
హైదరాబాద్: పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ గత కొంత కాలంగా భారత క్రికెట్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. పలు చిరస్మరణీయ విజయాల్లో భాగంగా ఉన్న అతను టి20 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో కూడా సభ్యుడు.

ఎంతో మంది యువ ఆటగాళ్లతో పోలిస్తే అతని ప్రస్థానం ఎంతో ప్రత్యేకం. పేదరిక నేపథ్యం, ఆటోడ్రైవర్‌గా పని చేసే తండ్రి, కనీస ఖర్చులకు కూడా ఇబ్బంది పడే స్థితి నుంచి అతను అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదిగాడు.

ఒకదశలో షూస్ కూడా కొనుక్కోలేకపోయిన అతను డబ్బుల కోసం టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడేవాడు. ఆ తర్వాత కేవలం తన కఠోర శ్రమ, పట్టుదలతో పైకి ఎదిగాడు.

ఇప్పుడు అలాంటి సిరాజ్‌లను వెతికి సానబెట్టేందుకు భారత మాజీ క్రికెటర్, మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రత్యేకంగా నగరంలోని పాతబస్తీలో ఉన్న పేద పేస్ బౌలర్ల కోసం ఒక ప్రతిభాన్వేషణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

‘హూ ఈజ్ అవర్ నెక్స్‌ట్ సిరాజ్’ పేరుతో ఈ కార్యక్రమం ఎమ్మెస్కే ప్రసాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎంఎస్‌కేఎస్‌ఐసీఏ) ఆధ్వర్యంలో జరిగింది.

దీనికి స్వయంగా సిరాజ్ హాజరై తన అనుభవాలను పంచుకున్నాడు. కెరీర్‌లో ఎదిగే క్రమంలో తనకు ఎదురైన కష్టాలను గుర్తు చేసుకున్న అతను... ప్రతిభావంతులైన కుర్రాళ్లు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని భవిష్యత్తులో గొప్ప బౌలర్లుగా ఎదగాలని ఆకాంక్షించాడు.

అత్తాపూర్‌లోని విజయానంద్ గ్రౌండ్స్‌లో జరిగిన ఈ ప్రతిభాన్వేషణ కార్యక్రమాన్ని హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ ప్రారంభించారు.






