Sakshi 15th Anniversary: ఈ అనుబంధం నిరంతరం! | Sakshi Editor of Sakshi media 15th Anniversary | Sakshi
Sakshi News home page

Sakshi 15th Anniversary: ఈ అనుబంధం నిరంతరం!

Published Fri, Mar 24 2023 3:01 AM | Last Updated on Fri, Mar 24 2023 12:38 PM

Sakshi Editor of Sakshi media 15th Anniversary

ఉగాదులు ఏటేటా వస్తూనే ఉంటాయి. ఎన్ని మధురోహలను అవి మిగిల్చి వెళ్తున్నాయన్నదే ముఖ్యం. ఉషస్సులు రోజూ పూస్తూనే ఉంటాయి. వాటి కాంతులు ఎన్ని క్రాంతుల్ని వెలిగించాయన్నదే ప్రధానం. పుట్టిన ప్రతి జీవికీ కాలంలో ఒక కొలమానం ఉంటుంది. జట్టు కట్టిన ప్రతి సంస్థకు కూడా ఆయుర్దాయం లెక్కలుంటాయి. ఆ కొలమానాలు, ఆయుర్దాయాలు దస్తావేజుల కోసం మాత్రమే. ఎంతకాలం బతికామన్నది కాదు, ఎలా బతికామన్నది ముఖ్యం.

క్వాలిటీ ఆఫ్‌ లైఫ్‌ ముఖ్యం. వ్యక్తికైనా, వ్యవస్థకైనా ఈ సూత్రం వర్తిస్తుంది. వ్యక్తుల జీవిత లక్ష్యాలను ఎవరికి వారే నిర్ణయించుకుంటారు. ఎంతవరకు విజయం సాధించారో తూకం వేయగల తీర్పరులు కూడా ఎవరికి వారే! వ్యవస్థల లక్ష్యాలను సమష్టి తత్వం నిర్ణయిస్తుంది. ఆ వ్యవస్థల జయాపజయాలపై భాష్యం చెప్పగలిగే వారెవ్వరు? ఆ వ్యవస్థల ద్వారా ప్రభావితమయ్యే విశాల పౌరసమాజం మాత్రమే. వ్యవస్థల పనితీరును బట్టి వాటిలో ఎప్పటికప్పుడు ఆయుష్షును నింపగలిగే ఆక్సిజన్‌ యంత్రం సమాజం దగ్గరే ఉంటుంది. 

‘సాక్షి’దినపత్రిక తెలుగింటి తలుపు తట్టి నేటికి సరిగ్గా పదిహేనేళ్లవుతున్నది. తన పదిహేనేళ్ల కాలగమనంలో ఏ రోజున కూడా మిలియన్‌ కాపీల మార్కును తగ్గకుండా తలెత్తుకుని నిలబడిన పత్రిక బహుశా ‘సాక్షి’ఒక్కటే! ఏబీసీ లెక్కల ప్రకారం సగటున 12 లక్షల సర్క్యులేషన్‌ను ‘సాక్షి’సాధించింది. ఈ ఒక్క మెతుకు చాలు అన్నం ఉడికిందో లేదో తేల్చడానికి! పన్నెండు లక్షల తెలుగు కుటుంబాల్లో సాక్షి ‘ఫ్యామిలీ’మెంబర్‌గా మారింది. ‘సాక్షి’ని తమ ఇంటి మనిషిగా ఆ కుటుంబాలు నేటికీ సమాదరిస్తున్నాయి. ఒక పత్రికను ప్రజలు ఎందుకు ఇంతగా ఆదరిస్తారు? అందుకు తగిన కారణాలుండాలి కదా! ఉన్నాయి.

లక్షలాది కుటుంబాలతో అనుబంధం పెనవేసుకోవడం వెనుక పదిహేనేళ్ల సౌభ్రాతృత్వం ఉన్నది. సంఘీభావం ఉన్నది. సాహచర్యం కొనసాగుతున్నది. తన పాఠక కుటుంబాల్లోని ప్రతి ఉద్వేగాన్ని ‘సాక్షి’పంచుకున్నది. వారి ఆనందంలో కేరింతలు కొట్టింది. దుఃఖంలో కన్నీరు తుడిచింది. వారి పోరాట స్ఫూర్తికి పదును పెట్టింది. విజయాలకు పరవశించింది. కింద పడితే చేయందించింది. అడుగడుగునా తోడునీడగా నిలవడానికి తన శక్తిమేరకు ‘సాక్షి’పని చేసింది. అందుకే ఈ చెక్కుచెదరని ప్రజాదరణ. 

సమస్యలు వ్యక్తిగతమా... సామూహికమా అన్న తేడాను చూడలేదు. న్యాయమైన పరిష్కారం కోసం బాధితులతో కలిసి నడుం కట్టింది. సిద్దిపేటలో శ్రీనివాస్‌ అనే ఓ నిరుపేద కరోనాతో కన్నుమూశాడు. భార్యాబిడ్డల్ని అద్దె ఇంటి ఓనర్‌ గెంటేశాడు. ఇద్దరు బిడ్డలతో అభాగ్యురాలు నడివీధిన నిలబడి రోదించింది. ‘సాక్షి’అండగా నిలబడింది. ప్రభుత్వం తరఫున ఆమెకో గదిని కేటాయింపజేసింది. ఉత్తరాంధ్ర గిరిజన పల్లెల్లో ప్రసవం కోసం గర్భిణులను డోలీల్లో మోసుకొని వెళ్లేవారు. కొండదారుల్లో కిలోమీటర్ల పర్యంతం అలా వెళ్లాల్సి వచ్చేది.

అనేకమార్లు దురదృష్టకర మరణాలు కూడా సంభవించేవి. ఈ అమానుషత్వంపై ‘సాక్షి’ఒక ఉద్యమాన్నే నడిపింది. ప్రభుత్వం మారిన వెంటనే స్పందన లభించింది. గర్భిణులను ప్రసవ తేదీకి వారం రోజుల ముందుగానే అతిథిగృహాల్లో చేర్చుతున్నారు. అనంతరం ఆస్పత్రికి పంపించి సుఖప్రసవం జరిగేలా చూస్తున్నారు. ప్రసవం తర్వాత అంబులెన్స్‌ను ఏర్పాటు చేసి తల్లీబిడ్డల్ని ఇంటికి సాగనంపుతున్నారు. ఇవి మచ్చుకు మాత్రమే. ఇటువంటి ఉదాహరణలు ‘సాక్షి’అనుభవంలో కొన్ని వందలున్నాయి. 

ప్రజల తరఫున ఉద్యమాలకూ, పోరాటాలకు మాత్రమే ‘సాక్షి’పరిమితం కాలేదు. సకుటుంబ సపరివారానికి సలహాదారు పాత్రను కూడా పోషించింది. సాధికారికంగా సలహాలివ్వగలిగే నిపుణులను పరిచయం చేసింది. ఈ పదిహేనేళ్లలో లక్షలాదిమంది విద్యార్థులు, ఉద్యోగార్థులూ తమ ‘భవిత’ను ‘సాక్షి’లో వెతుక్కున్నారు. సివిల్స్, గ్రూప్‌ 1, 2 వంటి పోటీ పరీక్షలైనా, అకడమిక్‌ కోర్సులైనా, క్యాట్, గేట్, నీట్, ఐఐటీ, ఎంసెట్‌ ప్రవేశ పరీక్షలైనా విద్యార్థులు ముందుగా చూసేది సాక్షినే. ఇప్పటికీ ఈ ఒరవడి కొనసాగుతూనే ఉన్నది. డైలీ ఫీచర్స్‌కు కొత్త అర్థాన్ని చెబుతూ ‘ఫ్యామిలీ’పేరుతో ప్రతిరోజూ ఒక ఇంద్రధనుసునే ‘సాక్షి’అందజేస్తున్నది.

ఫ్యామిలీ బాస్‌గా ఇల్లాలినే పరిగణిస్తూ, ఆమె కేంద్రకంగానే ఫీచర్స్‌ కథనాలను రూపొందిస్తున్నది. స్ఫూర్తిదాయకమైన మహిళా విజయాలు, చైతన్యం, ఆర్థిక స్వావలంబన, పిల్లల పెంపకం, పెద్దల కేరింగ్‌ వంటి అంశాల్లో ఎన్నో అమూల్యమైన కథనాలు ‘సాక్షి’పేజీలను అలంకరించాయి. ఫ్యామిలీ పేజీల శీర్షికలన్నీ కూడా పాఠకులకు కంఠోపాఠమే. 

