జయలలితా మజాకా!
ఎన్నికలలో గెలవడానికి ఏమేం చేయాలో తమిళలకు తెలిసినంతగా మరెవరికీ తెలియదంటే అతిశయోక్తికాదు. సాధారణంగా ఎన్నికలలో గెలుపుకు ఉపయోగపడతాయంటే ఏ రాజకీయ పార్టీ కూడా ఏ అవకాశాన్ని వదులుకోదు. తమిళనాడులో అయితే ఒక అడుగు ముందుకు వేసి భాష, వాదం, అభిమానం...దేనినైనా తమకు అనుకూలంగా మలచుకుంటారు. అన్నాడిఎంకె అధినేత్రి, ముఖ్యమంత్రి, పురట్చితలైవి (విప్లవ వనిత) జయలలిత కూడా ఇప్పుడు అదే చేస్తున్నారు. రాజకీయాలలో ఆమె అందరికంటే 'రెండాకులు' ఎక్కువే చదివారు. తమిళుల ఆరాధ్యదైవం, ఒకప్పుడు కోలీవుడ్ ఏలిన ఎంజీఆర్‌ను ఈ ఎన్నికలలో మళ్లీ తెరపైకి తెస్తున్నారు. తైరపైకి... అంటే నిజంగానే తెరపైకి తేవడమే. అటు సినిమాల్లోనూ, ఇటు రాజకీయాల్లోనూ ఎంజిఆర్ మకుటం లేని మహరాజుగా వెలుగొందారు. ఎన్నికల వేళ తన రాజకీయ గురువు ఎంజీఆర్ సరసన తాను నటించిన చిత్రాలను విడుదల చేస్తున్నారు. ఇంకా చేసే ప్రయత్నంలో ఉన్నారు. జనం గుండెల్లో ఎక్కడో గుర్తుగా ఉండిపోయిన ఎంజీఆర్‌ను బైటకు తెచ్చి ఆయనపై వాళ్లకు ఉన్న అభిమానాన్ని ఓట్లుగా మలచుకోవాలన్నది తమిళనాట అమ్మగా పేరొందిన జయలలిత ఆకాంక్ష.
ఏది చేసినా సమయం, సందర్భం, అదను చూసుకుని చేయాలి. అప్పుడే విజయం వరిస్తుంది. ఈ సూత్రం ఈ విప్లవ వనిత బాగా వంటబట్టించుకు న్నట్లు ఉన్నారు. తగిన సమయానికే ఆమెకు ఈ ఐడియా వచ్చింది. ఓ ఐడియా జీవితాన్నే మార్చేస్తుందన్నట్లు ఇక్కడ రాజకీయాలనే మార్చేస్తుంది. ఈ ఐడియా ఓట్లను కురిపిస్తుందనడంలో ఎటువంటి సందేహం అక్కరలేదు. ఎంజీఆర్ అంటే తమిళులకు ఎంతటి అభిమానమో అందరికీ తెలుసు. ఆయన సినిమాలకు కూడా వారు హారతిపడుతుంటారు. దీనిని ఆమె గుర్తించారు. జనంలో ఎంజీఆర్‌పై ఉన్న అభిమానాన్ని ఎలాగైనా ఓట్ల రూపంలో మార్చుకోవడానికి ఆమె తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆమె పథకంలో భాగంగానే ఎంజీఆర్, జయలలిత జంటగా నటించిన చిత్రాలను ఎన్నికల వేళ విడుదల చేస్తున్నారు. ప్రజాభిమానం మెండుగా ఉన్న సినిమా హీరోలకు, హీరోయిన్లకు కలసి వచ్చే అంశం ఇది.
1965లో తెరపైకి వచ్చిన 'అయిరత్తిల్ ఒరువన్' (వేలల్లో ఒకడు) చిత్రంలో ఎంజీఆర్‌తో జయలలిత తొలిసారిగా హీరోయిన్గా నటించా రు. అప్పట్లో ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. చెన్నైలోని మిడ్‌ల్యాండ్, శ్రీకృష్ణ మేఘల థియేటర్లలో వందరోజులు దాటి ప్రదర్శితమైంది. మదురై, కోవై, తిరుచ్చి, సేలం తదితర ప్రాంతాల్లో 150 రోజులకు పైగా ఆడింది. ఈ 48 ఏళ్లలో పలు ప్రాంతాల్లో పలుమార్లు విడు దలై బయ్యర్లకు లాభాల పంట పండించింది. అలాంటి చిత్రం మళ్లీ ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీ తో ఆధునిక హంగులు దిద్దుకుని ఈ నెల 14న విడుదల చేశారు. ఈ చిత్రం ప్రదర్శించే థియేటర్ల వద్ద సందడే సందడి. ఆయా థియేటర్లలో ఎంజీఆర్ అభిమానులు భారీ కటౌట్లు, బ్యానర్లు నెలకొల్పి ఒక పండుగ వాతావరణాన్ని సృష్టించి తమ వీరాభిమానాన్ని నిరూపించుకున్నారు. అంతేకాకుండా కటౌట్లకు పుష్పాంజలి ఘటించారు. తమిళ అభిమానులు విరగబడి చూస్తున్నారు. కుటుంబ సమేతంగా ఈ సినిమా చూడడానికి తరలివస్తున్నారు. కొత్త చిత్రాలకు కూడా ఇంత ఆదరణ ఉండటంలేదని చెబుతున్నారు. ఇదే జోరు కొనసాగితే ఎంజీఆర్‌ను తెరపై చూసే వీరాభిమానులు అన్నాడిఎంకెకు ఓట్లు కుమ్మరిచ్చేస్తారని ఆ పార్టీ నేతలు కూడా గట్టిగా నమ్ముతున్నారు. అయిరత్తిల్ ఒరువన్ చిత్రం విడుదల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన అన్నాడిఎంకె కార్యకర్తలు వీలైతే రాష్ట్రావ్యాప్తంగా మరిన్ని థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేసి లబ్ధిపొందాలని ప్రయత్నిస్తున్నారు.
అన్నాడిఎంకే చేసే ఈ ప్రయత్నం డిఎంకేతో సహా ఇతర ప్రతిపక్షాలకు కడుపుమంటగా మారింది. వెంటనే జయలలిత వేసిన ఈ సినిమా ట్రిక్కును అడ్డుకోవాలని ఈసీని ఆశ్రయించారు. అయితే సినిమాలను ఆపే హక్కు తమకు లేదని వాటిని, రాజకీయాలతో ముడిపెట్టవద్దని ఎన్నికల సంఘం తేల్చి చెప్పటంతో పుండుమీద కారం చల్లినట్లైంది. చేసేదేమిలేక మిన్నకుండిపోయారు.
s.nagarjuna@sakshi.com