
టీవీ.. సినిమా.. ఓటీటీ స్క్రీన్స్‌కి న్యూ ఫేస్ కాదు.. గ్లామర్ ఫీల్డ్‌కి న్యూ నేమ్ కాదు. ఆ ఫేమ్ కూడా ఆమెకు కొత్త కాదు. బాల నటిగా.. మోడల్‌గా.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా చిన్న వయసులోనే ఎంతో ఘనతను సాధించేసింది అనుష్కా సేన్.

అనుష్కా పుట్టింది రాంచీ (జార్ఖండ్)లో. పెరిగింది ముంబైలో. నాన్న.. అనిర్వాణ్ సేన్, బయోమెడికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్. అమ్మ.. రాజ్‌రూపా సేన్, గృహిణి. కూతురి ఉన్నతి వెనుకున్నది ఆ ఇద్దరే! అనుష్కా ప్రస్తుతం.. సినిమాటోగ్రఫీలో డిగ్రీ చదువుతోంది.

చైల్డ్ ఆర్టిస్ట్‌గా జీటీవీ ‘యహా మై ఘర్ ఘర్ ఖేలీ’ అనే సీరియల్‌తో పరిచయం అయింది. ‘దేవోంకా దేవ్ మహాదేవ్’లో బాల పార్వతి, ‘బాల్ వీర్’లో మెహెర్ పాత్రతో పాపులర్ అయింది.

తర్వాత క్రికెటర్ ధోనీతో కలసి చేసిన ఒక కమర్షియల్ యాడ్‌తో మరింత ఫేమస్ అయింది. అంతేకాదు ఆ యాడ్‌తో ధోనీకి ఆమెకూ మధ్య చిక్కీ అండ్ చాచూ (చిక్కీ అండ్ బాబాయ్)గా అనుబంధమూ బలపడింది.

చైల్డ్ ఆర్టిస్ట్‌గానే అనుష్కా ‘క్రేజీ కుక్కడ్ ఫ్యామిలీ’తో బాలీవుడ్‌లోకి ఎంటర్ అయింది. దాని తర్వాత కొంత గ్యాప్ తీసుకుని చదువు మీద శ్రద్ధ పెట్టింది. 2018లో ‘ఇంటర్నెట్ వాలా లవ్’తో మళ్లీ బుల్లితెర మీద కనిపించసాగింది.

యంగ్ ఆర్టిస్ట్‌గా అనుష్కాకు కీర్తి సంపాదించిపెట్టిన సీరియల్ ‘ఝాన్సీ కీ రాణీ’. అందులో ఆమెది టైటిల్ రోల్! ‘లిహాఫ్ .. ద క్విల్ట్’ అనే సినిమాలో అనుష్కా సేన్ యుక్తవయసు ఇస్మత్ చుగ్తాయ్‌గా నటించింది. అది ఆమెకు మంచి నటిగా గుర్తింపునిచ్చింది.

ఓ వైపు సీరియళ్లు, సినిమాలు చేస్తూనే ఇంకో వైపు వీడియో ఆల్బమ్స్‌లోనూ తన అభినయ కళను చాటసాగింది. ఇటు ఓటీటీ అవకాశాలూ వరుసకట్టాయి. అలా ‘క్రాష్’, ‘స్వాంగ్’ సిరీస్‌లలో నటించింది.

తాజాగా ‘దిల్ దోస్తీ డైలమా’లోనూ ప్రధాన భూమిక పోషించింది. అందులోని ఆమె నటన అభిమానులవే కాదు విమర్శకుల ప్రశంసలూ అందుకుంటోంది. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో స్ట్రీమ్ అవుతోంది.

అనుష్కా సినిమాలు, సీరియళ్లు, సిరీస్‌లకే కాదు సోషల్ మీడియా పోస్ట్‌లకూ వీర ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. లక్షల్లో సబ్‌స్క్రైబర్స్, కోట్లలో ఫాలోవర్స్‌తో చిన్నవయసులోనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారింది.

ఈ పాపులారిటే ఆమెకు కొరియన్ సినిమా చాన్స్‌నూ తెచ్చిపెట్టింది. అలా అనుష్కా ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయిపోయింది.

