అభిరథ్ మెరుపు శతకం
జింఖానా, న్యూస్‌లైన్: హెచ్‌పీఎస్ (రామంతాపూర్) బ్యాట్స్‌మన్ అభిరథ్ రెడ్డి (81 బంతుల్లో 128 బ్యాటింగ్; 18 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు సెంచరీతో కదం తొక్కాడు. దీంతో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కన్సల్ట్ సీసీపై విజయం సాధించింది. ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కన్సల్ట్ సీసీ 202 పరుగుల వద్ద ఆలౌటైంది. సునీల్ (104) సెంచరీతో రాణించాడు. హెచ్‌పీఎస్ బౌలర్ జయంత్ రావు 5 వికెట్లు తీశాడు. అనంతరం హెచ్‌పీఎస్ రెండే వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. మరో మ్యాచ్‌లో భారతీయ సీసీ బౌలర్లు భార్గవ్ (5/34), అశోక్ కుమార్ (5/18) విజృంభించి ప్రత్యర్థి బ్యాట్సమెన్ను కట్టడి చేసినప్పటికీ జట్టుకు విజయం చేకూరలేదు. తొలుత కాస్మోస్ సీసీ 216 పరుగులకు ఆలౌటైంది. గురుప్రసాద్ (61) అర్ధసెంచరీ చేశాడు. తర్వాత భారతీయ సీసీ 156 పరుగులకే కుప్పకూలింది. చంద్రశేఖర్ (54) అర్ధ సెంచరీతో రాణించగా... అశోక్ కుమార్ 47 పరుగులు చేశాడు.