మట్టిలోని మాణిక్యాలను వెలికితీసే పనిలో కూడా ‘సాక్షి’నిమగ్నమై పనిచేస్తున్నది. అటువంటి మాణిక్యాలకు ‘సాక్షి’ఎక్సలెన్స్‌ అవార్డులను అందజేసి గౌరవిస్తున్నది. గుర్తింపు కోరుకోకుండా, ప్రశంసల కోసం పాకులాడకుండా తమ పోరాటాల్లో మునిగి తేలుతున్న ఎంతోమంది రియల్‌ హీరోలను వెతికి లోకానికి పరిచయం చేస్తున్నందుకు ‘సాక్షి’గర్విస్తున్నది. సుస్థిర సేద్య పద్ధతులు కూడా వ్యవసాయరంగ సంక్షోభ పరిష్కారానికి ఒక మార్గమని బలంగా నమ్మిన ‘సాక్షి’పదిహేనేళ్లుగా తన సాగు‘బడి’లో ఈ పాఠాలను బోధిస్తున్నది.

ఈ రోజున తెలుగు రాష్ట్రాల్లోని లక్షలాదిమంది రైతులు పాటిస్తున్న ప్రకృతి సేద్య విధానాల వెనుక తను పోషించిన వైతాళిక పాత్రను ‘సాక్షి’వినమ్రంగా చాటుకుంటున్నది. చిన్నారులకోసం స్పెల్‌బీ, మ్యాథ్స్‌ బీ వంటి మెదడుకు మేత వేసే కార్యక్రమాలు, యువతరంలో క్రీడా స్ఫూర్తిని నింపడం కోసం ‘సాక్షి ప్రీమియర్‌ లీగ్‌’పోటీలు ప్రతిఏటా ‘సాక్షి’నిర్వహిస్తున్నది. ఇలా అన్ని వయసుల ప్రజలకూ, అన్ని శ్రేణుల సమూహాలకు ఉపయుక్తమయ్యే కార్యక్రమాలను భుజాన వేసుకొన్న ‘సాక్షి’నేడు జనం గుండెచప్పుడుగా మారింది. అందుకే ఈ ఆదరణ. 

‘సాక్షి’పుట్టుకే ఒక లక్ష్యంకోసం. ‘సాక్షి’వ్యవస్థాపకులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తరచుగా చెప్పేమాట – ‘ఎంతకాలం బతికామన్నది కాదు, ఎలా బతికామన్నది ముఖ్యం!’ఆయన బలంగా నమ్మే సిద్ధాంతం – విశ్వసనీయత! ఈ రెండంశాలు ‘సాక్షి’కి సర్వదా శిరోధార్యాలు. ఏకపక్ష వార్తల చీకటి యుగాన్ని చీల్చి చెండాడుతూ, నాణేనికి మరోవైపు కోణాన్ని పరిచయం చేసే లక్ష్యంతో ‘సాక్షి’ ఆవిర్భవించింది. లక్ష్యసాధనలో విజయం సాధించిందని చెప్పడానికి పాఠకాదరణే ఒక కొలమానం. పత్రికా రచనలోనూ, ప్రచురణలోనూ నాణ్యత, విశ్వసనీయత పాళ్లను ఏమాత్రం తగ్గకుండా ‘సాక్షి’సర్వశక్తులా ప్రయత్నిస్తున్నది.

ఇన్నేళ్లుగా తమ కుటుంబంలో ఒకరిగా అక్కున చేర్చుకున్న లక్షలాది పాఠక మహాశయులకూ, వారి ఆత్మీయతకూ ‘సాక్షి’శిరస్సు వంచి నమస్కరిస్తున్నది. అండగా నిలబడుతున్న ప్రకటనకర్తలకు, తోడుగా నడుస్తున్న ఏజెంట్లకు, తెల్లవారక ముందే పాఠకుల ఇళ్లకు చేరవేస్తున్న పేపర్‌ బాయ్స్‌కు ‘సాక్షి’సిబ్బంది – యాజమాన్యం తరఫున శతాధిక వందనాలు, ధన్యవాదాలు. గతంలాగే ఇకముందు కూడా పాఠక కుటుంబాల్లో సభ్యురాలి పాత్రను ‘సాక్షి’ పోషిస్తుంది. మీతో కలిసి నడుస్తుంది. కలిసి ఆడుతుంది. పాడుతుంది. అవసరమైతే మీతో కలిసి మీ తరఫున పోరాడుతుంది. ఈ అనుబంధం నిరంతరం కొనసాగుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement