సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ‘సాక్షి’ ఆధ్వర్యంలో కమిషనర్‌తో గతంలో ‘ఫోన్ ఇన్’ కార్యక్రమం జరిగింది. ప్రజల నుంచి వెల్లువెత్తిన ఫిర్యాదులకు స్పందిస్తూ అప్పటి జీహెచ్‌ఎంసీ కమిషనర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ప్రజలందరికీ తేలిగ్గా గుర్తుండిపోయేలా 24 గంటలు పనిచేసే కాల్‌సెంటర్ నంబర్‌ను అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. అలా అందుబాటులోకి వచ్చిందే జీహెచ్‌ఎంసీ కాల్‌సెంటర్ నంబర్ 040–21 11 11 11. అంతేకాదు.. ఆ రోజు ప్రజల నుంచి వచ్చిన పలు ఫిర్యాదులతో పాటు కొన్ని సూచనలూ ఉన్నాయి.
అలా అందిన సూచనల్లోంచి అమలు చేస్తున్నవే తడి–పొడి చెత్త వేరు చేయడం, కొన్ని మొక్కలైనా పెంచాలని ఇంటి నిర్మాణ అనుమతుల నిబంధనల్లో పొందుపరచడం తదితరమైనవి. ఏయే ప్రాంతంలో పారిశుద్ధ్య బాధ్యతలెవరివో ప్రజలందరికీ తెలిసేలా స్థానికంగా బోర్డులు ఏర్పాటు చేస్తామనీ అప్పుడే ప్రకటించారు. నగరంలోని శ్మశాన వాటికల్లో దశలవారీగా మెరుగైన సదుపాయాలు కల్పిస్తామన్నారు. అలా ఏర్పాటైందే నగరంలోని మొదటి ‘మహాప్రస్థానం’. ఇప్పుడు అన్ని జోన్లలోనూ మహా ప్రస్థానాలు అందుబాటులోకి వస్తున్నాయి. కోవిడ్ తరుణంలో కాల్‌సెంటర్‌కు ఫోన్ చేసిన వారికి ఇళ్లవద్దకే అన్నపూర్ణ భోజనాలు పంపిణీ చేశారు. అలా ఆపత్కాలంలో లక్షల మందికి ఆకలి బాధ తీరింది.
నిర్మొహమాటంగా..
పారిశుద్ధ్యం తదితర అంశాల్లో అధికారుల పనితీరు బాగాలేదని సైతం ఆనాటి కార్యక్రమంలో ప్రజలు నిర్మొహమాటంగా కుండబద్దలు కొట్టారు. ఆయా సమస్యలపై గళమెత్తారు. అన్నింటినీ సావధానంగా విన్న అప్పటి కమిషనర్ ‘నేను సోమేశ్‌కుమార్‌ను మాట్లాడుతున్నాను’ అంటూ ప్రజలతో కలిసిపోయారు. ఇలాంటి వేదికల ద్వారానే ప్రజాభిప్రాయం తెలుస్తుందని, వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అభిప్రాయపడ్డారు. ఫిర్యాదులతో పాటు సూచనలు కూడా రావడం ముదావహమన్నారు. ప్రజాభిప్రాయానికనుగుణంగా తగిన చర్యలు చేపట్టారు.
ఆనాడే వినియోగంలోకి..
ప్రస్తుతం గ్రేటర్ నగరంలో ఏ సమస్యకైనా, ఫిర్యాదుకైనా ప్రజలు ఫోన్ చేస్తున్న నెంబర్ ఆనాడు వినియోగంలోకి తెచ్చిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు రోడ్లపై చెత్త నుంచి వెలగని వీధి దీపాలు, ఆహార కల్తీ, రోడ్లపై గుంతలు, దోమలు, వరద ముంపులు.. ఇలా సమస్య ఏదైనా కార్యాలయాల దాకా వెళ్లకుండా ప్రజలు తమ సమస్యలను విన్నవించేందుకు అందుబాటులో ఉన్న నెంబర్. ఫిర్యాదును స్వీకరించే సిబ్బంది సంబంధిత అధికారులకు సమస్య చేరవేస్తారు. వివరాలన్నీ ఆన్‌లైన్‌లో నమోదవుతాయి. ప్రజలు తమ గోడు తెలిపేందుకు ఒక మార్గం లభించింది. అనంతరం మొబైల్ యాప్ వంటివి సైతం తీసుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment