపై యువతి బంధువులు దాడి చేశారు. పెళ్లికూతురు కళ్లముందే పెళ్లి కొడుకును విచక్షణా రహితంగా పొడిచి చంపడం కలకలం రేపింది.ఆలోచన తీరు మారాలి కులం అహంకారంతో జరిగే దారుణాలతో ప్రాణాలుపోతున్నాయి. టెక్నాలజీలో ముందున్న మనం ఆధునికంగా ఆలోచించలేక పోతున్నాం. ఉన్నత చదువులు చదువుకునే..యువత కూడా ప్రేమించుకోవడం.. కాదన్నారని ప్రాణాలు తీసుకోవడం తగదు. ఈ ఘటనలకు కేవలం ఆలోచన తీరే కారణం. తీరుమారితే విపరీత ధోరణులు మారుతాయి. – ప్రొఫెసర్‌ సూరేపల్లి సుజాత,సోషియాలజీ విభాగం అధిపతి, శాతవాహన వర్సిటీకుల వివక్షపై అవగాహన కల్పించాలి సమాజంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నా కుల,మత భేదాలు గ్రామాల్లో అలాగే కొనసాగుతున్నాయి. కులాల మధ్య వైరుధ్యాలు పెరిగేలా ప్రభుత్వాలు కులాల ఆధారంగా ప్రవేశపెడుతున్న పథకాలు ప్రజల మధ్య దూరాలను పెంచుతున్నాయి. పిల్లల ప్రేమ కన్నా పరువు, పట్టింపులే ఎక్కువ అనే భావన తొలిగేలా, కులవివక్షపై ప్రజలకు అవగాహన కలిగించేలా ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది.– కల్లెపల్లి ఆశోక్, కేవీపీఎస్‌ :::సాక్షిప్రతినిధి, కరీంనగర్‌

Ramajogayya sastry and Anantha sriram Talks About ugadi festival8
కొత్త తరానికి చెబుదాం

తెలుగువారి తొలి పండగ వచ్చేస్తోంది. నూతనోత్సాహంతో ఉగాదిని ఆహ్వానించడానికి సిద్ధమవుతున్న వేళ... కొత్త తరానికి పండగల అర్థం తెలుస్తోందా? అంటే... ‘పెద్దవాళ్లు చెబితేనే తెలుస్తుంది’ అంటున్నారు ప్రముఖ రచయితలు రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్‌. ఉగాది ప్రత్యేకంగా ఇంకా ఈ ఇద్దరూ చెప్పిన విశేషాలు తెలుసుకుందాం.పండగలు జరుపుకోవడం ఎవరూ మానేయలేదు. పిండివంటలు చేసుకోవడానికైనా పండగలు చేసుకుంటున్నాం. పండగ పూట తల స్నానం చేసి, ఉగాది పచ్చడి తిన్న తర్వాతే మిగతా పనులు చేయాలని పిల్లలకు పెద్దలు చెప్పాలి. ఎప్పటికప్పుడు కొత్త తరానికి పాత తరంవాళ్లు చెబుతుండాలి. ఎందుకంటే పండగలన్నీ ముందు తరంవాళ్లు చేసుకుంటూ వచ్చారు కాబట్టి చెప్పడం వారి బాధ్యత. కొత్త తరాన్ని పాజిటివ్‌గా స్వాగతించాలి. వారూ వెల్‌కమింగ్‌గానే ఉంటారు. మన తానులో పెరిగిన ముక్కలు వేరేలా ఎలా ఉంటారు? కొత్త తరానికి పద్ధతులన్నీ కొత్తే. పోనీ ఇవాళ్టి పాత తరం అనుకున్నవారికి ఎవరు చెప్పారు? వారి ముందు తరంవారు చెబితేనే కదా వీరికి తెలిసింది. ఇది రిలే పందెంలాంటిది. ఒక తరానికి ఒక తరానికి సక్రమంగా విషయాలను అందజేయాల్సిన బాధ్యత ముందు తరానికి ఉంటుంది. యువతని నిందించడం సరికాదు: ప్రపంచాన్ని రెండు రకాలుగా చూడొచ్చు. మంచి కోణంలో... దుర్గార్మపు కోణంలో... ఎప్పుడూ మొదటి కోణంలో చూస్తే మంచిది. అది కాదనుకుని యువత పెడదారి పట్టిందని, ఏదేదో జరిగిపోతోందని యువతరాన్ని నిందించడం సరికాదు. ఏదీ వక్రీకరించిన కోణంలో చూడొద్దు. ఫారిన్‌ కల్చర్‌ అంటున్నాం... విదేశాలు వెళ్లి చూస్తే ఇక్కడికన్నా ఎక్కువ అక్కడ పండగలు బాగా జరుపుకుంటున్నారు. అన్నమాచార్యుల కీర్తనలు కూడా పాడుతున్నారు. ఇక్కడితో పోల్చితే అమెరికా ఫాస్ట్‌ ఫార్వార్డ్‌ అనుకోవాలి కదా. కానీ అక్కడ మన సంప్రదాయాలు బతికే ఉన్నాయి. ఇక ఎప్ప టికీ ఇండియా రామని తెలిసిన కుటుంబాలు కూడా తమ పిల్లలకు తెలుగు నేర్పిస్తున్నారు... మన సంప్రదాయాల గురించి చెబుతున్నారు. పిల్లలూ నేర్చుకుంటున్నారు. యువతరం బాధ్యతగా ఉంటోంది: సారవంతమైన నేల అది (యువతరాన్ని ఉద్దేశించి). బీజం వేయడం అనేది మన చేతుల్లో ఉంది. ముందు తరం బాధ్యతగా ఉండి, తర్వాతి తరానికి దగ్గరుండి అన్నీ నేర్పించి, అన్నీ ఆచరించేలా చేయాలి. వీళ్లు పాటిస్తూ వాళ్లు పాటించేలా చేయాలి. పొద్దున్నే వీళ్లు స్నానం చేయకుండా... పిల్లలను స్నానం చేసి, పూజలు చేయమంటే ఎందుకు చేస్తారు? నువ్వు చేయడంలేదు కదా? అంటారు. ఒకవేళ మాటల రూపంలో చెప్పకపోయినా... ముందు తరం ఆచారాలు పాటిస్తుంటే వీళ్లు చూసి, నేర్చుకుంటారు... అనుసరించడానికి ఇష్టపడతారు. బోధించే విధానం సక్రమంగా ఉండాలి. ఫైనల్‌గా చెప్పేదేంటంటే... మనం అనుకున్నంతగా యువతరం ఏమీ దిగజారిపోలేదు. చెప్పాలంటే మనకన్నా ఇంకా బాధ్యతగా ఉంటూ, పాతా కొత్తా బ్యాలెన్స్‌ చేసుకుంటూ వెళుతున్నారు. ఈ కాలపు పిల్లలు ఇంటికీ, బయటికీ పర్ఫెక్ట్‌ బ్యాలెన్స్‌ తెలిసినవాళ్లు. వాళ్లలో ఏదైనా లోపం ఉందీ అంటే... చెప్పేవాళ్లదే కానీ వాళ్లది కాదు. సో... ఏ పండగని ఎందుకు జరుపుకోవాలో విడమర్చి యువతరానికి చెప్పాల్సిన బాధ్యత ముందు తరానిదే. సంవత్సరాది ఎందుకు జరుపుకుంటున్నాం? ఉగాది పచ్చడి విశిష్టత వంటివి చెప్పి, పండగ అర్థం తెలియజేయాలి.పండగ‘రుచి’చూపాలి– అనంత శ్రీరామ్‌పండగలు జరుపుకునే తీరు మారింది. పెళ్లిళ్లల్లో ఎప్పుడైతే మనకు లేని రిసెప్షన్‌ అని మొదలుపెట్టామో అలానే పండగలు జరుపుకునే తీరులోనూ మార్పు వచ్చింది. ఉగాది గురించి చెప్పాలంటే... మా ఊరులో ఐదు రోజులు ఉగాది జాతర జరుగుతుంది. మాది వెస్ట్‌ గోదావరి, యలమంచిలి మండలం, దొడ్డిపట్ల గ్రామం. జాతర సందర్భంగా ఊరేగింపులు అవీ చేస్తుంటారు. ఇప్పుడూ జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు జాతరలో భాగంగా మేజిక్‌ షోస్‌ అంటూ వెస్ట్రన్‌ కల్చర్‌ మిక్స్‌ అయిపోయింది. ఉగాది అంటే కవి సమ్మేళనాలు విరివిగా జరిగేవి. ఇప్పుడలా లేదు. ఎవరైనా విద్యావంతులు లేదా శాంతి సమాఖ్యలు వాళ్లు ఏదో టౌన్‌ హాలులో కవి సమ్మేళనాలు ఏర్పాటు చేసినా ఓ ఇరవై ముప్పైమంది ఉంటున్నారు... అంతే. ఉగాది ప్రత్యేకం అమ్మవారి జాతర: ఇక మా ఊరి ఉగాది గురించి చెప్పాలంటే... మాణిక్యాలమ్మ మా గ్రామ దేవత. ఉగాది సమయంలో మాకు ఆ అమ్మవారి జాతర ఉంటుంది. ఉగాది ప్రత్యేకం అంటే ఆ జాతరే. ఐదు రోజులు ఘనంగా చేస్తారు. ఐదో రోజు అయితే అమ్మవారిని బాగా అలంకరించి, ఊరేగించి, తెప్పోత్సవం చేస్తారు. నేను ప్రతి ఏడాది దాదాపు మిస్‌ కాకుండా వెళతాను. ఈసారి కుదరదు. ఆరు రుచులను సమానంగా ఆస్వాదించాలి: ఉగాది పచ్చడిలోని షడ్రుచుల గురించి చెప్పాలంటే... నేను ‘ఒక్కడున్నాడు’ సినిమాలో ‘ఇవ్వాళ నా పిలుపు... ఇవ్వాలి నీకు గెలుపు... సంవత్సరం వరకు ఓ లోకమా...’ అని పాట రాశాను. అది పల్లవి. పాట మొదటి చరణంలో రుచుల గురించి రాశాను. ‘కొంచెం తీపి... కొంచెం పులుపు పంచే ఆ ఉల్లాసమూ... కొంచెం ఉప్పు... కొంచెం కారం పెంచే ఆ ఆవేశమూ... చేదూ వగరూ చేసే మేలూ... సమానంగా ఆస్వాదించమని ఇవ్వాళ నా పిలుపు’ అని రాశాను. ఆరు విభిన్నమైన రుచులను సమానంగా ఆస్వాదిస్తేనే జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలమని చెప్పడమే ఆ పాట ఉద్దేశం. అంటే... జీవితంలో ఎదురయ్యే పరిస్థితులన్నింటినీ సమానంగా స్వీకరించగలగాలి.ఆ బాధ్యత పెద్దవాళ్లదే: ఇక నేటి తరం గురించి చెప్పాలంటే... ఇప్పుడు కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలతో హాలోవెన్‌ అంటూ రకరకాల వేషాలు వేయిస్తున్నారు. వేలంటైన్స్‌ డే అనీ ఇంకా వేరే ఎక్కడెక్కడనుంచో తెచ్చిపెట్టుకున్న పండగలను జరుపుతున్నారు. అయితే పిల్లలకు మన పండగల గురించి చెప్పాలి. వేరే సంబరాలు ఎలా ఉన్నా కూడా మన పండగలకు ఎక్కువప్రాధాన్యం ఇవ్వాలి. ఇలా పాత తరం ఆచరిస్తే కొత్త తరానికి అర్థం అవుతుంది. వాళ్లు మన సంస్కృతీ సంప్రదాయాలను ముందుకు తీసుకెళతారు. మా గ్రామంలో ఉగాది అంటే... ఇంట్లో పిల్లలకు వేప పూత, మామిడికాయలు, చెరుకు గడలు తెమ్మని టాస్కులు ఇచ్చేవారు. అవి తెచ్చే క్రమంలో మాకు పండగలు అర్థమయ్యేవి. అలా మా ముందు తరంవాళ్లు మాకు నేర్పించారు. కొత్త తరానికి మనం అలా నేర్పిస్తే వాళ్లు పాటిస్తారు. ముందు తరాలకు సంస్కృతీ సంప్రదాయాలను నేర్పించే బాధ్యత పెద్దవాళ్లదే.– డి.జి. భవాని

Gold and Silver Price Today March 29th 20259
అమాంతం పెరిగిపోతున్న బంగారం ధరలు: నాలుగు రోజుల్లో..

