15 Years Of Sakshi
-
సాక్షి 15 ఏళ్ల పండగ: ఆన్లైన్ క్విజ్ విజేతల వివరాలు ఇవే!
సాక్షి దినపత్రిక 15ఏళ్లు పూర్తి చేసుకుని 16వ ఏట ప్రవేశించిన శుభతరుణంలో పాఠకుల కోసం ఒక క్విజ్ నిర్వహించింది. ఆరు రోజుల పాటు ఆరు ప్రశ్నలను ఆన్లైన్లో అడిగింది. వందలాది మంది పోటీ పడ్డ ఈ క్విజ్‌లో అన్ని ప్రశ్నలకు పది మంది మాత్రం సరైన సమాధానాలు చెప్పి విజేతలుగా నిలిచారు. క్విజ్‌లో గెలుపొందిన వారి వివరాలు 1. పి. నిర్మలా స్వరూప రాణి, వృత్తి: గృహిణి, చిరునామా: లక్ష్మణ రావు పల్లి వీధి, ఆత్మకూరు గ్రామం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూర్, ఆంధ్రప్రదేశ్ 544322. 2. టి. రాంబ్రహ్మా చారి, వృత్తి: ప్రైవేటు ఉద్యోగి, చిరునామా: పిల్లిచిన్నకృష్ణ తోట, ఖమ్మం, తెలంగాణ 507003. 3. పంట నరసింహులు, వృత్తి : జిరాక్స్ వ్యాపారం, చిరునామా : నూకినేనిపల్లె గ్రామం, నందలూరు, వై.యస్.ఆర్ కడప,ఆంధ్రప్రదేశ్ 516151 4. మిన్నంరెడ్డి అంకిత, చిరునామా :పీలేరు గ్రామం, అన్నమయ్య, ఆంధ్రప్రదేశ్ 517214 5. కె సతీష్ బాబు, చిరునామా : ఇందిరానగర్ గ్రామం, వై.యస్.ఆర్ కడప,ఆంధ్రప్రదేశ్ 516004 6. దేరంగుల దేవి, వృత్తి :గృహిణి, చిరునామా: పులివెందుల గ్రామం, వై.యస్.ఆర్ కడప, ఆంధ్రప్రదేశ్ 516390 7. బాలనాగు సంతోష్ కుమార్, వృత్తి ప్రైవేట్ ఉద్యోగం, చిరునామా : న్యూ నాగోల్,రోడ్ నెంబరు-6, అలకాపురి, హైదరాబాద్-500035 8. M.రాధ, వృత్తి: గృహిణి, చిరునామా :2-887, ప్రశాంతి నగర్-2, పీలేరు పోస్ట్, చిత్తూరు రోడ్, అన్నమయ్య జిల్లా, ఆంధ్రప్రదేశ్-517214 9. గుడి ఉమా మహేశ్వరి, వృత్తి: ప్రైవేట్ ఉద్యోగం, చిరునామా: చింతల్,భగత్‌సింగ్ నగర్,రంగారెడ్డి జిల్లా,హైదరాబాద్-500054 10. వర చిట్టిరాజు, వృత్తి: డ్రైవర్, చిరునామా: రాజీవ్ కాలనీ, కొవ్వూరు, తూర్పుగోదావరి, ఆంధ్రప్రదేశ్-534350 -
పదిహేను వసంతాలు పూర్తి చేసుకున్న సాక్షి
పదిహేను వసంతాలు పూర్తి చేసుకున్న సాక్షి -
Sakshi 15th Anniversary: సినీ ప్రముఖుల శుభాకాంక్షలు
‘సాక్షి’ ప్రారంభమై పదిహేనేళ్లు అయిందంటే నమ్మలేకపోతున్నాను. ప్రారంభ వేడుకకి మొన్న మొన్నే వెళ్లినట్లుగా అనిపిస్తోంది. ఆ వేడుక ఇంకా గుర్తుంది. ‘సాక్షి’కి నా ప్రత్యేక అభినందనలు’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్. ‘సాక్షి’ దినపత్రిక ఆరంభమై నేటితో 15 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా అల్లు అరవింద్ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘సాక్షి’ పదిహేనేళ్లు పూర్తి చేసుకుంది. ఇంకా బ్రహ్మండంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను’’ అన్నారు నిర్మాత అచ్చిడ్డి. ‘‘సాక్షి’ ఇలాంటి విజయవంతమైన వసంతాలను ఎన్నో చూడాలి’’ అన్నారు కన్నడ హీరో శివరాజ్‌కుమార్. ‘సాక్షి’ పదిహేనేళ్లు పూర్తి చేసుకుని, పదహారో ఏడాదిలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా శుభాకాంక్షలు’’ అన్నారు దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి. ‘‘తెలుగు ప్రేక్షకులకు అద్భుతమైన వాస్తవాలను అందించాలని, స్ఫూర్తినిచ్చే వార్తలు ఇవ్వాలనే ప్రజాసంకల్పాన్ని ధ్యేయంగా చేసుకుని అందులో విజయం సాధిస్తూ, ప్రతి ఏడాది ప్రజలకు మరింత చేరువవుతున్నందుకు అభినందనలు’’ అన్నారు నిర్మాత కె.అచ్చిరెడ్డి. ఇంకా హీరోలు ‘అల్లరి’ నరేశ్, అది సాయికుమార్, కార్తికేయ, విశ్వక్ సేన్, కిరణ్ అబ్బవరం, నటులు తనికెళ్ల భరణి, సుమన్, సాయికుమార్, ‘సీనియర్’ నరేశ్, అలీ, దర్శకులు కృష్ణవంశీ, బి.గోపాల్, నందినీ రెడ్డి, నిర్మాతలు సి.కల్యాణ్, ‘దిల్’ రాజు, రచయిత పరుచూరి గోపాలకృష్ణ, రచయిత, నిర్మాత కోన వెంకట్ తదితరులు ‘సాక్షి’కి శుభాకాంక్షలు తెలిపి, మరిన్ని విజయవంతమైన వసంతాలను చూడాలని ఆకాంక్షించారు. -
15 ఏళ్ల ప్రయాణం..ఈ అనుబంధం నిరంతరం..
-
జన హృదయాల్లో ‘సాక్షి’ చెరగని ముద్ర
కనిగిరి రూరల్: అన్ని వర్గాల ప్రజలకు బాసటగా నిలుస్తూ.. తెలుగు పత్రికా రంగంలో సంచలనంగా ఆవిర్భవించి.. అడుగులు ముందుకు వేసిన ‘సాక్షి’ 15 వసంతాలు పూర్తి చేసుకుని, 16వ ఏట అడుగు పెట్టింది. నిఖార్సైన జర్నలిజానికి నిలువుటద్దంగా నిలిచింది. తెలుగు ప్రజల్లో ‘సాక్షి’ చెరగని ముద్ర వేసుకుంది. ఈ 15ఏళ్లలో ఎన్నోకథనాలను ప్రచురించింది. అందులో కొన్ని.. ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతంలో ఫ్లోరైడ్ నీటి వల్ల ప్రజలు కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారనే విషయంపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. దీనిపై 2017 జనవరిలో ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ కనిగిరి నియోజకవర్గంలోని పీసీపల్లిలో దీక్ష చేపట్టారు. ఆ వెంటనే అప్పటి టీడీపీ ప్రభుత్వం కనిగిరిలో డయాలసిస్ సెంటర్ మాత్రమే ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంది. చదవండి: పూర్తి చేసేది మేమే వైఎస్ జగన్ సీఎం కాగానే ఏకంగా 17 డయాలసిస్ మిషన్లు ఏర్పాటు చేశారు. మార్కాపురం, ఒంగోలు రిమ్స్‌లో డయాలసిస్ మిషన్ల సంఖ్యను భారీగా పెంచారు. సమస్య మూలాలపై దృష్టి సారించి కృష్ణా జలాలు అందించేందుకు శ్రీకారం చుట్టారు. రూ.130 కోట్లతో ఏఐఐబీ స్కీం కింద కనిగిరి పట్టణానికి సమగ్ర మంచి నీటి పథకం మంజూరు చేశారు. ప్రస్తుతం పనులు వేగంగా జరుగుతున్నాయి. రూ.400 కోట్లతో నియోజకవర్గంలోని ఆరు మండలాల్లోని 442 గ్రామాలకు సురక్షిత జలాలను అందించేందుకు వాటర్ గ్రిడ్ పథకాన్ని మంజూరు చేశారు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో నీటిని సరఫరా చేస్తున్నారు. -
