
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్నాడు.

లంకతో టీ20 సిరీస్ జట్టుకు ఎంపికైన అతడు తొలి మ్యాచ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. రెండో టీ20లో మాత్రం అదరగొట్టాడు.

రెండు కీలక వికెట్లు తీయడంతో పాటు.. తొమ్మిది బంతుల్లోనే 22 పరుగులు చేసి దుమ్ములేపాడు.

ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రాణించి టీమిండియా లంకపై టీ20 సిరీస్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు ఈ వరల్డ్‌కప్ చాంపియన్.

ఈ క్రమంలో మంగళవారం నాటి నామమాత్రపు టీ20కి పాండ్యా సిద్ధమవుతున్నాడు. ఇదిలా ఉంటే.. ఈరోజు(జూలై 30)కు హార్దిక్ పాండ్యా జీవితంలో ప్రత్యేక స్థానం ఉంది.

అతడి కుమారుడు అగస్త్య పుట్టినరోజు నేడు.

ఈ నేపథ్యంలో తన ముద్దుల కుమారుడితో ఉన్న వీడియో షేర్ చేసిన హార్దిక్ పాండ్యా.. ‘‘నేను ఇలా ముందుకు సాగుతున్నానంటే అందుకు కారణం నువ్వే.

నా పార్ట్‌నర్ ఇన్ క్రైమ్. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నా మనసంతా నీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది ఆగూ..! నీపై నాకున్న ప్రేమను వర్ణించేందుకు మాటలు చాలవు’’ అంటూ ఉద్వేగపూరిత క్యాప్షన్ జతచేశాడు.

అగస్త్యను ఎంతగానో మిస్సవుతున్నానని చెప్పకనే చెప్పాడు.

కాగా సెర్బియా మోడల్ నటాషా స్టాంకోవిక్‌ను హార్దిక్ పాండ్యా ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే. ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఏకంగా మూడుసార్లు పెళ్లి చేసుకుంది.

అయితే, కాలక్రమంలో ఇద్దరి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి.

ఈ నేపథ్యంలో నాలుగేళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ విడాకులు తీసుకున్నారు.

ఇటీవలే ఇందుకు సంబంధించి హార్దిక్ పాండ్యా- నటాషా అధికారిక ప్రకటన విడుదల చేశారు.

అనంతరం కుమారుడు అగస్త్యను తీసుకుని నటాషా సెర్బియాలోని తన పుట్టింటికి వెళ్లిపోగా.. హార్దిక్ పాండ్యా టీమిండియాతో పాటు శ్రీలంకలో ఉన్నాడు.

ఇక అంతకుముందు టీ20 ప్రపంచకప్-2024లో భారత్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత.. స్వదేశానికి వచ్చిన అనంతరం అగస్త్యతో కలిసి తన ఇంట్లో సంబరాలు చేసుకున్నాడు హార్దిక్.

