ఇన్కం ట్యాక్స్ చెల్లింపులు: మీకు ఫారం -16 అవసరం లేదు
ప్రశ్న: నేను 2022 మార్చి 31వరకూ పర్మనెంట్ ఉద్యోగం చేశాను. రిటైర్ అయ్యాక ఏప్రిల్–మేలో ఓ ఉద్యోగం తర్వాత మారి జూన్, జూలై, ఆగస్టులో మరో ఉద్యోగం చేశాను. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల మానేశాను.ఆరోగ్యం కుదుటపడ్డాకా కొన్ని రోజులు కన్సల్టెంటుగా చేశాను. కలిసి రాలేదు. దాంతో అక్టోబర్ నుండి మళ్లీ ఉద్యోగం. ఎక్కడా ట్యాక్సబుల్ ఇన్కం దాటలేదు. అందుకని పన్ను రికవరీచేయలేదు.
జవాబు: ఒక ఆర్థిక సంవత్సరంలో ఇలా మీరు ఎన్ని ఉద్యోగాలు మారినా, మధ్యలో కన్సల్టెన్సీ చేసి మళ్లీ ఉద్యోగం .. ఇలా ఎన్నో చేస్తున్నారు. మీకు నెలకు వచ్చిన జీతం వివరాలు ఇవ్వలేదు. ఎవరూ పన్ను రికవరీ చేయలేదు. కాబట్టి ఫారం 16 ఇవ్వాల్సిన అవసరమూ లేదు. మీ జీతం, వేతనం అలాగే కన్సల్టెంటుగా మిగిలిన లాభం ఇలా.. మొత్తం ఆదాయం లేదా నికర ఆదాయం 2022–23 ఆర్థిక సంవత్సరానికి రూ. 5,00,000 దాటకపోతే మీకు ఎటువంటి పన్ను భారం ఏర్పడదు. నికర ఆదాయం రూ. 5,00,000 లోపల ఉంటే రిబేటు అమల్లో ఉండటం వల్ల పన్ను భారం పడదు. పన్ను రికవరీ జరగలేదు. ఇక ముందు కూడా జరగకపోతే రిఫండు ప్రశ్న రాదు.
కాబట్టి రిటర్ను వేయనవసరంలేదు. కానీ ఒక విషయం ఆలోచించాలి. ఈ ఆర్థిక సంవత్సరం రెండు నెలల్లో యజమాని జీతం ఇచ్చారు కానీ పన్ను రికవరీ చేయలేదంటున్నారు. ఆ తర్వాత మూడు నెలల పాటు మరో యజమాని కూడా అదేవిధంగా చేశారు. అంటే ఈ ఇద్దరూ ఎవరి మటుకు వాళ్లు ‘‘మీరు పన్ను భారం పరిధిలోకి రాలేదు’’ కాబట్టి వదిలేశారు.
ఉదాహరణగా, మొదటి యజమాని నెలకు రూ. 1 లక్ష ఇచ్చారనుకోండి. మీ జీతం రూ. 2 లక్షలు, బేసిక్ లిమిట్ దాటలేదు. కాబట్టి రికవరీ చేయలేదు. రెండో యజమాని కూడా నెలకు రూ. 1 లక్ష చొప్పున మొత్తం రూ. 3 లక్షలకు ఇచ్చారు అనుకోండి. మొత్తం రూ. 3 లక్షలు.. స్టాండర్డ్ డిడక్షన్ రూ. 50,000 .. మిగతాది బేసిక్ లిమిట్ దాటలేదు అందుకని రికవరీ చేయలేదు. ఇక కన్సల్టెంటు ఎందుకు రికవరీ చేయలేదో తెలియదు. నాలుగో వ్యక్తి మరో యజమాని. ఇక ఇప్పుడు మీరే స్వయంగా మీ కొత్త యజమానికి తెలియజేయండి.
గతంలో మీరు పుచ్చుకున్న జీతభత్య వివరాలు, వాటితో బాటు .. చెల్లించి ఉంటే ఇంటద్దె, మీరు చేసిన సేవింగ్స్, మెడిక్లెయిం, డొనేషన్లు .. ఇవన్నీ రాతపూర్వకంగా తెలియజేయండి. అన్నీ కలిపితే ట్యాక్సబుల్ ఇన్కం పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. కొత్త యజమానిని ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని ఆదాయాన్ని లెక్కించమనండి. ఆ ప్రకారం పన్నును రికవరీచేసి .. అంటే టీడీఎస్ చేసి లెక్కించి, చెల్లించమనండి. ఇదే సరైన మార్గం. ఒకవ్యక్తి ఒక సంవత్సర కాలంలో వచ్చినది పూర్తిగా పరిగణనలోకి తీసుకుని పన్ను భారం లెక్కించాలి సుమా!