ప్రజల పక్షాన గళమెత్తిన ‘సాక్షి’: సోమేశ్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ‘సాక్షి’ ఆధ్వర్యంలో కమిషనర్‌తో గతంలో ‘ఫోన్ ఇన్’ కార్యక్రమం జరిగింది. ప్రజల నుంచి వెల్లువెత్తిన ఫిర్యాదులకు స్పందిస్తూ అప్పటి జీహెచ్ఎంసీ కమిషనర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ప్రజలందరికీ తేలిగ్గా గుర్తుండిపోయేలా 24 గంటలు పనిచేసే కాల్‌సెంటర్ నంబర్‌ను అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. అలా అందుబాటులోకి వచ్చిందే జీహెచ్ఎంసీ కాల్‌సెంటర్ నంబర్ 040–21 11 11 11. అంతేకాదు.. ఆ రోజు ప్రజల నుంచి వచ్చిన పలు ఫిర్యాదులతో పాటు కొన్ని సూచనలూ ఉన్నాయి. అలా అందిన సూచనల్లోంచి అమలు చేస్తున్నవే తడి–పొడి చెత్త వేరు చేయడం, కొన్ని మొక్కలైనా పెంచాలని ఇంటి నిర్మాణ అనుమతుల నిబంధనల్లో పొందుపరచడం తదితరమైనవి. ఏయే ప్రాంతంలో పారిశుద్ధ్య బాధ్యతలెవరివో ప్రజలందరికీ తెలిసేలా స్థానికంగా బోర్డులు ఏర్పాటు చేస్తామనీ అప్పుడే ప్రకటించారు. నగరంలోని శ్మశాన వాటికల్లో దశలవారీగా మెరుగైన సదుపాయాలు కల్పిస్తామన్నారు. అలా ఏర్పాటైందే నగరంలోని మొదటి ‘మహాప్రస్థానం’. ఇప్పుడు అన్ని జోన్లలోనూ మహా ప్రస్థానాలు అందుబాటులోకి వస్తున్నాయి. కోవిడ్ తరుణంలో కాల్‌సెంటర్‌కు ఫోన్ చేసిన వారికి ఇళ్లవద్దకే అన్నపూర్ణ భోజనాలు పంపిణీ చేశారు. అలా ఆపత్కాలంలో లక్షల మందికి ఆకలి బాధ తీరింది. నిర్మొహమాటంగా.. పారిశుద్ధ్యం తదితర అంశాల్లో అధికారుల పనితీరు బాగాలేదని సైతం ఆనాటి కార్యక్రమంలో ప్రజలు నిర్మొహమాటంగా కుండబద్దలు కొట్టారు. ఆయా సమస్యలపై గళమెత్తారు. అన్నింటినీ సావధానంగా విన్న అప్పటి కమిషనర్ ‘నేను సోమేశ్‌కుమార్‌ను మాట్లాడుతున్నాను’ అంటూ ప్రజలతో కలిసిపోయారు. ఇలాంటి వేదికల ద్వారానే ప్రజాభిప్రాయం తెలుస్తుందని, వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అభిప్రాయపడ్డారు. ఫిర్యాదులతో పాటు సూచనలు కూడా రావడం ముదావహమన్నారు. ప్రజాభిప్రాయానికనుగుణంగా తగిన చర్యలు చేపట్టారు. ఆనాడే వినియోగంలోకి.. ప్రస్తుతం గ్రేటర్ నగరంలో ఏ సమస్యకైనా, ఫిర్యాదుకైనా ప్రజలు ఫోన్ చేస్తున్న నెంబర్ ఆనాడు వినియోగంలోకి తెచ్చిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు రోడ్లపై చెత్త నుంచి వెలగని వీధి దీపాలు, ఆహార కల్తీ, రోడ్లపై గుంతలు, దోమలు, వరద ముంపులు.. ఇలా సమస్య ఏదైనా కార్యాలయాల దాకా వెళ్లకుండా ప్రజలు తమ సమస్యలను విన్నవించేందుకు అందుబాటులో ఉన్న నెంబర్. ఫిర్యాదును స్వీకరించే సిబ్బంది సంబంధిత అధికారులకు సమస్య చేరవేస్తారు. వివరాలన్నీ ఆన్లైన్లో నమోదవుతాయి. ప్రజలు తమ గోడు తెలిపేందుకు ఒక మార్గం లభించింది. అనంతరం మొబైల్ యాప్ వంటివి సైతం తీసుకొచ్చారు. -
Sakshi 15th Anniversary: ఈ అనుబంధం నిరంతరం!
ఉగాదులు ఏటేటా వస్తూనే ఉంటాయి. ఎన్ని మధురోహలను అవి మిగిల్చి వెళ్తున్నాయన్నదే ముఖ్యం. ఉషస్సులు రోజూ పూస్తూనే ఉంటాయి. వాటి కాంతులు ఎన్ని క్రాంతుల్ని వెలిగించాయన్నదే ప్రధానం. పుట్టిన ప్రతి జీవికీ కాలంలో ఒక కొలమానం ఉంటుంది. జట్టు కట్టిన ప్రతి సంస్థకు కూడా ఆయుర్దాయం లెక్కలుంటాయి. ఆ కొలమానాలు, ఆయుర్దాయాలు దస్తావేజుల కోసం మాత్రమే. ఎంతకాలం బతికామన్నది కాదు, ఎలా బతికామన్నది ముఖ్యం. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ముఖ్యం. వ్యక్తికైనా, వ్యవస్థకైనా ఈ సూత్రం వర్తిస్తుంది. వ్యక్తుల జీవిత లక్ష్యాలను ఎవరికి వారే నిర్ణయించుకుంటారు. ఎంతవరకు విజయం సాధించారో తూకం వేయగల తీర్పరులు కూడా ఎవరికి వారే! వ్యవస్థల లక్ష్యాలను సమష్టి తత్వం నిర్ణయిస్తుంది. ఆ వ్యవస్థల జయాపజయాలపై భాష్యం చెప్పగలిగే వారెవ్వరు? ఆ వ్యవస్థల ద్వారా ప్రభావితమయ్యే విశాల పౌరసమాజం మాత్రమే. వ్యవస్థల పనితీరును బట్టి వాటిలో ఎప్పటికప్పుడు ఆయుష్షును నింపగలిగే ఆక్సిజన్ యంత్రం సమాజం దగ్గరే ఉంటుంది. ‘సాక్షి’దినపత్రిక తెలుగింటి తలుపు తట్టి నేటికి సరిగ్గా పదిహేనేళ్లవుతున్నది. తన పదిహేనేళ్ల కాలగమనంలో ఏ రోజున కూడా మిలియన్ కాపీల మార్కును తగ్గకుండా తలెత్తుకుని నిలబడిన పత్రిక బహుశా ‘సాక్షి’ఒక్కటే! ఏబీసీ లెక్కల ప్రకారం సగటున 12 లక్షల సర్క్యులేషన్‌ను ‘సాక్షి’సాధించింది. ఈ ఒక్క మెతుకు చాలు అన్నం ఉడికిందో లేదో తేల్చడానికి! పన్నెండు లక్షల తెలుగు కుటుంబాల్లో సాక్షి ‘ఫ్యామిలీ’మెంబర్‌గా మారింది. ‘సాక్షి’ని తమ ఇంటి మనిషిగా ఆ కుటుంబాలు నేటికీ సమాదరిస్తున్నాయి. ఒక పత్రికను ప్రజలు ఎందుకు ఇంతగా ఆదరిస్తారు? అందుకు తగిన కారణాలుండాలి కదా! ఉన్నాయి. లక్షలాది కుటుంబాలతో అనుబంధం పెనవేసుకోవడం వెనుక పదిహేనేళ్ల సౌభ్రాతృత్వం ఉన్నది. సంఘీభావం ఉన్నది. సాహచర్యం కొనసాగుతున్నది. తన పాఠక కుటుంబాల్లోని ప్రతి ఉద్వేగాన్ని ‘సాక్షి’పంచుకున్నది. వారి ఆనందంలో కేరింతలు కొట్టింది. దుఃఖంలో కన్నీరు తుడిచింది. వారి పోరాట స్ఫూర్తికి పదును పెట్టింది. విజయాలకు పరవశించింది. కింద పడితే చేయందించింది. అడుగడుగునా తోడునీడగా నిలవడానికి తన శక్తిమేరకు ‘సాక్షి’పని చేసింది. అందుకే ఈ చెక్కుచెదరని ప్రజాదరణ. సమస్యలు వ్యక్తిగతమా... సామూహికమా అన్న తేడాను చూడలేదు. న్యాయమైన పరిష్కారం కోసం బాధితులతో కలిసి నడుం కట్టింది. సిద్దిపేటలో శ్రీనివాస్ అనే ఓ నిరుపేద కరోనాతో కన్నుమూశాడు. భార్యాబిడ్డల్ని అద్దె ఇంటి ఓనర్ గెంటేశాడు. ఇద్దరు బిడ్డలతో అభాగ్యురాలు నడివీధిన నిలబడి రోదించింది. ‘సాక్షి’అండగా నిలబడింది. ప్రభుత్వం తరఫున ఆమెకో గదిని కేటాయింపజేసింది. ఉత్తరాంధ్ర గిరిజన పల్లెల్లో ప్రసవం కోసం గర్భిణులను డోలీల్లో మోసుకొని వెళ్లేవారు. కొండదారుల్లో కిలోమీటర్ల పర్యంతం అలా వెళ్లాల్సి వచ్చేది. అనేకమార్లు దురదృష్టకర మరణాలు కూడా సంభవించేవి. ఈ అమానుషత్వంపై ‘సాక్షి’ఒక ఉద్యమాన్నే నడిపింది. ప్రభుత్వం మారిన వెంటనే స్పందన లభించింది. గర్భిణులను ప్రసవ తేదీకి వారం రోజుల ముందుగానే అతిథిగృహాల్లో చేర్చుతున్నారు. అనంతరం ఆస్పత్రికి పంపించి సుఖప్రసవం జరిగేలా చూస్తున్నారు. ప్రసవం తర్వాత అంబులెన్స్‌ను ఏర్పాటు చేసి తల్లీబిడ్డల్ని ఇంటికి సాగనంపుతున్నారు. ఇవి మచ్చుకు మాత్రమే. ఇటువంటి ఉదాహరణలు ‘సాక్షి’అనుభవంలో కొన్ని వందలున్నాయి. ప్రజల తరఫున ఉద్యమాలకూ, పోరాటాలకు మాత్రమే ‘సాక్షి’పరిమితం కాలేదు. సకుటుంబ సపరివారానికి సలహాదారు పాత్రను కూడా పోషించింది. సాధికారికంగా సలహాలివ్వగలిగే నిపుణులను పరిచయం చేసింది. ఈ పదిహేనేళ్లలో లక్షలాదిమంది విద్యార్థులు, ఉద్యోగార్థులూ తమ ‘భవిత’ను ‘సాక్షి’లో వెతుక్కున్నారు. సివిల్స్, గ్రూప్ 1, 2 వంటి పోటీ పరీక్షలైనా, అకడమిక్ కోర్సులైనా, క్యాట్, గేట్, నీట్, ఐఐటీ, ఎంసెట్ ప్రవేశ పరీక్షలైనా విద్యార్థులు ముందుగా చూసేది సాక్షినే. ఇప్పటికీ ఈ ఒరవడి కొనసాగుతూనే ఉన్నది. డైలీ ఫీచర్స్‌కు కొత్త అర్థాన్ని చెబుతూ ‘ఫ్యామిలీ’పేరుతో ప్రతిరోజూ ఒక ఇంద్రధనుసునే ‘సాక్షి’అందజేస్తున్నది. ఫ్యామిలీ బాస్‌గా ఇల్లాలినే పరిగణిస్తూ, ఆమె కేంద్రకంగానే ఫీచర్స్ కథనాలను రూపొందిస్తున్నది. స్ఫూర్తిదాయకమైన మహిళా విజయాలు, చైతన్యం, ఆర్థిక స్వావలంబన, పిల్లల పెంపకం, పెద్దల కేరింగ్ వంటి అంశాల్లో ఎన్నో అమూల్యమైన కథనాలు ‘సాక్షి’పేజీలను అలంకరించాయి. ఫ్యామిలీ పేజీల శీర్షికలన్నీ కూడా పాఠకులకు కంఠోపాఠమే. మట్టిలోని మాణిక్యాలను వెలికితీసే పనిలో కూడా ‘సాక్షి’నిమగ్నమై పనిచేస్తున్నది. అటువంటి మాణిక్యాలకు ‘సాక్షి’ఎక్సలెన్స్ అవార్డులను అందజేసి గౌరవిస్తున్నది. గుర్తింపు కోరుకోకుండా, ప్రశంసల కోసం పాకులాడకుండా తమ పోరాటాల్లో మునిగి తేలుతున్న ఎంతోమంది రియల్ హీరోలను వెతికి లోకానికి పరిచయం చేస్తున్నందుకు ‘సాక్షి’గర్విస్తున్నది. సుస్థిర సేద్య పద్ధతులు కూడా వ్యవసాయరంగ సంక్షోభ పరిష్కారానికి ఒక మార్గమని బలంగా నమ్మిన ‘సాక్షి’పదిహేనేళ్లుగా తన సాగు‘బడి’లో ఈ పాఠాలను బోధిస్తున్నది. ఈ రోజున తెలుగు రాష్ట్రాల్లోని లక్షలాదిమంది రైతులు పాటిస్తున్న ప్రకృతి సేద్య విధానాల వెనుక తను పోషించిన వైతాళిక పాత్రను ‘సాక్షి’వినమ్రంగా చాటుకుంటున్నది. చిన్నారులకోసం స్పెల్‌బీ, మ్యాథ్స్ బీ వంటి మెదడుకు మేత వేసే కార్యక్రమాలు, యువతరంలో క్రీడా స్ఫూర్తిని నింపడం కోసం ‘సాక్షి ప్రీమియర్ లీగ్’పోటీలు ప్రతిఏటా ‘సాక్షి’నిర్వహిస్తున్నది. ఇలా అన్ని వయసుల ప్రజలకూ, అన్ని శ్రేణుల సమూహాలకు ఉపయుక్తమయ్యే కార్యక్రమాలను భుజాన వేసుకొన్న ‘సాక్షి’నేడు జనం గుండెచప్పుడుగా మారింది. అందుకే ఈ ఆదరణ. ‘సాక్షి’పుట్టుకే ఒక లక్ష్యంకోసం. ‘సాక్షి’వ్యవస్థాపకులు వైఎస్ జగన్మోహన్రెడ్డి తరచుగా చెప్పేమాట – ‘ఎంతకాలం బతికామన్నది కాదు, ఎలా బతికామన్నది ముఖ్యం!’ఆయన బలంగా నమ్మే సిద్ధాంతం – విశ్వసనీయత! ఈ రెండంశాలు ‘సాక్షి’కి సర్వదా శిరోధార్యాలు. ఏకపక్ష వార్తల చీకటి యుగాన్ని చీల్చి చెండాడుతూ, నాణేనికి మరోవైపు కోణాన్ని పరిచయం చేసే లక్ష్యంతో ‘సాక్షి’ ఆవిర్భవించింది. లక్ష్యసాధనలో విజయం సాధించిందని చెప్పడానికి పాఠకాదరణే ఒక కొలమానం. పత్రికా రచనలోనూ, ప్రచురణలోనూ నాణ్యత, విశ్వసనీయత పాళ్లను ఏమాత్రం తగ్గకుండా ‘సాక్షి’సర్వశక్తులా ప్రయత్నిస్తున్నది. ఇన్నేళ్లుగా తమ కుటుంబంలో ఒకరిగా అక్కున చేర్చుకున్న లక్షలాది పాఠక మహాశయులకూ, వారి ఆత్మీయతకూ ‘సాక్షి’శిరస్సు వంచి నమస్కరిస్తున్నది. అండగా నిలబడుతున్న ప్రకటనకర్తలకు, తోడుగా నడుస్తున్న ఏజెంట్లకు, తెల్లవారక ముందే పాఠకుల ఇళ్లకు చేరవేస్తున్న పేపర్ బాయ్స్‌కు ‘సాక్షి’సిబ్బంది – యాజమాన్యం తరఫున శతాధిక వందనాలు, ధన్యవాదాలు. గతంలాగే ఇకముందు కూడా పాఠక కుటుంబాల్లో సభ్యురాలి పాత్రను ‘సాక్షి’ పోషిస్తుంది. మీతో కలిసి నడుస్తుంది. కలిసి ఆడుతుంది. పాడుతుంది. అవసరమైతే మీతో కలిసి మీ తరఫున పోరాడుతుంది. ఈ అనుబంధం నిరంతరం కొనసాగుతుంది.