ఉగాదికి ముందే బంగారం ధరలు తారాస్థాయికి చేరుతున్నాయి. వరుసగా నాలుగో రోజు గోల్డ్ రేటు ఎగిసిపడింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏ ప్రాంతంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలను తెలుసుకుందాంహైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 83,600 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 91,200 వద్ద నిలిచాయి. నిన్న రూ. 1050 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 1140 (24 క్యారెట్స్ 10గ్రా) పెరిగిన గోల్డ్ రేటు.. ఈ రోజు వరుసగా రూ. 200, రూ. 220 పెరిగింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 200, రూ. 220 పెరిగింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 83,600 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 91,200 వద్ద ఉంది.దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 83,750 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 91,350 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 200, రూ. 220 ఎక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు పెరిగినప్పటికీ.. వెండి ధరలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు (మార్చి 29) కేజీ సిల్వర్ రేటు రూ. 1,13,000 చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకే విధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 1,04,000 వద్దనే ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్‌టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

Karnataka Elderly Couple Loses Lakhs To Cyber Fraud Next Did This10
మా వల్ల కావట్లేదు.. ఎవరి దయ మీదా బతకాలనుకోవడం లేదు

బెంగళూరు: వీడియో కాల్‌ చేసి.. ఆపై నగ్నఫొటోలున్నయంటూ బెదిరింపులకు పాల్పడుతున్న ఘటనలు ఈ మధ్య తరచూ చూస్తున్నదే. అయితే అలాంటి సైబర్‌ నేరంలో చిక్కుకుని.. వాళ్ల బెదిరింపులకు భయపడి వృద్ధ దంపతులు బలవన్మరణానికి పాల్పడిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. పైగా అప్పటికే రూ.50 లక్షలు చెల్లించిన ఆ జంట.. ఇంకా చేసేది లేక ఈ ఘాతుకానికి దిగింది.బెళగావి జిల్లా ఖానాపుర తాలూకా బీడి గ్రామంలో గ్రామంలో విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి డియోగో నజరత్‌(83), పావీయా నజరత్‌(79) దంపతులు నివాసం ఉంటున్నారు. గత రెండు రోజులుగా ఇంటినుంచి ఎంతకూ బయటకు రాకపోవడంతో స్వసహయ సంఘం మహిళలు వెళ్లి చూడగా.. విగతజీవులుగా కనిపించారు. సమాచారం అందుకున్న నందగడ పోలీసులు వచ్చి పరిశీలించారు. డియోగో గొంతు, మణికట్టు వద్ద కత్తి కోసిన గాయం కనిపించింది. ఘటన స్థలంలో సూసైడ్‌ నోట్‌ లభించింది. దీంతో మృతదేహాలను పోస్టుమార్టం కోసం బీమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ‘‘నా వయసు 82 ఏళ్లు.. నా భార్య వయసు 79 సంవత్సరాలు. ఈ వయసులో మాకు ఆదుకోవడానికి ఎవరూ లేరు. సమాజంలో ఎంతో గౌరవంగా ఇంతకాలం బతికాం. కానీ, ఇప్పుడు ఈ వేధింపులు భరించలేకపోతున్నాం. ఎవరిని సాయం అడిగి.. ఎవరి దయ మీదా బతకాలనీ అనుకోవడం లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని డియోగో స్వదస్తూరితో రాసిన లేఖ అది. నెల రోజులుగా వేధింపులు.. సూసైడ్‌ నోట్‌ ఆధారంగా కీలక విషయాలు వెలుగు చూశాయి. దంపతులను సైబర్‌ నేరగాళ్లు నెల రోజులుగా వేధిస్తున్నారు. తాము పోలీసులమంటూ పరిచయం చేసుకున్నారు. మా వద్ద మీ నగ్న చిత్రాలున్నయంటూ ఫోన్‌లో బెదిరించారు. అడిగినంత డబ్బులు ఇవ్వకంటే ఆ చిత్రాలను సామాజిక మాధ్యమాలలో వైరల్‌ చేస్తామంటూ బెదిరించారు. ఆ వేధింపులు తాళలేక రూ.50 లక్షలు చెల్లించారు. అయినా మరింత నగ­దు కావాలని ఒత్తిడి చేశారు. దీంతో బలవన్మరణానికి పాల్పడాలని నిర్ణయించుకున్నారు. పావీయా నిద్ర­మాత్రాలు మింగి ఆత్మహత్య చేసుకుంది. డియాగో డెత్‌నోట్‌ రాసి చాకుతో గొంతు కోసుకోని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటన స్థలాన్ని బెళగావి జిల్లా ఎస్పీ పరిశీలించి కేసు దర్యాప్తులో ఉందని వెల్లడించారు.లేఖలో.. సుమిత్రా బిర్రా, అనిల్‌ యాదవ్‌ అనే ఇద్దరి పేర్లను డియాగో ప్రస్తావించారు. తాను న్యూఢిల్లీ నుంచి టెలికామ్‌ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్నానని సుమిత్రా , అనిల్ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసుగా పరిచయం చేసుకుని మరీ బెదిరింపులకు దిగారట. నగ్నఫోల్‌కాల్స్‌ ఉన్నాయని.. సిమ్‌ కార్డ్‌ దుర్వినియోగం కింద చట్టపరమైన చర్యలు ఉంటాయని బెదిరించారట. అయితే.. అప్పటికే రూ.50 లక్షలు చెల్లించామని.. ఇంకా కావాలని డిమాండ్‌ చేశారని.. బంగారం మీద రుణం కూడా తీసుకుని చెల్లించామని లేఖలో డియాగో వాపోయాడు. స్నేహితుల వద్ద నుంచి తెచ్చిన అప్పును తన భార్య నగలు అమ్మి చెల్లించాలని సూసైడ్‌ నోట్‌లో కోరిన డియాగో.. తమ ఇద్దరి మృతదేహాలను మెడికల్‌ కాలేజీకి అప్పగించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశాడు.ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement